సంగారెడ్డి బల్దియాలో ‘ఔట్ సోర్సింగ్’ గోల్ మాల్!

సంగారెడ్డి బల్దియాలో ‘ఔట్ సోర్సింగ్’ గోల్ మాల్!

సంగారెడ్డి/కంది, వెలుగు : సంగారెడ్డి బల్దియాలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాల్లో గోల్​మాల్ ​జరిగినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ, ఆఫీసర్ల అండతో ఏజెన్సీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగులను ఎక్కువ సంఖ్యలో చూపుతూ తక్కువ మందితో పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీలో 19 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా, శానిటేషన్ విభాగంలో కాంట్రాక్ట్ కింద 224 మంది, ఔట్ సోర్సింగ్ కింద 160 మంది విధులు నిర్వహిస్తున్నట్లు రికార్డులో చూపిస్తున్నారు. అయితే ఔట్​సోర్సింగ్, కాంట్రాక్ట్​ కింద మొత్తం 384 మంది ఉద్యోగులు ఉన్నట్లు చెప్తున్నా పనులు మాత్రం 305 మందితోనే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. 

సెక్షన్లు మారుస్తున్రు.. 

ఒక సెక్షన్​ పేరుతో నియామకాలు చేపట్టి ఉద్యోగులను మరో సెక్షన్​ లో పనులు చేయిస్తున్నారు. శానిటేషన్, వాటర్ వర్క్స్ లైన్ మెన్స్, కంప్యూటర్ ఆపరేటర్లు, బిల్ కలెక్టర్లు, డ్రైవర్లు, స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్ స్టాఫ్, ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేయాల్సి ఉంది. కానీ నిబంధనలకు వ్యతిరేకంగా సూపర్ వైజర్లను కంప్యూటర్ ఆపరేటర్లుగా, ఆపరేటర్లను ఇతరత్రా విభాగాల్లో ఇలా.. అన్ని సెక్షన్లలో మార్పులు చేయడం వివాదాలకు దారి తీస్తోంది. ఈ విషయంలో ప్రశ్నించిన వారిని  ఉద్యోగం నుంచి తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో కాంట్రాక్టర్లకు భయపడి ఉద్యోగులు ఏ పని చేయమంటే ఆ పని చేస్తూ సైలెంట్​ అయిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. 

చుట్టాలకు ఎక్కువ జీతం..!

మున్సిపాలిటీలో పనిచేస్తున్న వారిలో కొందరు అధికార పార్టీ కౌన్సిలర్ల చుట్టాలు ఉన్నారు. ఓ కౌన్సిలర్ బంధువు సుమారు ఐదేండ్ల కింద ఎలక్ట్రికల్ సూపర్​ వైజర్ గా జాయిన్ అయ్యాడు. ఎలాంటి ఉత్తర్వులు లేకుండా కంప్యూటర్  గా మూడేండ్లుగా జీతం తీసుకుంటున్నా పని చేయడం లేదని సమాచారం.  ప్రస్తుతం సూపర్​ వైజర్ కు నెలకు రూ.19 వేలు ఇస్తుండగా, ఆపరేటర్ కు రూ.22 వేల జీతం చెల్లిస్తున్నారు. ఇలా మరిన్ని పోస్టుల్లో కొందరు కౌన్సిలర్ల బంధువులను నియమించుకొని అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే వారికి ఇష్టమొచ్చిన వారిని అటెండర్లుగా నియమించి వారి నుంచి నెలవారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ప్రశ్నిస్తే ఇబ్బంది పెడుతున్రు

మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తే ఇబ్బంది పెడుతున్నారు. సొంత పార్టీ లీడర్ అని కూడా చూడకుండా సమస్యల పరిష్కారం కోసం ఫండ్స్ అడిగితే ఇవ్వడం లేదు. ఔట్​ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాల్లో ఒకరిద్దరు బీఆర్ఎస్ లీడర్లు భారీ అవినీతి చేస్తున్నారు. ఇది తప్పని చెప్పినందుకు తనను పార్టీ నుంచి దూరం చేయాలని చూస్తున్నారు. చైర్ పర్సన్ భర్త ఆగడాలు ఎక్కువైనందుకే అవిశ్వాస తీర్మానం పెట్టారు. చాలామంది కౌన్సిలర్లు వ్యతిరేకంగా ఉన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తే వాస్తవాలు తెలుగులోకి వస్తాయి.– నర్సింలు, బీఆర్ఎస్ లీడర్

విచారణ చేపడతాం.. 

ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కింద పనిచేసే ఉద్యోగుల నియామకాలపై వస్తున్న ఆరోపణల గురించి విచారణ చేపడతాం. ఉద్యోగుల లెక్కలు పక్కాగా ఉన్నాయి. సిబ్బంది కొరత ఉన్నప్పుడు మాత్రమే సెక్షన్ల వారీగా మార్పులు జరుగుతుంటాయి. 

– చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్

‘అవిశ్వాసం’ తర్వాత వెలుగులోకి... 

మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయ లక్ష్మిపై అవిశ్వాస తీర్మానం అంశం ముందుకొచ్చాక మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. కాంట్రాక్ట్​ ఉద్యోగుల్లో కొంతమంది చైర్​ పర్సన్​ బంధువులే ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ విభాగాల్లో జరిగిన నియామకాల్లో జరిగిన అవకతవకలను ఆధారాలతో నిరూపించేందుకు కొందరు అధికార పార్టీ లీడర్లే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. లేని ఉద్యోగుల పేరుతో జీతాలు చెల్లించ డంలో అధికారుల పనితీరుపై అనుమా నాలు ఉన్నాయంటూ సొంత పార్టీ కౌన్సిలర్లే అనడం చర్చనీయాంశంగా మారింది.