
- తెరవెనుక ఓ పెద్దాఫీసర్
- మండలానికో ఏజెంట్ నియామకం!
హనుమకొండ, వెలుగు: లేబర్ డిపార్ట్మెంట్లో ప్రైవేటు ఏజెంట్లు, బ్రోకర్ల దందా ఆగడం లేదు. లేబర్కార్డుల జారీ నుంచి మ్యారేజ్, డెలివరీ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ తదితర వ్యవహారాలన్నీ వారి చేతుల మీదిగానే నడుస్తున్నాయి. బ్రోకర్లు లేకపోతే ఆఫీస్‌లో ఏ పనీ కాదనే కాడికి తీసుకొచ్చారు. ఓ పెద్దాఫీసరే స్వయంగా కొంతమంది ఏజెంట్లను నియమించుకుని దందా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మండలానికో ఏజెంట్..
వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికులకు ప్రభుత్వ లేబర్‌కార్డు ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు కల్పిస్తోంది. లేబర్ కార్డు ఉన్న వ్యక్తి ఇంట్లో పెండ్లిళ్లు, డెలివరీలకు సాయం చేయడంతో పాటు యాక్సిడెంట్లు, నార్మల్, యాక్సిడెంటల్ డెత్స్ కు రూ.లక్షల్లో ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. దీంతో అర్హులైన ఎంతోమంది పేదలు ప్రభుత్వం అందించే సాయం కోసం అప్లై చేసుకుంటున్నారు. కాగా లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా పేదలకు అందాల్సిన సొమ్ములో కమీషన్లు కొల్లగొట్టేందుకు ఓ ఆఫీసర్ ఎక్కడికక్కడ ఏజెంట్లను నియమించుకున్నారు. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హసన్‌పర్తి, కమలాపూర్, కాజీపేట, హనుమకొండ, ఐనవోలులో ఇలా మండలానికో వ్యక్తిని పెట్టుకుని వారి ద్వారా దందా చేస్తున్నట్లు సమాచారం. గ్రామాల్లో కార్డు లేని వారికి కార్డులు ఇప్పించడం, కార్డు ఉన్నవారికి వివిధ బెనిఫిట్స్అందేలా చేస్తామంటూ కమీషన్లు దండుకుంటున్నారు. గ్రామస్థాయిలో బ్రోకర్లు లబ్ధిదారుల నుంచి వసూలు చేస్తున్న సొమ్ములో తమ కమీషన్ పోనూ మిగతా మొత్తాన్ని ఏజెంట్లకు అందిస్తుండగా.. ఈ ఏజెంట్లంతా నెలనెలా సదరు ఆఫీసర్‌కు మామూళ్లు ముట్టజెప్పుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇంకొందరితో అక్రమ వసూళ్లు..
పెద్దాఫీసర్ సపోర్టుతో కొంతమంది ఏజెంట్లు లేబర్ఆఫీసర్ అవతారమెత్తినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో తామే లేబర్ ఆఫీసర్లమంటూ వసూళ్లకు పాల్పడుతున్నారు. లేబర్ లైసెన్స్ లేనివాళ్లను టార్గెట్ చేసి వసూళ్లకు పాల్పడటం, ఉన్న లైసెన్స్ లను రిన్యూవల్ పేరున దండుకుంటున్నారు. ఒకవేళ ఎక్కడైన బాల కార్మికులు ఉంటే.. ఆయా షాపుల యజమానులను కేసుల పేరున భయభ్రాంతులకు గురి చేసి వారి నుంచి పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఏజెంట్ తానే లేబర్ ఆఫీసర్ నని చెప్పుకుంటూ వివిధ షాపుల యజమానుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతుండగా.. ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల మొదటి వారంలో అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని లేబర్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఓ పెద్దాఫీసరే నియమించినట్టు తెలిసింది. దీంతో ఆయన అక్రమ దందాపై పోలీసులు గుట్టుగా కూపీ లాగుతున్నట్లు సమాచారం.
గతం నుంచే దందా..
డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్న పెద్దాఫీసర్ గతంలో సస్పెన్షన్ దాకా వెళ్లి వచ్చాడు. అయినా పనితీరు మార్చుకోలేదు. ప్రస్తుతం లేబర్ఆఫీస్ కలెక్టరేట్ లో ఉండగా, అంతకుముందు బాలసముద్రంలోని రెంటెడ్ బిల్డింగ్ లో ఉండేది. ఆ బిల్డింగ్కిందనే ఓ మీసేవా కూడా రన్ చేస్తూ అందులోనే లేబర్ కార్డులు, ఇన్సురెన్స్ క్లెయిమ్స్ దందా సాగించేవారనే ఆరోపణలున్నాయి. గ్రామాల్లో ఉండే బ్రోకర్లు, మండలాల్లో ఉండే ఏజెంట్లు అంతా ఈ మీసేవా ద్వారానే దందా నడిపించేవారు. దీంతో ఈ బాగోతాన్ని అప్పట్లోనే ‘వెలుగు’ పేపర్ వరుస కథనాలతో బయటపెట్టగా.. సదరు ఆఫీసర్ సస్పెన్షన్ కు రంగం సిద్ధమైంది. కానీ తనకున్న పలుకుబడితో ఆయనపై వేటు పడకుండా మేనేజ్ చేసుకున్నట్లు తెలిసింది.