అడిగేవాళ్లు లేరని అడ్డగోలుగా దోచుకుంటున్రు

అడిగేవాళ్లు లేరని అడ్డగోలుగా దోచుకుంటున్రు
  • అడిగేవాళ్లు లేకపోవడంతో అడ్డగోలు చార్జీలు
  • ప్రభుత్వం ఫిక్స్​ చేసిన రేట్లు ఎక్కడా అమలైతలే
  • ఒమిక్రాన్​ భయంతో టెస్టుల కోసం జనం క్యూ
  • ఎయిర్‌‌‌‌పోర్టులో వారంలోనే రూ. 70 లక్షల దోపిడీ
  • సెంటర్లపై కొరవడిన హెల్త్ ఆఫీసర్ల పర్యవేక్షణ

పర్మిషన్​ లేకున్నా చేస్తున్నరు
రాష్ట్రంలో 76  ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లకు మాత్రమే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసేందుకు పర్మిషన్ ఉంది. ఇవిగాక పర్మిషన్ లేని సెంటర్లలోనూ టెస్టులు చేస్తున్నారు. చాలా సెంటర్లలో టెస్టింగ్ ప్రొటోకాల్‌‌ను పాటించడం లేదు. 

కొన్ని చోట్ల ఫాల్స్​ రిపోర్టులు ఇస్తున్నారు. పాజిటివ్‌‌కు బదులు నెగటివ్, నెగటివ్‌‌కు బదులు పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నారు. ఇటీవల యూకే నుంచి వచ్చిన మహిళ విషయంలోనూ ఇట్లనే జరిగింది‌‌. ఆమెకు ఎయిర్‌‌పోర్ట్‌‌లో టెస్ట్ చేసి తొలుత నెగటివ్ సర్టిఫికెట్ ఇచ్చారు‌‌. ఆ తర్వాత పాజిటివ్ తేలిందంటూ టిమ్స్‌‌కు తరలించారు. టిమ్స్‌‌లో టెస్ట్ చేస్తే నెగటివ్ వచ్చింది. 
హైదరాబాద్‌‌‌‌, వెలుగు:
ప్రైవేట్​ డయాగ్నస్టిక్​ సెంటర్లు, ప్రైవేటు హాస్పిటళ్లు కరోనా టెస్టుల పేరిట మళ్లీ దోపిడీ షురూ జేశాయి. టెస్టులకు ఇష్టమున్నట్లు రేట్లు ఫిక్స్​ చేసి పేషెంట్ల నుంచి వసూలు చేస్తున్నాయి. అడిగేవాళ్లు లేకపోవడంతో అందినంత దోచుకుంటున్నాయి. 500 రూపాయల ఆర్టీపీసీఆర్​ టెస్టుకు 1500 దాకా తీసుకుంటున్నాయి. శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లో ఈ దోపిడీ పీక్‌‌లో ఉంది. అక్కడ ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ టెస్టుకు రూ. 3,900 వసూలు చేస్తున్నారు. సెకండ్ వేవ్ తర్వాత టెస్టింగ్ సెంటర్ల వైపే చూడని జనం.. ఒమిక్రాన్ అలజడితో సర్ది, దగ్గు వంటి లక్షణాలు కొద్దిగ కనిపించినా కరోనా టెస్ట్‌‌ చేయించుకుంటున్నారు. చాలా ప్రభుత్వ సెంటర్లలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయకపోవడంతో ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లకు క్యూ కడ్తున్నారు. ఇదే అదునుగా సెంటర్ల నిర్వాహకులు ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్ల కంటే డబుల్ చార్జ్​ తీసుకుంటున్నారు. 
అసలు ధర ఐదొందలే
ఆర్టీపీసీఆర్ టెస్టుల ధరలను నియంత్రిస్తూ నిరుడు డిసెంబర్‌‌‌‌లోనే ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ల్యాబ్‌‌ లేదా హాస్పిటల్‌‌కు వెళ్లి శాంపిల్ ఇస్తే రూ. 500, ఇంటికొచ్చి శాంపిల్ తీసుకెళ్తే రూ.750 చార్జ్​ చేయాలని పేర్కొంది. కానీ, రాష్ట్రంలోని 99 శాతం డయాగ్నస్టిక్ సెంటర్లు 
ఈ చార్జీల జీవోను తుంగలో తొక్కి, తమ సొంత చార్జీలనే వసూలు చేస్తున్నాయి. 
ల్యాబ్‌‌కు వెళ్లి శాంపిల్ ఇస్తే రూ. 800 నుంచి 1,500 వరకూ చార్జ్ చేస్తున్నాయి. ఇంటికి వెళ్లి శాంపిల్ కలెక్ట్ చేసుకుంటే రూ. వెయ్యి నుంచి  2 వేల వరకు తీసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకూ విదేశాలకు ప్రయాణించే వాళ్లు మాత్రమే కరోనా టెస్టులు చేయించుకునేవారు. ఒమిక్రాన్ భయంతో టెస్టులు చేయించుకునేవాళ్ల సంఖ్య 30 శాతం వరకు పెరిగింది. ఇదే అదునుగా ల్యాబ్ యాజమాన్యాలు కూడా తమ ధరలను పెంచుతున్నాయి. ప్రభుత్వ జీవో పరిధి నుంచి తప్పించుకునేందుకు కొన్ని పెద్ద డయాగ్నస్టిక్ సెంటర్లు ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ అనే కొత్త పేరు సృష్టించాయి. అసలైతే ఆర్టీపీసీఆర్​, ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్‌‌ టెస్టుల్లో పెద్ద తేడా ఏమీలేదు. ఆర్టీపీసీఆర్ రిజల్ట్ రావడానికి మూడు గంటలు పడితే, ర్యాపిడ్‌‌ ఆర్టీపీసీఆర్ రిజల్ట్ గంటలో ఇస్తున్నారు. వాస్తవానికి జనరల్ ఆర్టీపీసీఆర్ చేసే మిషన్ కంటే, ర్యాపిడ్‌‌ ఆర్టీపీసీఆర్ చేసే మెషీన్​కే తక్కువ ఖరీదు. కానీ, టెస్ట్‌‌ చేసే కిట్ ఖరీదు మాత్రం ఎక్కువగా ఉంది. ఈ టెస్టుల ధరపై ప్రభుత్వ కంట్రోల్​ లేకపోవడం, కిట్ ధర ఎక్కువగా ఉండడాన్ని కారణంగా చూపి ప్రైవేటు డయాగ్నస్టిక్​ సెంటర్లు అడ్డగోలుగా చార్జ్ చేస్తున్నాయి. 
ఎయిర్​పోర్టులో వారంలోనే రూ. 70 లక్షలు
ఎట్‌‌ రిస్క్ జాబితాలోని దేశాల నుంచి ఎవరైనా వస్తే వారు ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లో కచ్చితంగా టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ రూల్​ అమల్లోకి వచ్చాక ఆయా దేశాల నుంచి 2,567 మంది ప్యాసింజర్లు శంషాబాద్​ ఎయిర్​పోర్టుకు వచ్చారు.  ఇందులో 60 శాతం మంది ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకుంటే, 40 శాతం మంది నార్మల్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నారు. ఈ లెక్కన సదరు సంస్థ వారం రోజుల్లోనే రూ. 70 లక్షలకుపైగా సంపాదించింది. నిజానికి, తొలుత ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ రూ. 4,500 వరకూ వసూలు చేశారు. బాధితుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం కావడంతో రూ. 3,900కు తగ్గించారు. ఈ చార్జీ కూడా ఎక్కువేనని ఎక్స్‌‌పర్ట్స్‌‌ అంటున్నారు. అయితే, తాము చేసేది ఆర్టీపీసీఆర్ కాదని, ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ అని ఈ టెస్టుకు ఖర్చు ఎక్కువ అవుతుందని సదరు సంస్థ చెప్తున్నది. 
ఒక్క ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లోనే కాదు, రాష్ట్రంలోని చాలా డయాగ్నస్టిక్ సెంటర్లలోనూ ఇదే దందా నడుస్తున్నది.
ఏ టెస్టయినా ఇంతే..!
కరోనా టెస్టుల విషయంలోనే కాదు డయాగ్నస్టిక్ వ్యవస్థపైనే ప్రభుత్వం కంట్రోల్​ కోల్పోయింది. ఎవరికి నచ్చిన ధర వాళ్లు వసూలు చేసుకోవడమే తప్ప, ఇంతే చార్జ్ చేయాలన్న రూల్సేమీ మన దగ్గర లేవు. ఇదే ప్రైవేటు యాజమాన్యాలకు బలంగా మారి.. చారణ టెస్టుకు, బారణ వసూలు చేస్తూ దందా సాగిస్తున్నాయి.  దవాఖాన, డయాగ్నస్టిక్ సెంటర్ స్థాయిని బట్టి ఒకే టెస్టుకు రకరకాలుగా బిల్లులేస్తున్నారు. ఉదా.. సీబీపీ టెస్టుకు చిన్న డయాగ్నస్టిక్​ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.150 నుంచి 250 మధ్య,  ప్రైవేటు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.300 నుంచి 450 వరకు, కార్పొరేట్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.600 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ఎందుకని ప్రశ్నిస్తే.. అడ్వాన్స్‌‌డ్ ఎక్విప్‌‌మెంట్‌‌ వాడుతున్నాం అని, టెస్టుల కోసం క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నామని సాకులు చెప్తున్నారు. ఆ కిట్ల నాణ్యత ఏందో, ఆ ఎక్విప్‌‌మెంట్ ఎంత అడ్వాన్స్‌‌డో పరిశీలించి ధరలను నియంత్రించాల్సిన ఆఫీసర్లు లైట్ తీసుకుంటున్నారు.

ఎక్కువ వసూలు చేస్తే ఫిర్యాదు చేయండి
ఆర్టీపీసీఆర్ టెస్టులకు గతంలోనే చార్జీలు ఖరారు చేసినం. అంతకు మించి ఎవరైనా వసూలు చేస్తే 9154170960 నంబర్‌‌‌‌కు వాట్సప్‌‌ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరుతున్నం. ఎయిర్‌‌‌‌పోర్టులో ఎక్కువ చార్జ్ వసూలు చేయడంపై ఫిర్యాదులు వచ్చినయి.  షోకాజ్ నోటీసులు ఇచ్చినం. అంతేకాదు.. ర్యాపిడ్ టెస్టు కిట్ల ధరలు, ఇతర అంశాలను నిపుణుల కమిటీ పరిశీలిస్తున్నది. కమిటీ సూచనల మేరకు ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్‌‌‌‌ టెస్ట్‌‌కు కూడా రీజనబుల్ చార్జ్ ఖరారు చేస్తం. ప్రస్తుతం యాంటిజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులు అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌‌లో చేస్తున్నం. ప్రజలు అనవసరంగా ప్రైవేటుకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దు.-డాక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌‌‌‌