సొంతిల్లు ఉంటే చాలు.. తిన్నాతినకున్నా ఎలాగోలా బతికేయొచ్చు

సొంతిల్లు ఉంటే చాలు.. తిన్నాతినకున్నా ఎలాగోలా బతికేయొచ్చు

సొంతిల్లు ఉంటే చాలు. తిన్నా...తినకున్నా.. ఎలాగోలా బతికేయొచ్చు. ఎక్కువమంది అనే మాట ఇది. నెలవారీ అద్దె ఇబ్బందులు, ఓనర్​తో ఆంక్షల తిప్పలు లేకుండా ఉండాలంటే ‘మనది’ అనే ఇల్లొకటి కావాలి. అందుకే ఎవరికి ఉన్న స్థోమత బట్టి వాళ్లు.. అప్పోసొప్పో చేసి.. ఇల్లో, ఫ్లాటో కొనుక్కుంటారు. అయితే ఈ మధ్య ... అంటే కొవిడ్​ పరిస్థితుల తరువాత కొనుక్కునే ఆ గూడు... అపార్ట్​మెంట్​లో ఫ్లాట్​ కాకుండా ఇండిపెండెంట్​ ఇల్లో లేదా విల్లానో అయితే బాగుండు అనుకుంటున్నారు ఎక్కువమంది. ఇంతకీ ఏది బెటర్​?

ఒకప్పుడు సిటీలో 2,3 బెడ్‌‌‌‌ రూమ్‌‌‌‌లు ఉన్న ఫ్లాట్‌‌‌‌ ఉంటే  సరిపోతుంది అనుకునేవాళ్లు. ప్రస్తుతం  తమకంటూ కొంత ల్యాండ్ ఉండాలి, తమకు నచ్చినట్టు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారు. మామూలుగా అపార్ట్‌‌‌‌మెంట్ల రేట్లు... విల్లాలు, ఇండిపెండెంట్ హౌస్‌‌‌‌లతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. దీంతో హైదరాబాద్‌‌‌‌ వంటి పెద్ద పెద్ద సిటీల్లో అపార్ట్‌‌‌‌మెంట్ కల్చర్ బాగా పెరిగింది. కానీ, కరోనా తర్వాత పరిస్థితుల్లో మార్పువచ్చినట్టు కనిపిస్తోంది. స్పేస్ ఎక్కువగా ఉండే లగ్జరీ ఇళ్లు, ఇండిపెండెంట్ హౌస్‌‌‌‌ల వైపు బయ్యర్లు చూస్తున్నారు. అపార్ట్‌‌‌‌మెంట్లకు కూడా డిమాండ్‌‌‌‌ ఉన్నప్పటికీ, ప్లాట్‌‌‌‌లు, ఇండిపెండెంట్ ఇళ్లు, విల్లాలకు డిమాండ్‌‌‌‌ బాగా పెరిగింది. నో బ్రోకర్‌‌‌‌‌‌‌‌ డాట్ కామ్‌‌‌‌ సర్వే ప్రకారం, హైదరాబాద్‌‌‌‌లో 59 శాతం మంది రెస్పాండెంట్లు మొదట ఇండిపెండెంట్ హౌస్‌‌‌‌లకే ఇంపార్టెన్స్‌‌‌‌ ఇచ్చారు. అపార్ట్‌‌‌‌మెంట్లు తీసుకోవాలి అనుకుంటున్నామని మరో 29 శాతం మంది చెప్తే, 12 శాతం మంది ప్లాట్స్​ తీసుకోవాలి అనుకుంటున్నట్టు సర్వేలో తెలిసింది అంది నో బ్రోకర్. అంతేకాకుండా హైదరాబాద్‌‌‌‌ బయట ఉంటున్నవాళ్లు సిటీలో ఇన్వెస్ట్‌‌‌‌ చేయడం పెరుగుతోందని తెలిపింది. మిగిలిన పెద్ద సిటీలతో పోలిస్తే రేట్లు తక్కువగా ఉండడం, ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుండడంతో  సిటీలో రియల్‌‌‌‌ ఎస్టేట్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు పెరుగుతున్నాయని అభిప్రాయపడింది. మరోవైపు రాష్ట్రంలోని తయారీ రంగంలో ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు పెరగడం కూడా ఇండిపెండెంట్‌‌‌‌ ఇళ్లకు డిమాండ్‌‌‌‌ పెరగడానికి కారణమవుతోంది.  మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు వస్తుండడంతో హైదరాబాద్‌‌‌‌లో  ఆఫీస్‌‌‌‌ స్పేస్‌‌‌‌కు డిమాండ్ పెరుగుతోంది. ఈ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన వారు మిడ్‌‌‌‌ రేంజ్‌‌‌‌లోని హోమ్‌‌‌‌ను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఈ సంస్థ వివరించింది. ఎక్కువ జీతాలు అందుకునే వాళ్లు 4 కోట్ల రూపాయలకు పైనున్న విల్లాల వైపు కూడా చూస్తున్నారని చెస్తోంది ఈ సర్వే.  

ఇండిపెండెంట్‌‌‌‌ ఇళ్ల వైపే..

రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ టౌన్‌‌‌‌షిప్‌‌‌‌ పాలసీలు కూడా ఇండిపెండెంట్ హౌస్‌‌‌‌లు పెరగడానికి కారణమవుతోందని నో బ్రోకర్ డాట్ కామ్‌‌‌‌ అభిప్రాయపడింది. ఈ కొత్త పాలసీ వల్ల తక్కువ రేటుకే ల్యాండ్ అందుబాటులో ఉంటుంది తెలిపింది. వీటికితోడు హెచ్‌‌‌‌ఎండీఏ, రెరా వంటివి ల్యాండ్లకు వేగంగా అప్రూవల్స్ ఇస్తుండడం కూడా ఇండిపెండెంట్‌‌‌‌ హౌస్‌‌‌‌లు పెరగడానికి కారణమవుతోంది. షాద్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, కొత్తూరు వంటి ఏరియాల్లో భూమి అందుబాటు ధరల్లో దొరుకుతున్నాయని ఫీట్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ కలిశెట్టి నాయుడు అన్నారు. ‘‘మిడ్‌‌‌‌ రేంజ్ సెగ్మెంట్ కోసం అయితే కరీంనగర్ హైవే, వరంగల్‌‌‌‌ హైవేల చుట్టుపక్కల బయ్యర్లు చూస్తున్నారని అన్నారు’’. నో బ్రోకర్ సర్వే ప్రకారం,  హైదరాబాద్‌‌‌‌లో కేవలం  కొత్తగా ఇల్లు తీసుకునేవాళ్లే కాకుండా రెంట్​కు వావాలనుకునేవాళ్లు కూడా  ఇండిపెండెంట్ ఇళ్ల వైపు చూస్తున్నారు. దీంతో పెద్ద ఇళ్లకు, ప్రైవేట్ ఇళ్లకు మంచి గిరాకీ వస్తోంది.  మొత్తం 43 శాతం మంది రెస్పాండెంట్లు ఇండిపెండెంట్ హౌస్‌‌‌‌లో రెంట్‌‌‌‌కు దిగాలనుకున్నారని నో బ్రోకర్‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. మరో 30 శాతం మంది ఇండిపెండెంట్ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌ ఉన్న అపార్ట్‌‌‌‌మెంట్లు ‘ఓకే’ అని చెప్పారు. కేవలం 22 శాతం మంది మాత్రం అందరితో కలిసున్న ఫ్లాట్‌‌‌‌ను, 5 శాతం మంది మాత్రం కో-–లివింగ్‌‌‌‌ స్పేస్‌‌‌‌లలో రెంట్‌‌‌‌కు దిగాలనుకున్నారు. పెద్ద హౌస్‌‌‌‌ల కోసం వెతకడం కూడా బాగా పెరిగింది. అందుకే పెద్ద ఇండ్లను రెంట్‌‌‌‌కు తీసుకోవడానికి టెనెంట్స్‌‌‌‌  వెనకడుగేయడం లేదని నో బ్రోకర్ పేర్కొంది. 

ఫ్లాట్‌‌‌‌లకే గిరాకీ..

మరో ప్రాపర్టీ కన్సల్టెన్సీ కంపెనీ మ్యాజిక్ బ్రిక్స్ సర్వే ప్రకారం,  దేశం మొత్తం మీద  అపార్ట్‌‌‌‌మెంట్లకు గిరాకీ తగ్గలేదు.  ఏ టైప్ ప్రాపర్టీని కొనాలని నిర్ణయించుకున్నారు? అనే ప్రశ్నకు సర్వేలో పాల్గొన్న వారిలో 36 శాతం మంది అపార్ట్‌‌‌‌మెంట్స్​ బెస్ట్ ఛాయిస్ అని చెప్పారు.  34 శాతం మంది ప్లాట్‌‌‌‌ తీసుకోవడానికి ఆసక్తి చూపించారు. గతంలో అపార్ట్‌‌‌‌మెంట్లకు ఎక్కువ డిమాండ్ ఉండేది. ప్లాట్ల వైపు కన్జ్యూమర్లు తక్కువగా చూసేవారు. తాజాగా ఈ పరిస్థితుల్లో మార్పొచ్చినట్టు కనిపిస్తోంది. అపార్ట్‌‌‌‌మెంట్లతో పోటీగా ప్లాట్లు నిలవడం విశేషం. సర్వేలో పాల్గొన్న వాళ్ల  మరో 20 శాతం ఇండిపెండెంట్ ఇళ్లకు, 10 శాతం మంది విల్లాలకు ఓటేశారు. కరోనా తర్వాత కన్జ్యూమర్ల ట్రెండ్స్‌‌‌‌ను మ్యాజిక్ బ్రిక్స్ విశ్లేషించింది. కన్జూమర్లు ఎక్కువ స్పేస్‌‌‌‌ ఉండే ఇళ్లను ఇష్టపడుతున్నారు. వర్క్ ఫ్రమ్‌‌‌‌ హోమ్‌‌‌‌ విధానం పెరుగుతుండడం, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ క్లాస్‌‌‌‌లు కూడా ఉంటుండడంతో పెద్ద ఇళ్లకు షిఫ్ట్‌‌‌‌ కావాలని బయ్యర్లు  చూస్తున్నారని మ్యాజిక్ బ్రిక్స్ అభిప్రాయపడింది. అందుకే ప్లాట్లకు, ఇండిపెండెంట్ ఇళ్లకు, విల్లాలకు డిమాండ్ పెరగడాన్ని గమనించొచ్చు. మెట్రో, ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌, హైవే, రైలు కనెక్టివిటీ వంటి వాటికి దగ్గర్లోని ప్లాట్లకు మంచి గిరాకీ ఉంది. హైదరాబాద్‌‌‌‌, చెన్నై, పుణే, లక్నో సిటీలలో ఎక్కువ డిమాండ్ కనపడగా, హైదరాబాద్‌‌‌‌, చెన్నై, లక్నో, గురుగ్రామ్‌‌‌‌, పుణేలలో ప్లాట్లు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. మ్యాజిక్‌‌‌‌ బ్రిక్స్ సర్వే ప్రకారం, హైదరాబాద్‌‌‌‌లో  మోకిలా, శంషాబాద్ ఏరియాల్లో ప్లాట్లకు డిమాండ్ పెరుగుతుండగా, షాద్‌‌‌‌నగర్‌‌‌‌, సంగారెడ్డి‌‌‌‌ ఏరియాల్లో ఎక్కువ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని మ్యాజిక్ బ్రిక్స్ పేర్కొంది. 

ఇప్పుడు ఇల్లు కొనొచ్చా? 

ఇల్లు కొనడానికి బెస్ట్ టైమ్ ఇదేనని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. వ్యవస్థలో లిక్విడిటీ (డబ్బు) ఎక్కువగా ఉండడం, హోమ్‌‌‌‌ లోన్లపై వడ్డీ రేట్లు రికార్డ్ కనిష్టాలకు తగ్గడం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీపై రాయితీ ఇవ్వడం వంటి అంశాలు బయ్యర్లను ఆకర్షిస్తున్నాయి.  డెవలపర్లు కూడా మంచి మంచి ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఒకవేళ ఇల్లు కొనాలని  ముందు నుంచే ప్లాన్స్ ఉంటే మాత్రం ఇదే సరైన టైమ్ అని అంటున్నారు ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌. ఎందుకంటే బ్యాంకుల దగ్గర మిగులు డబ్బులు (లిక్విడిటీ) చాలా ఎక్కువగా ఉన్నాయి. బారోవర్ క్రెడిట్ హిస్టరీ బాగుంటే   6.7 శాతం వడ్డీకే  హోమ్ లోన్ ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి టాప్ బ్యాంకులు. వడ్డీ రేటు తగ్గితే ఎక్కువ అమౌంట్‌‌‌‌ను లోన్‌‌‌‌ కింద తీసుకోవడానికి వీలుంటుంది. ఉదాహరణకు 8 శాతం వడ్డీ రేటు దగ్గర 60 లక్షల రూపాయలు లోన్ వచ్చిందనుకుంటే, అదే 6.7 శాతం దగ్గర రూ. 66 లక్షల వరకు లోన్​ తీసుకోవడానికి వీలుంటుంది. ఈఎంఐ భారం తగ్గుతుంది. కరోనా సంక్షోభంతో రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌లో కన్‌‌‌‌స్ట్రక్షన్ యాక్టివిటీ  40 శాతం మేర పడిపోయిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అందుకే  రెడీ టూ మూవ్‌‌‌‌ (దిగడానికి రెడీగా ఉన్న) ఇండ్లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండని సలహా ఇస్తున్నారు. మరోవైపు ఇండ్ల రేట్లు కూడా ఇప్పటికిప్పుడు భారీగా పెరగవని అంటున్నారు ఎనలిస్టులు. ఎందుకంటే డెవలపర్లు తమ సేల్స్‌‌‌‌ను పెంచుకోవాలని చూస్తున్నారని, తమ దగ్గరున్న నిల్వలను ముందు ఖాళీ చేసుకోవాలి అనుకుంటున్నారని చెబుతున్నారు.  కాగా, గత 50 నెలల్లో మొత్తం 60 సిటీలలో  ఏకంగా 12.5 లక్షల ఇళ్లు అమ్ముడుకాకుండా ఉన్నాయని అంచనా. ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ కోసం అయితే మాత్రం ప్రాపర్టీని ఇప్పట్లో తీసుకోవద్దని చెప్తున్నారు. ఎందుకంటే రేట్లు ఇప్పటిలో పెరిగే ఛాన్స్ కనిపించడం లేదు. అందువల్ల ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ పరంగా తీసుకుంటే మంచి లాభాలు రాకపోవచ్చు.

ఏది బెటర్‌‌‌‌‌‌‌‌?

పట్టణాలు పెరుగుతుండడంతో నివాసానికి అవసరమయ్యే ప్లేస్ తగ్గుతోంది. అందుకే అపార్ట్‌‌‌‌మెంట్ కల్చర్ బాగా పెరిగింది. ల్యాండ్‌‌‌‌ను అడ్డంగా పొదుపు చేస్తూనే, వర్టికల్‌‌‌‌గా వాడుకోవడానికి అపార్ట్‌‌‌‌మెంట్లతో వీలుంటుంది. రెంట్లకు ఇవ్వడానికి, సొంతంగా వాడుకోవడానికి అపార్ట్‌‌‌‌మెంట్లు బాగుంటాయి. అలానే ఇన్వెస్ట్‌‌‌‌మెంట్  కోసం  కూడా  వీటిని కొంటున్నారు. ఇండిపెండెంట్ హౌస్‌‌‌‌లు కొనే స్తోమత లేకపోవడం కూడా అపార్ట్‌‌‌‌మెంట్లు పెరగడానికి ఒక కారణం. కానీ, కొన్ని అంశాల్లో అపార్ట్‌‌‌‌మెంట్లు బాగుంటే, మరికొన్ని అంశాల్లో ఇండిపెండెంట్‌‌‌‌ హౌస్‌‌‌‌లు తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది. అసలు ఈ రెండింటికి మధ్య తేడా ఏంటో చూద్దాం..

ఒకటి బాగా ఖరీదు.. మరోదాంట్లో స్పేస్ తక్కువ

ధర పరంగా చూస్తే అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లే బెటర్‌‌‌‌‌‌‌‌. హైదరాబాద్ వంటి సిటీలలో కనీసం 50 లక్షల రూపాయలు ఉంటే మంచి అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ కొనుక్కోవచ్చు. సిటీలో అపార్ట్‌‌‌‌మెంట్ కోసమైతే చదరపు అడుగు సగటు రేటు రూ. 4,700 దగ్గర ఉంది. అదే విల్లా కోసమైతే సగటున చదరపు అడుగుకి 16 వేల రూపాయలైనా ఖర్చు చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ వంటి సిటీల్లో విల్లా తీసుకోవాలంటే కనీసం 5 కోట్ల రూపాయలైనా అవుతుంది. అపార్ట్‌‌‌‌మెంట్లలో స్పేస్‌‌‌‌ తక్కువగా ఉంటుంది కాబట్టి మెయింటెనెన్స్ ఖర్చు పెద్దగా ఉండదు. అది కూడా రెసిడెంట్స్‌‌‌‌ వెల్ఫేర్ అసోసియేషన్‌‌‌‌ (ఆర్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూఏ) అపార్ట్‌‌‌‌మెంట్ కాంప్లెక్స్‌‌‌‌లలో మెయింటెనెన్స్‌‌‌‌ను చూసుకుంటుంది.  అదే విల్లాల్లో అయితే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా ఓనర్లే చూసుకోవాలి. ఇంటిని నచ్చినట్టు మార్చుకోవడానికి విల్లాలు, ఇండిపెండెంట్‌‌‌‌ హౌస్‌‌‌‌ల్లో వీలుంటుంది. అదే అపార్ట్‌‌‌‌మెంట్లలో కస్టమైజేషన్‌‌‌‌కు తక్కువ అవకాశాలు ఉంటాయి. 

అపార్ట్‌‌‌‌మెంట్లలో పాజిటివ్, నెగెటివ్

పాజిటివ్‌‌‌‌: ఇండిపెండెంట్ హౌస్‌‌‌‌లతో పోలిస్తే అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ కాస్ట్ తక్కువ. రెంట్‌‌‌‌కు దిగడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. ఎప్పుడైనా రెంట్లకు ఇద్దామనుకుంటే మార్కెట్‌‌‌‌లో డిమాండ్ ఉంటుంది. తక్కువ మెయింటెనెన్స్‌‌‌‌తోపాటు సెక్యూరిటీ బాగుంటుంది. మేనేజ్‌‌‌‌ చేయడం ఈజీగా ఉంటుంది. చిన్న ఫ్యామిలీలకు బాగుంటుంది.

నెగెటివ్‌‌‌‌: అపార్ట్‌‌‌‌మెంట్లలో తక్కువ స్పేస్ ఉంటుంది. ప్రైవసీ లిమిటెడ్‌‌‌‌గా ఉంటుంది. ఎలా లేదనుకున్నా చుట్టు పక్కల ఉన్నవారు కనిపిస్తూనే ఉంటారు. ల్యాండ్‌‌‌‌పై పెద్దగా హక్కుండదు. అపార్ట్‌‌‌‌మెంట్లు క్రౌడ్‌‌‌‌గా ఉంటాయి. టేస్ట్‌‌‌‌కు తగ్గట్టు అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ను మార్చుకోవడం అంత ఈజీ కాదు. పెద్ద ఫ్యామిలీలకు బాగోదు. 

విల్లాలు, ఇండిపెండెంట్ హౌస్‌‌‌‌లు

పాజిటివ్‌‌‌‌: ప్రైవసీ ఎక్కువగా ఉంటుంది.స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ల్యాండ్‌‌‌‌పై ఓనర్‌‌‌‌‌‌‌‌షిప్ ఉంటుంది. నచ్చినట్టు ఇంటిని మార్చుకోవచ్చు. పెద్ద ఫ్యామిలీలకు బాగుంటుంది.

నెగెటివ్‌‌‌‌: కాస్ట్ ఎక్కువ. అపార్ట్‌‌‌‌మెంట్లలో అయితే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ డ్యూటీ వంటివి డెవలపర్ చూసుకుంటాడు. కానీ, ఇండిపెండెంట్‌‌‌‌ హౌస్‌‌‌‌లలో బయ్యరే భరించాలి. రెంట్‌‌‌‌కు దిగడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించకపోవచ్చు. 

ఇవి గమనించాలి

కొత్తగా ఇల్లు తీసుకోవాలనుకునే వారు ఈ కింది విషయాలను జాగ్రత్తగా గమనించాలి. ఇండిపెండెంట్ హోమ్ అయినా ఫ్లాట్‌‌‌‌ అయినా ఈ అంశాలను చెక్ చేసుకున్నాకనే ఇల్లు తీసుకోవడానికి ముందుకు వెళ్లాలి.  

ప్రాపర్టీ ధర..

ఏదైనా ఇల్లు లేదా ఫ్లాట్‌‌‌‌ను ఎంచుకునేముందు ఎంత ఖర్చు చేయగలమో ముందే ఫిక్స్ చేసుకోవాలి. దీంతో  కావాల్సిన ప్రాపర్టీని షార్ట్‌‌‌‌లిస్ట్ చేయడం ఈజీ అవుతుంది. తీసుకోవాలి అనుకుంటున్న ప్రాపర్టీకి చుట్టుపక్కల ఇళ్లను, ఫ్లాట్లను గమనించాలి. వాటి రేట్లను కనుక్కోవాలి. అప్పుడే బిల్డర్‌‌‌‌‌‌‌‌ లేదా డెవలపర్ సరైన రేటు చెప్తున్నాడో లేదో ఒక అవగాహన వస్తుంది. కోరుకునే ఏరియాల్లో ఇళ్లను వెతకడం ప్రస్తుతం ఈజీగా మారింది. ఆన్‌‌‌‌లైన్ వెబ్‌‌‌‌సైట్లు, బ్రోకర్లు, న్యూస్ పేపర్లలో యాడ్‌‌‌‌లు వంటి విధానాలతో  కావాల్సిన ఇంటిని గుర్తించొచ్చు.

ఫ్లాట్‌‌‌‌ కార్పెట్ ఏరియా

సాధారణంగా ప్రాపర్టీ ఏరియాలో మెట్లు, లిఫ్ట్‌‌‌‌ స్పేస్‌‌‌‌, గోడల స్పేస్‌‌‌‌ వంటివి కలిసుంటాయి. కార్పెట్ ఏరియా అంటే గోడల మధ్య ఉన్న ఏరియా అని అర్థం. సాధారణంగా కార్పెట్ ఏరియా మొత్తం ప్రాపర్టీ ఏరియాలో 30 శాతం వరకు తక్కువగా ఉండొచ్చు. డెవలపర్ లేదా  బిల్డర్‌‌‌‌‌‌‌‌  రేటు వేసేటప్పుడు మొత్తం ప్రాపర్టీ ఏరియాను లెక్కిస్తాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి.  కొన్నిసార్లు కామన్‌‌‌‌ స్పేస్‌‌‌‌ను మరొకరితో పంచుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మొత్తం రేటు కట్టకుండా షేర్ చేసుకోవాలి. 

ల్యాండ్ రికార్డ్‌‌‌‌

ఇల్లు కొనేముందు ల్యాండ్ రికార్డ్స్‌‌‌‌ కరెక్ట్‌‌‌‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. మట్టి క్వాలిటీ ఎలా ఉంది, కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌కు  బాగుంటుందా? లేదా? అనే అంశాలు చెక్ చేసుకోవాలి. ప్లాట్స్​  కొంటే అన్ని రకాల బకాయిలు క్లియర్ అయ్యాయా? ప్లాట్ రిజిస్టర్ అయిందా? అనే అంశాలను చెక్ చేసుకోవాలి. ప్రాపర్టీపై హక్కు, ఓనర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌, బాధ్యతలకు సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోవాలి. 

న్యాయబద్దమైందేనా? 

కొనాలనుకునే ఇల్లు లీగల్‌‌‌‌గా కట్టారా? కోర్టు కేసులేమైనా ఉన్నాయా? అనే అంశాలను కన్జ్యూమర్లు తెలుసుకోవాలి. కోర్టు లిటిగేషన్‌‌‌‌లోని ప్రాపర్టీలను అమ్మేవాళ్లు చాలామంది ఉంటారు. వీళ్ల చేతుల్లో మోసపోకుండా ఉండాలంటే, ప్రాపర్టీ కొనేముందే లీగల్ డిటెయిల్స్‌‌‌‌ను సరిగ్గా చూసుకోవాలి. ఏరియా డెవలప్‌‌‌‌మెంట్ అథారిటీ నుంచి, వాటర్ సప్లయ్‌‌‌‌, సీవేజ్ బోర్డుల నుంచి, మునిసిపల్‌‌‌‌ కార్పొరేషన్ నుంచి, డెవలపర్‌‌‌‌‌‌‌‌కు  నాన్‌‌‌‌ అబ్జెక్షన్‌‌‌‌ సర్టిఫికెట్లు వచ్చాయో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ హోమ్‌‌‌‌ లోన్‌‌‌‌ తీసుకుంటే మాత్రం సంబంధిత బ్యాంకు ఇవన్నీ చెక్ చేస్తుంది. 
అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఎప్పుడు చేతికొస్తుంది? ఈ మధ్య ఫ్లాట్‌‌‌‌లను డెలివరీ చేయడంలో  డెవలపర్లు ఆలస్యం చేస్తున్నారు. కమర్షియల్‌‌‌‌, రెసిడెన్షియల్ సెగ్మెంట్‌‌‌‌లోనూ ఇది జరుగుతోంది. ఫ్లాట్‌‌‌‌ను ఎప్పుడు అప్పగిస్తారో ముందుగానే బయ్యర్‌‌‌‌‌‌‌‌  తెలుసుకోవాలి. సాధారణంగా ఆరునెలల  గ్రేస్‌‌‌‌ పీరియడ్‌‌‌‌ను డెవలపర్లు అడుగుతారు. ఈ గ్రేస్‌‌‌‌ పీరియడ్‌‌‌‌ ఎందుకు తీసుకున్నారనే అంశాన్ని కూడా డెవలపర్లను అడగాలి. 

ఫైనాన్షియల్ బ్యాంకులు

కొంతమంది బిల్డర్లకు ఫైనాన్స్‌‌‌‌ ఇవ్వడానికి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ముందుకు రావు. కొనాలనుకునే ప్రాపర్టీకి ఫండ్స్‌‌‌‌ ఇవ్వడానికి బ్యాంకులు రెడీగా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని ముందుగానే చెక్ చేసుకోవాలి. 

బిల్డర్ -బయ్యర్ అగ్రిమెంట్‌‌‌‌ 

ఏదైనా హౌస్‌‌‌‌ను కొనేముందు అడ్వాన్స్‌‌‌‌గా కొంత అమౌంట్‌‌‌‌ ముందే చెల్లించి బిల్డర్‌‌‌‌‌‌‌‌, బయ్యర్‌‌‌‌‌‌‌‌, బ్యాంకు.. ట్రై పార్టీ అగ్రిమెంట్‌‌‌‌ను కుదుర్చుకుంటాయి. ఈ అగ్రిమెంట్‌‌‌‌లోని అన్ని క్లాజ్‌‌‌‌లను జాగ్రత్తగా చదవాలి. ఏదైనా డౌట్ ఉంటే వెంటనే ప్రాబ్లమ్‌‌‌‌ను రైజ్‌‌‌‌ చేయాలి. 

ఫ్లాట్‌‌‌‌ లొకేషన్‌‌‌‌

ఫ్లాట్‌‌‌‌ లేదా హౌస్‌‌‌‌ను కొనేముందు, ఆ ప్రాపర్టీ  ఉన్న ఏరియాను జాగ్రత్తగా పరిశీలించాలి. కీలకమైన ఫెసిలిటీస్‌‌‌‌కు చేరువలో ఉన్నామా? లేదా? ఫ్యామిలీకి సేఫ్టీ ఉంటుందా? లేదా? అనే అంశాలకు ఎక్కువ ఇంపార్టెన్స్‌‌‌‌ ఇవ్వాలి. 

హిడెన్ ఛార్జీలు

డాక్యుమెంట్లలోని అన్ని క్లాజ్‌‌‌‌లను చదవాలి. ముఖ్యంగా పెనాల్టీ క్లాజ్‌‌‌‌లు అర్థమయ్యేటట్టు ఉన్నాయా? లేదా? చూసుకోవాలి. గ్రేస్‌‌‌‌ పీరియడ్‌‌‌‌లోపు  ఫ్లాట్‌‌‌‌ను  డెలివరీ చేయకపోతే బిల్డర్ మంత్లీ పెనాల్టీని బయ్యర్‌‌‌‌‌‌‌‌కు చెల్లించాలి. అదనంగా స్టాంప్‌‌‌‌ డ్యూటీ, జీఎస్‌‌‌‌టీ, హోమ్‌‌‌‌ లోన్ ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇతర ఛార్జీలపై దృష్టి పెట్టాలి. 
- నరసింహ పల్ల

హైదరాబాద్ రియల్‌‌ ఎస్టేట్ మార్కెట్‌‌ 

హైదరాబాద్ రియల్‌‌ ఎస్టేట్‌‌ మార్కెట్ మిగిలిన సిటీలతో పోలిస్తే వేగంగా వృద్ధి చెందుతోంది. తాజాగా నైట్ ఫ్రాంక్ రిపోర్ట్‌‌ను, అన్‌‌రాక్ కన్సల్టెన్సీ రిపోర్ట్‌‌ను గమనించినా ఈ విషయం అర్థమవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్‌‌లో 2013 నుంచి ప్రాపర్టీ రేట్లు తగ్గక పోవడం విశేషం. ఈ ఏడాది కూడా సిటీలో ఇండ్ల ధరలు 5 శాతం మేర పెరుగుతాయని అంచనా వేస్తున్నాయి కన్సల్టెన్సీ కంపెనీలు. హైదరాబాద్‌‌లో  కిందటేడాది చివరి ఆరు నెలల్లో  చదరపు అడుగు రేటు 4,700 రూపాయలు పలికిందని ‘నైట్‌‌ ఫ్రాంక్’ చెబుతోంది. ఇది అంతకుముందు ఏడాది చివరి ఆరు నెలలతో పోలిస్తే 5 శాతం ఎక్కువ. ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్‌‌లో ఇండ్ల సేల్స్ బాగా పెరిగాయి. కోకాపేట్‌‌, పీరంచెరు, గోపన్నపల్లి, నలగండ్ల వంటి ఏరియాల్లో డెవలప్‌‌మెంట్ యాక్టివిటీ ఎక్కువగా జరుగుతోంది.  హైటెక్‌‌ సిటీ, గచ్చిబౌలి, నానక్​రామ్‌‌గూడ వంటి ఆఫీస్‌‌ హబ్స్‌‌కు దగ్గర్లో ఇల్లు తీసుకునేందుకు ఎక్కువ ఆసక్తి  చూపించారని  నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ పేర్కొంది.  మొత్తంగా చూస్తే,  హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌‌ మార్కెట్ బాగా కనిపిస్తోంది. కిందటేడాది సిటీలో 24,318 హౌసింగ్ యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే  142 % ఎక్కువ కావడం విశేషం. నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారం, కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఇండ్లు ఏకంగా 179 % పెరిగాయి. అలానే ఆఫీస్ స్పేస్‌‌కు సిటీలో మంచి డిమాండ్ క్రియేట్ అవుతోంది. తాజాగా ఐటీ సెక్టార్‌‌‌‌లో యాక్టివిటీ తగ్గినప్పటికీ, సిటీలో మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌‌‌‌ విస్తరిస్తుండడంతో కమర్షియల్ స్పేస్‌‌కు డిమాండ్ కొనసాగుతోంది. కిందటేడాది ఏకంగా 60 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌‌ కోసం ట్రాన్సాక్షన్లు జరిగాయని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. ఇందులో రెంట్లు, లీజ్‌‌లు కూడా కలిసున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌‌ రూ. 50 లక్షల నుంచి రూ. కోటి మధ్య రేట్లు ఉన్న  యూనిట్ల సేల్స్ ఎక్కువగా జరిగాయి. రూ. కోటికి పైన రేట్లు ఉన్న ఇండ్ల అమ్మకాలు కూడా పుంజుకున్నాయి. 2018 మొదటి ఆరు నెలల్లో సిటీలో జరిగే ఇండ్ల అమ్మకాల్లో ఈ సెగ్మెంట్ వాటా 19 శాతం ఉండగా, 2021 చివరి ఆరు నెలల్లో ఈ సెగ్మెంట్ వాటా 30 శాతానికి ఎగిసిందని నైట్ ఫ్రాంక్ ప్రకటించింది. 2021 చివరి 6 నెలల్లో టాప్‌‌ సిటీల్లో చదరపు అడుగు సగటు రేటు..

ఎన్నో రకాలు..

బయ్యర్లు అందరూ ఒకలా ఆలోచించరు. అలానే అన్ని ఇళ్లు ఒకలా ఉండవు. దేశంలో తొమ్మిది రకాల ఇండ్లు బాగా పాపులర్ అయ్యాయి.

బంగ్లాలు

బంగ్లాలు ఎక్కువగా నాన్‌‌‌‌- అర్బన్ ఏరియాల్లో కనిపిస్తుంటాయి. సాధారణంగా ఈ రకం ఇండ్లు ఒక అంతస్తు ఎత్తుతో ఉంటాయి. పెద్ద పెద్ద బంగ్లాలను కూడా చూడొచ్చు. పెద్ద ఫ్యామిలీలకు బంగ్లాలు సరిపోతాయి. ఈ మధ్య సిటీలలో కూడా బంగ్లాలు పెరుగుతుండడం కనిపిస్తోంది.

అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లు

అపార్ట్‌‌‌‌మెంట్ కల్చర్ బాగా పెరిగింది. ముఖ్యంగా సిటీలలో అపార్ట్‌‌‌‌మెంట్లకు కొదవేలేదు. ఇవి చిన్న ఫ్యామిలీలకు సరిపోతాయి. పెద్ద అపార్ట్‌‌‌‌మెంట్లు అందుబాటులో ఉన్నాయి. అపార్ట్‌‌‌‌మెంట్లను కొనేటప్పుడు బయ్యర్‌‌‌‌‌‌‌‌ ల్యాండ్‌‌‌‌పైనా కొంత హక్కు పొందొచ్చు. లేదనుకుంటే కేవలం అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌నే తీసుకోవచ్చు. ఎంచుకునే విధానం బట్టి అపార్ట్‌‌‌‌మెంట్లలో రేట్లు ఉంటాయి.  

పెంట్‌‌‌‌హౌస్‌‌‌‌లు

అపార్ట్‌‌‌‌మెంట్ వంటి బిల్డింగ్‌‌‌‌లలో టాప్‌‌‌‌ ఫ్లోర్ యూనిట్లను పెంట్‌‌‌‌హౌస్‌‌‌‌లని పిలుస్తారు. అదే లోవర్ ఫ్లోర్ యూనిట్‌‌‌‌ను బేస్‌‌‌‌మెంట్ సూట్స్ అని అంటారు. ఇతర అపార్ట్‌‌‌‌మెంట్లతో పోలిస్తే వీటిలో లగ్జరీ ఫీచర్లు చాలా ఎక్కువగా ఉంటాయి. బిల్డింగ్‌‌‌‌లలో ఎక్కువ లగ్జరీలతో  పెంట్‌‌‌‌హౌస్‌‌‌‌లను నిర్మిస్తారు. 

స్టూడియో ఫ్లాట్‌‌‌‌లు

స్టూడియో ఫ్లాట్‌‌‌‌లు ఈ మధ్య బాగా పాపులర్​అవుతున్నాయి. ఈ టైప్ అపార్ట్‌‌‌‌మెంట్లలో బెడ్‌‌‌‌ రూమ్‌‌‌‌, కిచెన్, లివింగ్ రూమ్‌‌‌‌ వంటివి వేరు చేసి ఉండవు. అంటే వాటి మధ్య ఎటువంటి గోడలు ఉండవు.

విల్లాలు

విల్లాలలను సొసైటీలో ధనికులకు సింబాలిక్‌‌‌‌గా చూస్తారు. విల్లా సైజ్‌‌‌‌లు  కింగ్ సైజ్ హౌస్ నుంచి అల్ట్రా లార్జ్ హౌస్‌‌‌‌ల వరకు విస్తరించి ఉన్నాయి. ఇంటి ముందు గార్డెన్‌‌‌‌, స్విమ్మింగ్ పూల్‌‌‌‌ వంటి ఫెసిలిటీస్‌‌‌‌తో వీటిని కడతారు. విల్లాల చుట్టూ మంచి వ్యూ కూడా ఉంటుంది. 

హౌసింగ్ కాంప్లెక్స్‌‌‌‌లు..

హౌసింగ్ కాంప్లెక్స్‌‌‌‌లు (కండోమినమ్‌‌‌‌) పెరుగుతుండడం కనిపిస్తోంది. రూఫ్‌‌‌‌టాప్‌‌‌‌లు, క్లబ్‌‌‌‌హౌస్‌‌‌‌లు, స్విమ్మింగ్ పూల్‌‌‌‌లు, ప్లేరూమ్‌‌‌‌లు, అవుట్‌‌‌‌ డోర్‌‌‌‌‌‌‌‌ వంటి ఏరియాలను ఓనర్లు సమానంగా షేర్ చేసుకుంటారు. కొంత మంది  ఓనర్లు కలిసి అసోసియేషన్‌‌‌‌గా ఏర్పడి ఈ ప్రాపర్టీలను మేనేజ్‌‌‌‌ చేస్తుంటారు.

ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లు

ఫామ్‌‌‌‌ హౌస్‌‌‌‌ల (సెకెండ్ హోమ్‌‌‌‌) ను  వెకేషన్ హౌస్‌‌‌‌గా పిలవొచ్చు. సాధారణంగా  సిటీలకు దూరంగా వీటిని నిర్మిస్తారు. కొంతమంది బయ్యర్లకు ఇల్లు కొనేటప్పుడే ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌ను కూడా డెవలపర్లు అందిస్తున్నారు. 

గుడిసెలు

సాధారణంగా పల్లెటూళ్లలో గుడిసెలను చూడొచ్చు. మట్టి, ఇటుకలు, కర్రలు వంటి వాటిని ఉపయోగించి వీటిని కడతారు. ఇలాంటి టైప్‌‌‌‌ ఇళ్లు ముఖ్యంగా దేశంలోని ట్రైబల్ ఏరియాల్లో కనిపిస్తాయి. వేసవిలో ఇటువంటి ఇళ్లు చల్లదనాన్ని ఇస్తాయి. 

ఎకో ఫ్రెండ్లీ హోమ్‌‌‌‌..

పర్యావరణం గురించి ఆలోచించేవాళ్లు ఎకో ఫ్రెండ్లీ ఇళ్ల వైపు చూస్తున్నారు. అంతేకాకుండా వీటిని ఏర్పాటు చేయడానికి పెద్ద ఖర్చు కూడా కాదు. ప్లాస్టిక్ వంటి పర్యావరణానికి హాని చేసే ప్రొడక్ట్‌‌‌‌లతో వీటిని నిర్మిస్తారు. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ కోసం సోలార్ ఎనర్జీ వంటి విధానాలపై ఆధారపడతారు. వాటర్ వేస్ట్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి పర్యావరణానికి మేలు చేసే ప్రొడక్ట్‌‌‌‌లు ఇటువంటి ఇండ్లలో చూడొచ్చు.