
- ధర్నాలు, సభలు, సమావేశాలకు ఆంక్షలు
- అనుమతుల్లేవంటూ అడుగడుగునా పోలీసుల అడ్డగింతలు
- ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు
- పాదయాత్ర చేయాలన్నా, ఇంట్లో దీక్షకు దిగాలన్నా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి
- అధికార పార్టీ నిరసనలకు మాత్రం పోలీసుల రెడ్ కార్పెట్
హైదరాబాద్, వెలుగు: ధర్నాలు, రాస్తారోకోలు, సమ్మెలు, మానవహారాలు.. ఇట్ల తీరు తీరు నిరసనలతో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జనం, ప్రతిపక్షాలు గొంతెత్తే స్వేచ్ఛ లేకుండాపోయింది. ఎవరు ఏ సమస్యపైనైనా ఆందోళన చేయాలన్నా.. నిరసన తెలుపాలన్నా.. పోలీసులు ‘నో’ అంటున్నారు. పర్మిషన్ ఇవ్వబోమంటూ ఖరాఖండిగా చెప్తున్నారు. ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలతో అడుగడుగునా అడ్డుకుంటున్నారు. మరోవైపు అధికార పార్టీ లీడర్లు చేసే ధర్నాలు, ఆందోళనలకు మాత్రం దగ్గరుండి భారీ బందోబస్తు, భద్రత కల్పిస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమంపై ప్రభుత్వం అప్రకటిత నిషేధాన్ని అమలు చేస్తున్నదనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. ఎవరు గొంతెత్తాలన్నా, పాదయాత్ర చేయాలన్నా, సభలు పెట్టుకోవాలన్నా, చివరికి ఇంట్లో దీక్షకు దిగాలన్నా హైకోర్టును ఆశ్రయించి, అనుమతి తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. తాజాగా సర్పంచుల ఆందోళన విషయంలోనూ హైకోర్టే అనుమతి ఇవ్వాల్సి వచ్చింది.
గ్రామ పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుందంటూ కొన్నిరోజులుగా సర్పంచులు మండిపడుతున్నారు. పార్టీలకు అతీతంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. అధికార పార్టీకి చెందిన సర్పంచులే కొన్నిచోట్ల రాజీనామాలకు సిద్ధపడ్డారు. వారందరి తరఫున హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద ధర్నాకు కాంగ్రెస్ పిలుపునివ్వగా ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకుంది. ధర్నాకు అనుమతి నిరాకరించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించగా.. 300 మందికి మించకుండా ధర్నా చౌక్‌లో ధర్నా చేసుకునేలా అనుమతి ఇవ్వాలని హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
మిలియన్ మార్చ్ ‘ఆట పాట’కు పోలీస్ బ్రేక్
మిలియన్ మార్చ్‌కు ఏడేండ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో 2018 మార్చి 10న ట్యాంక్‌బండ్‌పై ‘ఆట పాట’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. విద్యార్థి సంఘాలు, వామపక్షాలు, రాజకీయ పార్టీలు దానికి మద్దతును ప్రకటించాయి. కానీ, పోలీసులు మాత్రం హింస జరుగుతుందన్న సాకు చూపి కోదండరాం సహా ముఖ్య నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. జిల్లాల్లో ముఖ్య నేతలను గృహ నిర్బంధం చేశారు. అంతేకాదు.. ట్యాంక్‌బండ్ చుట్టుపక్కల బారికేడ్లతో పోలీసు వలయాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన మిలియన్ మార్చ్‌కు సంబంధించి ‘ఆట పాట’ ఏర్పాటు చేస్తే.. అణచివేయడం ఏమిటని ఉద్యమ కారులు, ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు.
ఆర్టీసీ కార్మికుల ఉద్యమంపై ఉక్కుపాదం
తమ పీఎఫ్ డబ్బులను సర్కారు వాడుకుంటున్నదని, ఆర్టీసీ డిపోలను అధికార పార్టీ లీడర్లకు కట్టబెడుతున్నారని ఆరోపిస్తూ 2019 అక్టోబర్ 6న ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సమ్మెను ప్రారంభించారు. పని భారాన్ని తగ్గించి తమకూ పీఆర్సీని వర్తింపజేయాలంటూ ఆందోళనలు, నిరసనలు చేశారు. కానీ, రాష్ట్ర సర్కార్ మాత్రం వారి డిమాండ్లు, విజ్ఞప్తులను ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా ఉద్యోగం చేయకుండా డిపోల ముందు ఆందోళన చేస్తున్న వారిని నియంత్రించాలంటూ పోలీసులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లోనూ ఉద్యోగులపై పోలీసులు లాఠీలను ఝళిపించారు. ఇంట్లోనే ఆమరణ దీక్షకు దిగిన ఆనాటి టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డిని పోలీసులు అక్రమంగా ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేశారు. ఆయన్ను అరెస్ట్ చేయడంపై వందలాది మద్దతుదారులు నిరసనలకు దిగారు. వాటిని పట్టించుకోని సీఎం కేసీఆర్.. అసలు ఆర్టీసీలో ఉద్యోగ, కార్మిక సంఘాలు ఎందుకని ఫైరయ్యారు.
వాటన్నింటినీ రద్దు చేస్తూ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో హక్కుల కోసం పోరాడడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని ప్రభుత్వం అణచేస్తున్నదని ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు కోర్టులను ఆశ్రయించాయి. సింగరేణిలోనూ సమ్మెలు నిషేధమంటూ పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులను జారీ చేసింది. కార్మికులు తమ హక్కుల కోసం పోరాడకుండా అడ్డుపుల్లలు వేసింది. కానీ, కల్వకుంట్ల కవిత గౌరవాధ్యక్షురాలిగా ఉన్న సింగరేణి కార్మిక సంఘం టీబీజేకేఎస్ మాత్రం సమ్మెలు, ఆందోళనలు చేయడం గమనార్హం.
షర్మిలను ఇల్లు కదలనియ్యలే..
హనుమకొండ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరం తండా వద్ద గత ఏడాది నవంబర్ 28న షర్మిల పాదయాత్ర సందర్భంగా.. ఆమె బస్సును బీఆర్ఎస్ కార్యకర్తలు తగులబెట్టారు. ఆ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. రివర్స్‌లో ఆమెను అరెస్ట్ చేశారు. దానికి నిరసనగా ఆ తర్వాత రెండు రోజులకు ప్రగతి భవన్‌కు బయల్దేరిన షర్మిలతో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. ఆమె కారులో కూర్చుని ఉండగానే కారును టో చేస్తూ తీసుకెళ్లిపోయారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారంటూ రిమాండ్‌కు పంపించే ప్రయత్నం చేశారు. కోర్టు తిరస్కరించడంతో ఆమెను పోలీసులు విడుదల చేశారు.
డిసెంబర్ 9న ఇంటి వద్దే షర్మిల నిరాహారదీక్ష చేపడితే.. ఆ మర్నాడు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. పాదయాత్రకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ నిర్బంధించారు. అదే నెల 13న పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చినా పోలీసులు షర్మిలను బయటకు వదల్లేదు. దీంతో హైకోర్టు తీర్పన్నా కేసీఆర్ సర్కారుకు, పోలీసులకు గౌరవం లేదంటూ ఆమె మండిపడ్డారు.
టీచర్ల గొంతెత్తనియ్యలే
భర్తను, భార్యను, కుటుంబాన్ని దూరం చేసే 317 జీవోను రద్దు చేయాలంటూ టీచర్లు ధర్నా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదు. తమ పిల్లలతో టీచర్లు చాలా చోట్ల ఆందోళనకు దిగగా పోలీసులు అడ్డుకున్న సందర్భాలున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి 9న ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించ తలపెట్టిన మహాధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లాల నుంచి టీచర్లు రాకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. నిర్బంధాలను దాటుకుని వచ్చిన టీచర్లను ధర్నాచౌక్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థి సంఘాల పాత్ర మరువలేనిది.
ఉమ్మడి రాష్ట్రంలో పోలీసుల లాఠీలకు ఎదురొడ్డి ఉద్యమాన్ని స్టూడెంట్లు నడిపారు. అయితే, ఉద్యమానికి గుండెకాయలాగా ఉన్న ఓయూలో ఇప్పుడూ నిర్బంధాలే కొనసాగుతున్నాయి. కొందరు విద్యార్థులు కలిసి మాట్లాడుకుంటే చాలు పోలీసులు వచ్చి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే తమపై దాడులు జరుగుతున్నాయని, పోలీసులతో సర్కారు నిర్బంధాలను అమలు చేస్తున్నదని పలు విద్యార్థి సంఘాలు అంటున్నాయి. నిరుడు మే 6న ఓయూ స్టూడెంట్లతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమావేశమవ్వాలని అనుకుంటే.. వర్సిటీలో రాజకీయ సమావేశాలు నిషిద్ధమని ఆక్షేపిస్తూ ఓయూ మేనేజ్మెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్ భారీ నిరసనను తెలియజేసింది. దీంతో పోలీసులు విద్యార్థి నేతలను అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్లోనే ఆ విద్యార్థి నేతలను రాహుల్ పరామర్శించాల్సి వచ్చింది.
ధర్నా చౌక్‌నే ఎత్తేయాలనుకొని..!
ప్రజా సంఘాలు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు ధర్నా చేసుకోవాలంటే కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నాచౌక్. కానీ, సొంత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండేండ్లకే అంటే 2016లోనే కేసీఆర్ సర్కార్ ఆ ధర్నాచౌక్‌ను ఎత్తేసింది. సిటీ బయటకు తరలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనబాట పట్టాయి. 2017 మేలో ‘సేవ్ ధర్నా చౌక్’ పేరుతో ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు భారీ ర్యాలీని నిర్వహించాయి. పోలీసులు వారిపై లాఠీచార్జి చేయడంతో చాలా మంది నేతలకు గాయాలయ్యాయి. ఆ ఆందోళనలు కొనసాగుతుండగానే ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టుకు లేఖ రాశారు. పలు రాజకీయ పార్టీలు పిల్ వేశాయి. విచారించిన హైకోర్టు 2018 నవంబర్ 13న ధర్నా చౌక్‌పై నిషేధాన్ని ఎత్తేస్తూ ప్రభుత్వంపై మండిపడింది. ధర్నాలు అడవుల్లో చేసుకోవాల్నా అంటూ ఫైర్ అయింది.
చేజ్ చేసి మరీ సంజయ్ అరెస్ట్
2022 జనవరి 2న కరీంనగర్ ఎంపీ ఆఫీసులో బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ దీక్షకు కూర్చుంటే.. తలుపులు పగులగొట్టి, గ్రిల్స్ ఊడగొట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. 317 జీవోకు వ్యతిరేకంగా పోరాడుతున్న టీచర్లకు మద్దతుగా ఆయన నిరసనకు దిగగా రాత్రికిరాత్రే పోలీసు జీపులోకి బలవంతంగా ఎక్కించారు. దీంతో సంజయ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. నిరుడు నవంబర్ 27న పాదయాత్రకు బయల్దేరిన సంజయ్ కాన్వాయ్‌ను పోలీసులు చేజ్ చేసి మరీ జగిత్యాల–కోరుట్ల మధ్య అరెస్ట్ చేశారు.
భైంసాలో జరిగే సభకు, పాదయాత్రకు అనుమతి లేదంటూ పేచీలు పెట్టారు. దీంతో హైకోర్టుకెళ్లి పర్మిషన్ తెచ్చుకుని సభ, పాదయాత్రను సంజయ్ నిర్వహించారు. ఇప్పుడే కాదు.. గతంలోనూ ఆయన పాదయాత్రలు చేస్తుంటే రాష్ట్ర సర్కారు ఎన్నో సార్లు ఆటంకాలు సృష్టించింది. అనుమతులు లేవంటూ పోలీసులతో అడ్డం పడింది. ప్రతీసారీ ఆయన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడం.. హైకోర్టుకెళ్లి పర్మిషన్లు తెచ్చుకోవడం కామన్ అయిపోయింది.
అధికార పార్టీ నిరసనలకు మాత్రం పోలీసుల సహకారం
ప్రతిపక్షాలు ఏం చేయాలనుకున్నా అడ్డుపుల్ల వేస్తున్న పోలీసులు.. అధికార పార్టీకి మాత్రం రెడ్ కార్పెట్ వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ట్రాఫిక్‌ను ఎక్కడికక్కడ ఆపేసి మరీ అధికార పార్టీ నేతల ధర్నాలకు కాపలా కాస్తున్నారు. ధర్నా చౌక్ వద్దని ఎత్తేసిన సీఎం కేసీఆర్.. అదే ధర్నా చౌక్ వద్ద 2021 నవంబర్ 12న ధర్నా చేశారు. వడ్ల కొనుగోళ్లపై మంత్రులు, పార్టీ కేడర్ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ధర్నాకు దిగారు. ఆ ధర్నాకు పోలీసులు దగ్గరుండి బందోబస్తు చేపట్టారు.
అదే అంశంపై ఆ తర్వాత 2022 ఏప్రిల్ 11న ఢిల్లీలో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ధర్నాకు కూర్చుంది. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందులో పాల్గొన్నారు. ఇటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై రాష్ట్రమంతటా పార్టీ నేతలు గత ఏడాది ధర్నాలు చేస్తే.. వాటికీ పోలీసులు అనుమతులిచ్చారు. కల్లాల పేరు చెప్పి బీఆర్ఎస్ నేతలు గత ఏడాది డిసెంబర్ 23న రాష్ట్రమంతటా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ధర్నాలు చేపట్టారు. వాటికి కూడా పోలీసులు అనుమతి నిరాకరించలేదు సరికదా.. దగ్గరుండి బందోబస్తు నిర్వహించారు.
పిలుపునిస్తే చాలు రేవంత్ హౌస్ అరెస్ట్
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఎప్పుడు ఆందోళనలకు పిలుపునిచ్చినా.. పోలీసులు వెంటనే ఆయన ఇంటికి చేరుకోవడం, హౌస్ అరెస్ట్ చేయడం పరిపాటిగా మారింది. 2021 డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఇప్పటిదాకా చాలా సార్లు రేవంత్‌ను బయటకు వెళ్లనివ్వకుండా హౌస్ అరెస్ట్ చేశారు. వడ్ల కొనుగోళ్లు, 317 జీవోపై టీచర్లకు మద్దతుగా, కరెంట్ చార్జీల పెంపుకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిస్తే.. ఆయన్ను గృహ నిర్బంధం చేశారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తున్న సునీల్ కనుగోలు ఆఫీసుపై సైబర్ క్రైమ్ పోలీసులు దాడి చేసి ఐదుగురు ఉద్యోగులను అరెస్ట్ చేయడంతో పాటు సీడీలు, కంప్యూటర్లను తీసుకెళ్లిపోయారు.
సునీల్ ఆఫీసుపై దాడులను నిరసిస్తూ డిసెంబర్ 14న కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిస్తే జిల్లాల్లో ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పంచాయతీ నిధులను సర్పంచులకు తెలియకుండా రాష్ట్ర సర్కారు వాడుకోవడం ఏమిటంటూ జనవరి 2న (సోమవారం) ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అయితే, ఈ సారి కూడా రేవంత్‌తో పాటు ముఖ్య నేతలందరినీ పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. ధర్నాచౌక్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన రేవంత్‌ను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో ధర్నాకు పర్మిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.