బిగ్ బాస్ : క్లాస్, ట్రాష్.. మధ్యలో మాస్

బిగ్ బాస్ : క్లాస్, ట్రాష్.. మధ్యలో మాస్

తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో అలకలు, గొడవలు, ఆరోపణలు, అరుపులు అన్నీ మామూలే. కాకపోతే మెల్లగా మొదలవుతాయి. కానీ, ఈసారి సీన్ రివర్స్. మొదటి రోజు నుంచే హౌస్ వేడెక్కింది. బిగ్‌బాస్ ఇచ్చిన ‘క్లాస్ మాస్ ట్రాష్’ టాస్క్‌ ఆ హీట్‌ని మరింత పెంచింది. మొదటి రోజు మొదలైన గేమ్ రెండో రోజు కూడా కొనసాగుతుండటంతో సెకండ్ డే కూడా కంటెస్టెంట్లు ఒకరిపై మరొకరు కారాలు, మిరియాలు నూరారు. 

ఇనయా ఇక్కట్లు

మొదటి రోజే గీతూ రాయల్‌తో ఇనయాకి గొడవ జరిగింది. అప్పుడే ఆమె చాలా అప్‌సెట్ అయిపోయింది. ఆ డిస్టర్బెన్స్ రెండో రోజూ కొనసాగింది. ట్రాష్‌ నుంచి మాస్‌కి తర్వాత క్లాస్‌కి చేరిన గీతూ.. మాస్ సభ్యులతో పనులు చేయించుకునే క్రమంలో ఇనయాని బాగా టార్గెట్ చేసింది. నిమ్మరసం కలుపుకొని రమ్మని, పాట పాడమని, తన బెడ్ దగ్గర ఉన్న దువ్వెన తెచ్చి ఇవ్వమని.. ఇలా రకరకాల పనులు చెబుతూ విసిగించే ప్రయత్నం చేసింది. ప్రతీకారం తీర్చుకుంటున్నానని డైరెక్ట్ గానే చెప్పేసింది.

ఇనయా తిరగబడింది..

తన కోపాన్ని తగ్గించుకుని అన్ని పనులూ చేసినా.. పాట పాడమని అడిగినప్పుడు మాత్రం ఇనయా తిరగబడింది. నాకు రాదు, నేను పాడను అని చెప్పింది. అయినా.. గీతూ వెంటపడటంతో నీకోసం నేనెందుకు పాడాలి అంటూ ఇనయా చిరాకు పడింది. ఆ తర్వాత జరిగిన టాస్క్ లో కూడా చాలా ఇరిటేట్ అయ్యింది. రేవంత్, అభినయశ్రీ పోటీ పడినప్పుడు ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా సపోర్ట్ చేయడం నచ్చలేదంటూ అనవసరమైన టాపిక్ లేవనెత్తింది. పైగా తాను ఆడినప్పుడు అలా చేయొద్దని కూడా చెప్పింది. దాంతో ఎవరూ సపోర్ట్ చేయలేదు. ఆ విషయానికి కూడా అలిగింది.

తననెవరూ సపోర్ట్ చేయట్లేదంటూ..

రెండు రౌండ్ల తర్వాత తననెవరూ సపోర్ట్ చేయట్లేదంటూ ఫ్రస్ట్రేట్ అవ్వడమే కాకుండా బాత్రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేసింది. ఆ టాస్క్ లో విన్ అయిన నేహ మాత్రం చాలా తెలివిగా వ్యవహరించింది. చాలా గట్టి పోటీని ఇచ్చావు, నువ్వు చాలా స్ట్రాంగ్, అనవసరంగా ఫీలవ్వకు అంటూ ఇనయాని ఓదార్చింది. ఆ తర్వాత కూడా వచ్చి ఆదిరెడ్డితో అంతుకు ముందు జరిగినదాని గురించి ఆర్గ్యుమెంట్‌కి దిగింది ఇనయా. నా మీదికొచ్చి అరిచావంటూ అతనిని తప్పుబట్టడంతో ఆదిరెడ్డి షాకయ్యాడు. ఆమె కనుక తన ఎమోషన్స్ ను, కోపాన్ని  కంట్రోల్ చేసుకోకపోతే ముందు ముందు మరిన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొవాల్సి రావొచ్చు. 

రుక్‌జా రేవంత్..!

రేవంత్ చాలా యాక్టివ్. మెచ్యూర్డ్గానూ కనిపిస్తున్నాడు. ఆటని త్వరగా అర్థం చేసుకుంటున్నాడు. అయితే మాట చాలా ఫాస్ట్. దానివల్ల బ్యాడ్ అయ్యే అవకాశం ఉంది. అది గమనించిన కొందరు రేవంత్‌కి నచ్చజెప్పే ప్రయత్నం ఆల్రెడీ చేశారు. ఏదైనా జరిగినప్పుడు, ఎవరైనా ఏదైనా అన్నప్పుడు కాసేపు ఆగి, ఆలోచించి, ఆ తర్వాత రియాక్టయితే బాగుంటుందని సలహా ఇచ్చారు. దాన్ని రేవంత్ కూడా పాజిటివ్‌గా తీసుకున్నాడు. ఇది కనుక పాటిస్తే రేవంత్ కచ్చితంగా ఫైనల్స్ వరకు వెళ్లగలడు. ఎందుకంటే తాను అందరితో కలిసిపోయే లక్షణం కలవాడని మొదటి రోజే ప్రూవ్ అయ్యింది. ఆటను అర్థం చేసుకుంటున్న తీరు కూడా చాలా బాగుంది. పైగా టాస్క్ విషయంలో ఇనయా ఉమన్ కార్డ్ ఉపయోగించి సింపతీ కోసం ట్రై చేసినప్పుడు కూడా బ్యాలెన్స్డ్‌గా వ్యవహరించి తప్పుకున్నాడు. కాబట్టి కాస్త ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోగలిగితే రేవంత్ స్ట్రాంగ్ కంటెండర్ అవుతాడు. 

గలాటా కంటిన్యూస్
గీతూ రాయల్‌ తన  గలాటాని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఆమె ఇలాగే ఉంటే ఇక ఎన్నాళ్లు భరించాలిరా దేవుడా అనే ఫీలింగ్ ప్రేక్షకులకు వచ్చే ప్రమాదమూ ఉంది. ఇనయాని టార్గెట్ చేసి ఇరిటేట్ చేయడమే కాకుండా.. రేవంత్ ఆమెని క్లాస్‌కి పంపితే అదేదో తన తెలివితేటలతో వచ్చినట్టు తెగ హడావుడి చేసింది. పైగా తోటి సభ్యులతోటి, బిగ్‌బాస్‌తోటి మాట్లాడే తీరు కూడా కాస్త అతిగా అనిపిస్తోంది. అది తన స్టైల్ అని ఆమె అనుకుంటూ ఉండొచ్చు. కానీ, ఇది ఇలాగే కొనసాగితే గీతూ ప్రమాదంలో పడే చాన్స్ ఉంది. ఎందుకంటే.. మొదటి రోజునే అందరూ తనని ట్రాష్‌లో పడేశారు.

నెక్స్ట్ వీక్ నుంచి..

టాస్క్‌ ముగిసే సమయానికి క్లాస్‌లో ఉండబట్టి ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యిందే కానీ.. నెక్స్ట్ వీక్ నుంచి హౌస్‌మేట్స్ నామినేట్ చేస్తారు కాబట్టి వారిని మంచి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ తనకి యాటిట్యూడ్ ఎక్కువ ఉందని మిగతా సభ్యులు మాట్లాడుకోవడం కనిపిస్తోంది. ఇనయా లాంటి కొందరు ఇప్పటికే గీతూ మీద గుర్రుగానూ ఉన్నారు. సో.. ఆమె తన తీరు మార్చుకోకపోతే అతి త్వరలో డేంజర్‌‌ జోన్‌లో పడే అవకాశం ఉంది. బిగ్‌బాస్‌ రివ్యూలు చేసి ఇక్కడి వరకు వచ్చిన గీతూ ఈ తరహాలో ఆడటం కాస్త మింగుడుపడని విషయమే.

ఇక కపుల్‌గా హౌస్‌లో ఎంటరైన మరీనాకి, రోహిత్‌కి మధ్య కూడా చిన్న తగాదా వచ్చింది. తాను చెప్పింది అతను శ్రద్ధగా వినకపోవడంతో మరీనా కాస్త కోప్పడింది. అది నచ్చక ఓవరాక్షన్ చేయొద్దంటూ రోహిత్ చిరాకుపడ్డాడు. ఈ విసుగులు, కోపాలు, అలకల మధ్య క్లాస్, మాస్, ట్రాష్ టాస్క్‌ ముగిసిపోయింది. కొందరు నామినేషన్‌ నుంచి సేవ్ అయ్యారు. కొందరు కెప్టెన్సీ టాస్క్ కు అర్హులయ్యారు. మొత్తానికి హౌస్‌ అయితే క్షణక్షణానికీ గరం గరంగా మారుతోంది.

మిస్టర్‌‌ కూల్‌గా బాలాదిత్య..

అయితే.. ఎవరు ఎలా గొడవలు పడుతున్నా కొందరు మాత్రం అందరితో కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. కొందరేమో మిగతా వారిని గమనిస్తూ ఎలా ఆడాలా అని ఇంకా అంచనాలు వేసుకుంటున్నట్టు కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు మాత్రం హౌస్‌లో మిస్టర్‌‌ కూల్‌గా బాలాదిత్య పేరు తెచ్చుకున్నాడు. తన మాట, నడత కూడా మెచ్యూర్డ్‌గా ఉండటంతో అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు. ముందు ముందు ఏం జరుగుతుందో.. ఎవరు ఎలా.. మారతారో చూడాలి మరి.