
ముషీరాబాద్, వెలుగు : హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిపిన తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులకు రూ. 3.5 కోట్లు పట్టుబడింది. లోయర్ ట్యాంక్ బండ్-లోని మ్యారియట్ హోటల్ వద్ద మంగళవారం తెల్లవారు జామున తనిఖీలు చేపట్టగా..రెండు షిఫ్ట్ డిజైర్ కార్లల్లో రూ.3.5 కోట్లు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. డబ్బుకు సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేసినట్లు చెప్పారు.
కార్లల్లో ప్రయాణిస్తోన్న గంట సాయికుమార్ రెడ్డి, మహేశ్, సందీప్ కుమార్, మహేందర్, అనీష్ రెడ్డి, భరత్ అనే ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి రెండు కార్లు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి నగరంలో భారీగా హవాలా సొమ్ము పట్టుబడుతోంది.