సంగారెడ్డి జిల్లాలో మన ఊరు – మనబడి పనులు డెడ్ స్లో!

సంగారెడ్డి జిల్లాలో మన ఊరు – మనబడి పనులు డెడ్ స్లో!
  • సంగారెడ్డి జిల్లాలో రెండేండ్లుగా కొనసాగుతున్న మొదటి విడత
  •     441 స్కూళ్లకు గానూ 44 స్కూళ్లలోనే పనులు పూర్తి
  •     నేటికీ 7 స్కూళ్లలో పనులు మొదలు పెట్టలే
  •     పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
  •     తల్లిదండ్రులు, స్టూడెంట్లు అసంతృప్తి

సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లాలో ‘మన ఊరు– మన బడి’ పనులు జరగట్లేదు. ఈ స్కీమ్ కింద అధికారులు మొదటి విడతలో మొత్తం 441 గవర్నమెంట్ స్కూళ్లను ఎంపిక చేశారు. వీటిలో మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటించారు. అయితే గడిచిన రెండేళ్లలో 44 స్కూళ్లలో మినహా ఎక్కడా పనులు పూర్తి చేయలేదు. ఏడు స్కూళ్లలో అస్సలు పనులే మొదలుపెట్టలేదు. 

కార్పొరేట్​స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని గత బీఆర్ఎస్​ప్రభుత్వం ఆర్భాటంగా ఈ స్కీమును ప్రారంభించింది. సకాలంలో ఫండ్స్​రిలీజ్ చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కొన్నిచోట్ల అరకొరగా సాగుతున్నాయి. విద్యాశాఖ అధికారులు తమకు పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. రెండు, మూడో విడతల ఊసెత్తడం లేదు. మూడు విడతల్లో ప్రభుత్వ బడులను సంస్కరించాలని భావించినా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. మొదటి విడత పనులే పూర్తికాకపోవడంపై తల్లిదండ్రులు, స్టూడెంట్లలో అసంతృప్తి నెలకొంది. 

సివిల్​ వర్క్స్​పెండింగ్​

సంగారెడ్డి జిల్లాలో మన ఊరు-– మనబడి తొలి విడతలో 441 స్కూళ్లను ఎంపిక చేశారు. ఇందులో 256 ప్రాథమిక, 61 మాధ్యమిక, 124 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 363, పట్టణ ప్రాంతాల్లో 78 స్కూళ్లు ఉన్నాయి. ఇందులో 335 స్కూళ్లలో రూ.30 లక్షల లోపు పనులున్నట్లు, 106 స్కూళ్లలో రూ.30 లక్షల పైన పనులున్నట్లు గుర్తించారు. 

మొదటి విడతలో టాయిలెట్స్, క్లాస్ రూమ్స్, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, విద్యుత్ సౌకర్యం, తాగునీటి సరఫరా, స్టూడెంట్స్ కు డ్యుయల్ డెస్కులు, పెయింటింగ్స్, గ్రీన్ చాక్ బోర్డులు, ఇతర ఏర్పాట్లు చేయాల్సి ఉంది. 260 స్కూళ్లలో డ్యుయల్ డెస్కులు, 120 స్కూళ్లలో కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేశారు. 102 పాఠశాలల్లో పెయింటింగ్స్, 338 స్కూళ్లల్లో గ్రీన్ చాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. నేటికీ చాలా స్కూళ్లో సివిల్ వర్క్స్​పెండింగ్​ఉన్నాయి.

పనుల లెక్కలు లేవ్​

మొదటి విడతలో ఎంపిక చేసిన 441 స్కూళ్లలో ఇప్పటివరకు 44 స్కూళ్లు పూర్తిస్థాయిలో రెడీ అయ్యాయి. పూర్తయిన పనులతో పాటు కొనసాగుతున్న పనులకు రూ.84 కోట్లు రిలీజ్​చేయాలని జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రూ.73 కోట్లు రిలీజ్ కాగా, పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. అయితే మొదటి విడతలో 441 స్కూళ్లకు ఎంత మొత్తం ఖర్చు అవుతుందనే దానిపై జిల్లా విద్యాశాఖ వద్ద లెక్కలు లేవు. 

పూర్తయిన పనులకు మాత్రమే గత ప్రభుత్వం బిల్లులు పంపించిందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫండ్స్​రిలీజ్​చేసి స్కూళ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.