
- అపోజిషన్ లీడర్లు టార్గెట్‌గా ఆపరేషన్స్
- విచారణలో పూర్తి సమాచారం వెల్లడించిన మాజీ డీసీపీ
- సీల్డ్ కవర్‌లో కోర్టుకు రిపోర్ట్ అందజేయనున్న పోలీసులు
- నేటితో ముగియనున్న రాధాకిషన్ రావు కస్టడీ
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిటీ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ బుధవారంతో ముగియనుంది. ఆరవ రోజు విచారణలో భాగంగా మంగళవారం ఆయనను స్పెషల్‌టీమ్ విచారించింది. ఈ కేసులో రాధాకిషన్ రావు ఇప్పటికే పూర్తి సమాచారం ఇవ్వడంతో ఇందుకు సంబంధించిన ఆధారాల సేకరణపై పోలీసులు దృష్టిపెట్టారు. ఫోన్ ట్యాపింగ్‌ను నిరూపించేందుకు అవసరమైన టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించేందుకు యత్నిస్తున్నారు. ప్రణీత్‌రావుతో కలిసి అక్రమాలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో రాధాకిషన్ రావును గత నెల 29న పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతితో ఈ నెల 4వ తేదీ నుంచి వారం రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. బుధవారం కస్టడీ ముగియనుండడంతో వైద్యపరీక్షల అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. అక్కడి నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.
ఫోన్ నంబర్లను ట్రాక్ చేసి..
కస్టడీ విచారణలో రాధాకిషన్ రావు నుంచి కీలక ఆధారాలు సేకరించారు. ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు నుంచి వచ్చే సమాచారం ఆధారంగా సిటీలో ఆపరేషన్స్ చేసినట్లు వెల్లడించారు. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, వారి కుటుంబసభ్యులు, అనుచరులపై నిఘా పెట్టామని తెలిపినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో స్టేట్‌మెంట్ కూడా ఇచ్చినట్లు తెలిసింది. ఎస్‌ఐబీ అప్పటి చీఫ్ ప్రభాకర్‌రావు, స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్స్ చీఫ్ ప్రణీత్‌రావు నుంచి అందిన సమాచారం ఆధారంగా ఎలాంటి ఆపరేషన్స్ చేశారో కూడా వెల్లడించినట్లు తెలిసింది. ఈ మేరకు రాధాకిషన్ రావు వాంగ్మూలం రికార్డ్ చేసి పోలీసులు ప్రత్యేక రిపోర్ట్‌ను తయారు చేస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ డేటాతో ప్రత్యర్థులపై నిఘా
ప్రభాకర్ రావు సారథ్యంలో ప్రణీత్‌రావు టీమ్ అపొజిషన్ లీడర్లు టార్గెట్‌గా పని చేసినట్లు రాధాకిషన్ రావు కస్టడీలో వెల్లడించినట్లు తెలిసింది. టార్గెట్లను ట్రాక్ చేసేందుకు వాట్సాప్, సిగ్నల్, స్నాప్‌చాట్, సహా పలు సోషల్‌మీడియా యాప్స్‌ను వినియోగించినట్లు సమాచారం. టార్గెట్ ఫోన్ నంబర్లు, టవర్ లొకేషన్ల ఆధారంగా నిఘా పెట్టి పట్టుకునేవారమని వెల్లడించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా 2018 అసెంబ్లీ ఎలక్షన్స్‌లో శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి ఆనంద్ ప్రసాద్‌కు చెందిన రూ.70 లక్షలు, 2020లో దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల చిట్‌ఫండ్‌కు చెందిన రూ.కోటి, 2022 అక్టోబర్ లో మునుగోడు బై ఎలక్షన్స్ సమయంలో అప్పటి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుల వద్ద రూ.3.50 కోట్లు సీజ్ చేసినట్లు రాధాకిషన్ రావు చెప్పినట్లు సమాచారం.2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు టీమ్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందించిన సమాచారంతో ఆపరేషన్స్ చేశామని వెల్లడించినట్లు తెలిసింది. కాగా, రాధాకిషన్ రావు వాంగ్మూలాన్ని సీల్డ్ కవర్‌లో కోర్టుకు అందించనున్నారు.
2018 నుంచే టాస్క్ ఫోర్స్
ప్రధానంగా 2018 ఎలక్షన్ తోపాటు దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్ బై ఎలక్షన్లలో ప్రతిపక్ష నేతలే టార్గెట్‌గా ఎస్ఐబీ అప్పటి చీఫ్ ప్రభాకర్‌రావు టీమ్ పనిచేసినట్లు రాధాకిషన్ రావు వెల్లడించినట్లు తెలిసింది. సిటీలోని హవాలా వ్యాపారులు, బిజినెస్, ఫార్మా, ఐటీ కంపెనీలకు చెందిన వ్యక్తుల ప్రొఫైల్స్ తయారు చేసి వారిపై నిఘా పెట్టినట్లు తెలిపాడు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన డబ్బు పట్టుకోవడం, బీఆర్ఎస్ నేతలకు చెందిన డబ్బును అభ్యర్థులకు చేర్చడం కోసమే టాస్క్‌ఫోర్స్‌ద్వారా స్పెషల్ ఆపరేషన్స్ చేసినట్లు చెప్పాడని తెలిసింది. ఇందుకు సంబంధించిన కొన్ని కేసుల వివరాలను కూడా ఇప్పటికే రాధాకిషన్‌రావు వెల్లడించాడు. బీఆర్ఎస్ గెలుపు కోసం పోలీస్ వాహనాల్లోనే డబ్బులు తరలించినట్లు కూడా ఆయన అంగీకరించినట్లు సమాచారం.