అంబులెన్స్ కు డబ్బు ల్లేక.. తల్లి శవాన్ని మోసుకెళ్లిండు

అంబులెన్స్ కు డబ్బు ల్లేక.. తల్లి శవాన్ని మోసుకెళ్లిండు

జల్ పాయ్​గుడి: పశ్చిమ బెంగాల్ లో దారుణం జరిగింది. అంబులెన్స్ కు డబ్బుల్లేక తల్లి శవాన్ని భుజాలపై మోసుకెళ్లాడో కొడుకు. జల్ పాయ్ గుడి జిల్లాలోని క్రాంతి గ్రామానికి చెందిన రామ్ ప్రసాద్ దేవాన్.. అనారోగ్యానికి గురైన తన తల్లి(72)ని బుధవారం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ట్రీట్​మెంట్ పొందుతూ ఆమె గురువారం చనిపోయింది. డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు రామ్ ప్రసాద్ ప్రైవేట్ అంబులెన్స్ లను అడగ్గా డ్రైవర్లు రూ.3 వేలు డిమాండ్ చేశారు. అంత డబ్బు లేకపోవడంతో తండ్రి సాయంతో 40 కిలోమీటర్ల దూరంలోని ఇంటికి తల్లి శవాన్ని మోసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. డెడ్ బాడీని బ్లాంకెట్ లో చుట్టుకొని తన భుజాలపై మోసుకుంటూ ఇంటికి బయలుదేరాడు. కొంతదూరం వెళ్లాక ఓ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వాళ్లు గుర్తించి అంబులెన్స్ అరేంజ్ చేశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘‘అమ్మను ఇంటి నుంచి హాస్పిటల్ కు అంబులెన్స్ లోనే తీసుకెళ్లాను. అప్పుడు రూ.900 ఇచ్చాను. కానీ తిరిగి వచ్చేటప్పుడు అంబులెన్స్ ఆపరేటర్లు రూ.3 వేలు డిమాండ్ చేశారు. అంత డబ్బులేక డెడ్ బాడీని మోసుకొచ్చాను” అని రామ్ ప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటన దురదృష్టకరమని హాస్పిటల్ సూపరింటెండెంట్ కల్యాణ్ ఖాన్ అన్నారు. ‘‘పేదలకు మేం ఫ్రీగా అంబులెన్స్ అరేంజ్ చేస్తున్నాం. వాళ్లు మమ్మల్ని అడగలేదు. అడిగి ఉంటే అంబులెన్స్ లో పంపించేవాళ్లం” అని చెప్పారు. అంబులెన్స్ డ్రైవర్లు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఆస్పత్రి దగ్గర ఫ్రీ సర్వీస్ అందించేందుకు తమలాంటి సంస్థలను అనుమతించడంలేదని రామ్ ప్రసాద్ కు సాయంచేసిన సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వాళ్లు చెప్పారు. కాగా, ఈ ఆరోపణలను అంబులెన్స్ అసోసియేషన్ ఖండించింది. తాము కూడా ఫ్రీ సర్వీస్ అందిస్తున్నామని పేర్కొంది.