
- డిసెంబర్లో 148 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్
- పోస్టుల సంఖ్యను 77కు తగ్గించేందుకు ప్రయత్నాలు
- కొత్త రోస్టర్ తయారు చేస్తున్న వ్యవసాయ శాఖ
- ఆ లిస్టు వచ్చాకే ఫైనల్ కీ విడుదల చేయనున్న కమిషన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీలో అయోమయం నెలకొన్నది. ఆ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహించి, మూడు నెలలైనా ఇప్పటికీ ఫైనల్కీ విడుదల చేయ లేదు. అభ్యర్థులంతా ఫలితాల కోసం వేచిచూస్తుంటే, ప్రకటించిన పోస్టులను తగ్గించే పనిలో సర్కారు పడింది. నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టుల్లో సగానికి కోత పెట్టనున్నామని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. దీంతో అభ్యర్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిరుడు డిసెంబర్ 28న టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వాటిలో మల్టీ జోన్1 పరిధిలో వంద, మల్టీ జోన్ 2 పరిధిలో 48 పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో జనవరి 10 నుంచి 30 వరకూ అప్లికేషన్లు ప్రక్రియ జరగ్గా, 8961 మంది అప్లై చేసుకున్నారు. మే 16న రాష్ట్రంలో మూడు జిల్లాల్లో 27 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్స్ నిర్వహించారు. పేపర్ 1 కు మొత్తం 6,546 మంది, పేపర్ 2కు 6,519 మంది అటెండ్ అయ్యారు. మే 27న ప్రిలిమినరీ కీని రిలీజ్ చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది. తర్వాత నుంచి ఫైనల్ కీ గానీ, రిజల్ట్స్ గానీ టీఎస్ పీఎస్సీ వెల్లడించలేదు. దీనిపై అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.
పోస్టుల తగ్గింపునకు చర్యలు
ముందుగా ప్రకటించిన148 పోస్టుల పోస్టులను తగ్గించాలని అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ నిర్ణయించినట్లు తెలిసింది. దీంట్లో భాగంగానే ఫలితాలు విడుదల చేయవద్దని టీఎస్ పీఎస్సీని వ్యవసాయ శాఖ కోరినట్లు సమాచారం. పోస్టులను 77కు కుదించేలా ఏర్పాట్లు చేస్తోంది. దీనికి అనుగుణంగా రోస్టర్, ఖాళీల వివరాలను రెడీ చేస్తున్నారు. వీటిని టీఎస్పీఎస్సీకి పంపిస్తే, ఆ వెంటనే ఫలితాలు వెల్లడించే అవకాశముంది. అయితే, 2015 నుంచి ఇప్పటి వరకూ అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయలేదు. వాటి భర్తీ కోసం ప్రకటించిన పోస్టులనూ తగ్గించడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ప్రకటించిన148 పోస్టులను వ్యవసాయ శాఖ పంపిస్తేనే, ఆర్థిక శాఖ ఆ పోస్టుల భర్తీకి క్లియరెన్స్ ఇచ్చింది. ఇప్పుడు అధికారులు పోస్టులను తగ్గించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. కాగా, పోస్టుల తగ్గింపుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
నిరుద్యోగులకు అన్యాయం చేయొద్దు
టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ లో పేర్కొన్నట్లు 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయాలె. ఫలితాలు విడుదల చేయాలని ఇప్పటికే టీఎస్ పీఎస్సీ అధికారులకు పలుమార్లు విన్నవించాం. అగ్రికల్చర్ ఆఫీసుకు వెళ్లి అధికారులను కలిస్తే, పోస్టులు తగ్గించే యోచనలో ఉన్నట్టు చెప్తున్నారు. ఇది సరికాదు. నిరుద్యోగులకు అన్యాయం చేయొద్దు.
- హరిప్రసాద్,ఎన్ఎస్యూఐ స్టేట్ వైస్ ప్రెసిడెంట్