
- రాష్ట్ర సర్కారుపై ఈసీకి తరుణ్ చుగ్ ఫిర్యాదు
- ఫేక్ ట్రాన్సాక్షన్లు చూపిస్తూ మునుగోడులో తప్పుడు ప్రచారంపై మండిపాటు
- టీఎన్జీవో, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్లపైనా కంప్లైంట్
న్యూఢిల్లీ, వెలుగు: మునుగోడు ఓటర్లను ప్రభావితం చేసేందుకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తోందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ ఆరోపించారు. బీజేపీ లీడర్ల బ్యాంకు ఖాతాల నుంచి నగదు బదిలీ అయ్యిందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీ) ఆయన ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు కాపీని ఆయన మంగళవారం మీడియాకు విడుదల చేశారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్లు జరిగాయంటూ టీఆర్ఎస్ అబద్ధపు ప్రచారం చేయడం మునుగోడు ఓటర్లను తప్పుదారి పట్టించడమేనని పేర్కొన్నారు. ఏదైనా వ్యక్తి/ సంస్థకు చెందిన బ్యాంకింగ్ వివరాలు, లావాదేవీల విషయాలు సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవడం కూడా కరెక్ట్ కాదని అన్నారు.
పర్సనల్ వ్యవహారాల్లో తలదూరుస్తున్నరు
కొందరికి చెందిన, కొన్ని కంపెనీలకు చెందిన పర్సనల్ వ్యవహారాల్లో చొరబడేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని తరుణ్ చుగ్ ఆరోపించారు. ఫేక్ లావాదేవీలను చూపిస్తూ మునుగోడులో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గూగుల్ పే, ఫోన్ పే, ఇతర అప్లికేషన్‌ల ద్వారా టీఆర్ఎస్ నేరుగా ఓటర్లకు నగదు బదిలీ చేస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని చుగ్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన బైపోల్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల టైంలోనూ టీఆర్‌ఎస్ పార్టీ ఈ రకమైన వ్యవహారం నడిపించిందని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
టీఆర్ఎస్ కు ఓటు వేయాలని ఒత్తిడి చేస్తున్నరు
టీఎన్జీవో, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ వంటి ఉద్యోగ సంఘాలు, ఇతర ఉద్యోగుల సంఘాలు టీఆర్‌ఎస్ అభ్యర్థికి ప్రచారం చేస్తున్నాయని చుగ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. టీఆర్ఎస్ కు ఓటు వేయాలని ప్రభుత్వ ఉద్యోగులు బహిరంగంగానే ఓటర్లపై ఒత్తిడి చేస్తున్నారంటూ పత్రికల్లో కథనాలు వస్తున్నాయని వివరించారు. పబ్లిక్ సర్వెంట్లు అయిన టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్, సెక్రటరీ శ్రవణ్ కుమార్, ఆర్టీసీఈఏ సెక్రటరీ థామస్ ఏ రాజకీయ పార్టీ కోసం ప్రచారం చేయడానికి అధికారం లేదని గుర్తు చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.