గుండుతో ఉపాధి పనికి.. ఫేస్ ఐడెంటిఫికేషన్లో గుర్తుపట్టని యాప్.. ఈ అన్న ఉపాయానికి హ్యాట్సాఫ్ !

గుండుతో ఉపాధి పనికి.. ఫేస్ ఐడెంటిఫికేషన్లో గుర్తుపట్టని యాప్.. ఈ అన్న ఉపాయానికి హ్యాట్సాఫ్ !

మహబూబాబాద్ జిల్లా: గుండు చేయించుకొని ఉపాధి హామీ పనికి వెళ్లిన కూలీకి ఊహించని తిప్పలు ఎదురయ్యాయి. ఉపాధి హామీ పథకంలో కూలీల హాజరు నమోదుకు యాప్లో ఫేస్ ఐడెంటిఫికేషన్ తప్పనిసరి. అయితే.. గుండుతో ఉన్న కూలీని ఆ యాప్ గుర్తుపట్టకపోవడంతో ఆ కూలీ పడరాని పాట్లు పడ్డాడు. పక్కనే ఉన్న మహిళా కూలీ జుట్టును తన నెత్తిన విగ్గులా అమర్చితే యాప్ యాక్సెప్ట్ చేసింది.

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కొమటిపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. రెండు రోజుల క్రితం కొండగట్టుకు వెళ్లి అంజన్నస్వామి సన్నిధిలో శ్రీనివాస్ అనే ఈ కూలీ తలనీలాలు ఇచ్చాడు. కొండగట్టుకు వెళ్లొచ్చాక ఎప్పటిలానే ఉపాధి పనికి వెళ్లాడు. గుండుతో ఉపాధి హామీ పనులకు హాజరైన శ్రీనివాస్ను సదరు యాప్ గుర్తుపట్టలేదు. దీంతో.. ఇలా ఫేస్ ఐడెంటిఫికేషన్ కోసం పడరాని పాట్లు పడాల్సి వచ్చింది.

ఉపాధి హామీ పనుల్లో ఇకపై కూలీల హాజరును ఫేస్ అథెంటికేషన్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉపాధి హామీ పథకం కింద జరిగే పనుల్లో అవకతవకలను అరికట్టేందుకు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్(ఎన్‌ఎంఎంఎస్)ను రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సర్క్యులర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు ముఖ చిత్రం గుర్తింపు తప్పనిసరి చేసింది. కానీ ముఖం గుర్తింపు రాక కూలీలు కొందరు ఇంటికి తిరిగి వెళుతున్న పరిస్థితి ఉంది.

అయితే కుమురం భీమ్ జిల్లాలో ముఖం గుర్తింపు పడకుండా ఇబ్బందులు తొలగించడానికి జైనూర్ మండలం జామిని గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ బాబు కూడా వినూత్నంగా ఆలోచించాడు. ముఖ చిత్రాలు పడని వారి ముఖాలకు టాల్కమ్ పౌడర్ వేస్తున్నారు. ముఖానికి పౌడర్ కొట్టడంతో సులువుగా సెల్ ఫోన్లో ముఖాల గుర్తింపు రికార్డు అవుతున్నాయి. ఈ చిన్న ఉపాయంతో ఉపాధి కూలీలకు హజరు నమోదవుతుంది. ముఖ గుర్తింపు కోసం ఈ ఫీల్డ్ అసిస్టెంట్ చేసిన ఉపాయం బాగుందని అందరూ అభినందిస్తున్నారు.