బిల్లులు చెల్లించకపోవడంతో చేతులెత్తేసిన  కాంట్రాక్టర్లు

బిల్లులు చెల్లించకపోవడంతో చేతులెత్తేసిన  కాంట్రాక్టర్లు

సంగారెడ్డి, వెలుగు: జిల్లాలో ‘మనఊరు– -మనబడి’ పనులు ఏడియాడనే పెండింగ్​పడ్డాయి. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. ఇటీవల జరిగిన ఓ రివ్యూ మీటింగ్​లో కలెక్టర్ డాక్టర్ శరత్ విద్యాశాఖ, సంబంధిత ఇంజినీరింగ్ ఆఫీసర్ల పనితీరుపై సీరియస్ అయ్యారు. ఫండ్స్​ ఉన్నా.. కాంట్రాక్టర్లు పనులు ఎందుకు పూర్తి చేస్తలేరని? ఆఫీసర్లు ఏం చేస్తున్నారని  ప్రశ్నించారు. దీంతో సంబంధిత  ఆఫీసర్లు కాంట్రాక్టర్లను పిలిపించి పెండింగ్​పనులు పూర్తి చేయాలని, సకాలంలో బిల్లులు చెల్లిస్తామని  చెప్పారు. ఆఫీసర్ల మాటలపై నమ్మకం లేదని, చేసిన పనులకు బిల్లులివ్వకపోయినా సరే ఆ పనులు చేయమని కాంట్రాక్టర్లు తెగేసి చెప్తున్నారని తెలుస్తోంది. మరి కొందరు  ముందుగానే హామీ పత్రాలు  పలు కండిషన్లు పెడుతున్నారని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘మన ఊరు –-మనబడి’ పనులు, స్కూళ్ల అభివృద్ధి ప్రశ్నార్థకమే అన్న చర్చ సాగుతోంది.  

జిల్లాలో ఇప్పటివరకు ఇలా.. 

జిల్లా మొత్తంలో వివిధ కేటగిరీల స్కూళ్లు 1,262 ఉండగా ‘మన ఊరు మన బడి ’ ఫస్ట్​ ఫేజ్ కింద 441 స్కూళ్లను ఎంపిక చేశారు. ఇందులో కోర్టు కేసులు, వివిధ కారణాలతో 4 స్కూళ్లల్లో పనులు చేయడం లేదు. కాగా 437 స్కూళ్లలో 2,439 పనులు చేయించేందుకు ప్లాన్ చేయగా ఇప్పటి వరకు 640 పనులు మాత్రమే కాంట్రాక్టర్లు పూర్తి చేశారు. మిగతా 1,174 పనులు వివిధ దశల్లో  సాగుతున్నాయి. ఇంకా 627 పనులు అసలే స్టార్ట్ చేయలేదు. కొన్ని స్కూళ్లల్లో రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు జరిగే పనులకు కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. 107 స్కూళ్లల్లో రూ.30 లక్షలకు పైగా ఫండ్స్​తో చేపట్టాల్సిన 2,439 పనులకు జిల్లా యంత్రాంగం పలుమార్లు టెండర్లు పిలవగా, 53 స్కూళ్లలో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. మిగిలిన 54 స్కూళ్లకు ఎవరూ రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.

దిద్దుబాటు చర్యల్లో ఆఫీసర్లు

 కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో విద్యాశాఖ, ఇంజినీరింగ్​ఆఫీసర్లు దిద్దుబాటు చర్యల్లో నిమగ్నమయ్యారు. బిల్లుల చెల్లింపులపై కాంట్రాక్టర్లకు స్పష్టమైన హామీలు ఇస్తూ పనులు చేసేందుకు ముందుకు రావాలని నచ్చ చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన 2,439 పనులకు రూ.17.12 కోట్లతో అంచనాలు రూపొందించగా, రూ.9.50 కోట్లు ప్రభుత్వం విడుదల చేసినట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. బిల్లుల చెల్లింపులలో ఎలాంటి డిలే చేయమని  కాంట్రాక్టర్లలో భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.