అస్సాంను వీడని వరదలు

అస్సాంను వీడని వరదలు

గువాహటి: అస్సాంను వరదలు ముంచెత్తుతున్నాయి. తొమ్మిది జిల్లాల పరిస్థితి దారుణంగా ఉంది. మొత్తం 4లక్షల మందికి పైగా ప్రభావితం అయ్యారు. గంటగంటకూ వరద ఉధృతి పెరుగుతున్నది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు చనిపోయారు. బక్సా, బార్‌‌‌‌‌‌పేట, దర్రాంగ్, ధుబ్రి, గోల్‌‌‌‌పరా, కమ్రూప్, లఖింపూర్, నల్బరీ, ఉదల్‌‌‌‌గురి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముంపునకు గురైన ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్​మెంట్ అథారిటీ (ఏఎస్​డీఎంఏ) తెలిపింది.

వరద ప్రభావిత జిల్లాల్లో మొత్తం 101 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 81,352 మంది షెల్టర్ తీసుకుంటున్నారు. ఐదు జిల్లాల్లో 119 రిలీఫ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు కొనసాగుతున్నాయి. 1,118 గ్రామాలు నీటమునిగాయి. 8,469 హెక్టార్లలో పంట డ్యామేజ్ అయింది. కరీంగంజ్‌‌‌‌లోని కొన్ని ఏరియాల్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. వరద ప్రభావిత జిల్లాల్లో రోడ్లు, బ్రిడ్జీలు కొట్టుకుపోయాయి. దర్రాంగ్ జిల్లాలో స్కూల్స్, ఆఫీసులు నీటమునిగాయి. బ్రహ్మపుత్ర నది నీటి మట్టం, జోర్హాట్ జిల్లాలోని నీమతిఘాట్ వద్ద, ధుబ్రి మానస్ నది, పగ్లాదియా నది, పుతిమరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. బజలి జిల్లాలోని 191 గ్రామాలకు చెందిన 2లక్షల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 368.30 హెక్టార్ల పొలాలు నీట మునిగాయి.

కేంద్రంగా అండగా ఉంటుంది : అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మకు ఫోన్ చేశారు. వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో అస్సాం ప్రజలకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. ఎన్​డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే అస్సాంకు పంపించామని వివరించారు. రెస్క్యూ ఆపరేషన్లు చేపడుతున్నాయని తెలిపారు.