
నిజామాబాద్, వెలుగు: అల్పపీడన ద్రోణితో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 24 గంటలుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో జన జీవనం స్తంభించింది. జిల్లాలో 84.6 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నవీపేట మండలంలో 176.8 మి.మీ, అత్యల్పంగా రుద్రూర్ మండలంలో 39 మి.మీ వర్షం పడింది. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిరికొండ కప్పలవాగు పొంగి పొర్లుతుండడంతో కమ్మర్‌పల్లి, భీంగల్, సిరికొండ మధ్య రాకపోకలను నిలిచిపోయాయి. బోధన్ మండలం సాలూర వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. మరో రెండు రోజులు వర్షాలు ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు.
రాస్తా బంద్..
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. బాల్కొండ, బోధన్ నియోజకవర్గంలో పలు వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. మంజీరా నది ఉధృతి పెరగడంతో మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కమ్మర్‌పల్లి నుంచి ఓడ్యాట్ వెళ్లే రోడ్డు నీటి ప్రవాహనికి కొట్టుకుపోవడంతో రెండు గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి. నవీపేట మండలం లింగాపూర్‌లో తుంగిని మాటు కాల్వకు గండిపడింది.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లాలో వర్షాలు, వరదల పరిస్థితిని అధికార యంత్రాంగం ఎప్పటికప్పడుడు సమీక్షిస్తోంది. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు.
ఇబ్బంది పడిన జనం...
ఎడతెరిపి లేని వర్షాలతో జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్, న్యూ ఎన్జీవోస్ కాలనీ, ఆదర్శనగర్ కాలనీ వాసులు వరదతో ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో కరెంట్ స్తంభాలు నేల కూలడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ నగరంలో ఆదివారం రాత్రి వరకు వర్షం కురిసింది.
కామారెడ్డిలో 10.7 సెంటీమీటర్లు
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. శనివారం, ఆదివారం పడిన వర్షంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డిలో అత్యధికంగా 10.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. రామారెడ్డి, మాచారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, ఎల్లారెడ్డి, సదాశివనగర్, గాంధారి, బీబీపేట, నిజాంసాగర్, బీర్కూర్, తాడ్వాయి, రాజంపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. మండలాల్లోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పల్వంచవాగు, ఎడ్లకట్టవాగు, లింగంపేట, గాంధారి పెద్దవాగులు పొంగుతున్నాయి. రాజంపేట, తాడ్వాయి మండలాల్లోని పలు ఊర్ల మధ్య ఉన్న వాగుల్లో నీటి ఉధృతితో పెరగడంతో కాజ్‌వేలపై నీళ్లు పారుతున్నాయి. పలు మండలాల్లో వరి, మక్క, సోయా, చెరకు పంటల్లో నీళ్లు చేరాయి. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుండటంతో 8 గేట్లు ఎత్తి 82 వేల క్యూసెక్కుల నీటిని బయటకు వదిలారు. నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు వస్తోంది.14 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.