మెతుకుసీమలో..  ఎడతెరిపి లేని వాన 

మెతుకుసీమలో..  ఎడతెరిపి లేని వాన 
  • శివ్వంపేటలో 12 సెంటిమీటర్ల వర్షం
  • పొంగి పొర్లుతున్న ఘనపూర్ మత్తడి 
  • జలదిగ్బంధంలోనే ఏడుపాయల ఆలయం
  • సింగూరు 5 గేట్లు ఓపెన్
  • పలు చోట్ల రాకపోకలు బంద్ 

మెదక్/సంగారెడ్డి/సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టు, మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్ట్  (ఘనపూర్ ఆనకట్ట) నిండుకుండలా మారాయి. ఎగువ నుంచి వరద రాకతో సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని మంజీరా నది, మెదక్ జిల్లాలోని హల్దీ, పసుపులేరు, గుండు వాగులు పూర్తిగా నిండాయి. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. పలుచోట్ల లోలెవల్ కాజ్ వేల పైనుంచి నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. 

మెదక్​ జిల్లాలో.. 

మెదక్ జిల్లా శివ్వంపేటలో అత్యధికంగా 12.8 సెంటిమీటర్లు, నర్సాపూర్ లో 10.8, కాగజ్ మద్దూరులో 93.8, పెద్దశంకరంపేటలో 8.9, టేక్మాల్ మండలం బోడగట్టులో 7.4,  హవేలీ ఘనపూర్ లో 6 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లాలో ఉన్న సింగూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి  నీటిని దిగువకు విడుదల చేయడంతో కొల్చారం మండల పరిధిలోని వనదుర్గా ప్రాజెక్ట్  పొంగి పొర్లుతోంది. ఆనకట్ట దిగువన మంజీరా నది ఏడు పాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదీ పాయల మధ్యలో ఉన్న వనదుర్గాభవానీ మాత ఆలయం మూడు రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది.

తూప్రాన్, మాసాయిపేట, వెల్దుర్తి, కొల్చారం మండల పరిధిలోని హల్దీ వాగుకు వరద ప్రవాహం రాగా దాని మీద నిర్మించిన చెక్ డ్యామ్ లు అన్నీ పూర్తిగా నిండి పొంగి పొర్లుతున్నాయి. టేక్మాల్ మండలంలో పీర్ల తండా వాగు వరదకు పంట పొలాలు నీట మునిగాయి. నర్సాపూర్ మండలం కాజీపేట గ్రామ సమీపంలో ఉన్న మోతుల కుంటకు గండిపడి పంట పొలాల మీదుగా వరద నీరు పారుతోంది. పొరుగున ఉన్న కామారెడ్డి జిల్లా నుంచి భారీ వరద వస్తుండడంతో హవేలీ ఘనపూర్ మండలం ధూప్ సింగ్ తండా వద్ద గుండు వాగు ఉధృతంగా ప్రవహిస్తు తండాకు రాకపోకలు బంద్​అయ్యాయి. శివ్వంపేటలో మండలంలోని చండి గ్రామ చామన చెరువు, ఎదుల్లాపూర్, మగ్దుమ్ పూర్, గుండ్లపల్లిలో చెరువులు, కుంటలు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి.

సింగూరు గేట్లు ఓపెన్..

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టుకు 24 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. శనివారం ప్రాజెక్ట్ 5 గేట్లు ఓపెన్​చేశారు. మరో 2 గేట్లు ఏ క్షణమైనా ఓపెన్​చేసే అవకాశం ఉంది. సింగూరు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 21.849 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పెరుగుతున్న నేపథ్యంలో 9వ నంబర్ గేటు 2 మీటర్లు, 6, 8, 10, 11వ నంబర్ల గేట్లను 1.5 మీటర్ల వరకు ఎత్తి దిగువ ప్రాంతాలకు  40821 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 2355 క్యూసెక్కుల నీళ్లు విడుదలవుతుండగా మొత్తం 43176 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మంజీరా నది పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, పశువులు, గొర్ల  కాపరులు, చేపల వేటకు పోయే వారు నదిలోనికి వెళ్లొద్దని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయికోడ్, కొండాపూర్, ఝరాసంగం మండలాల్లోని పలు గ్రామాల్లో వాగులు తెగిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షానికి ఝరాసంగంలో  నక్క సంగమేశ్వర్ ఇంటి గోడ కూలింది. 

సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేట జిల్లాలో శనివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం వేళ రెండు గంటలకు పైగా ముసురు పడింది. జిల్లా వ్యాప్తంగా 8.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. మధ్యాహ్నం వరకు చిరు జల్లులతో మబ్బు పట్టి ఉన్న వాతావరణం ఆ తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. వర్షాల కారణంగా నంగునూరు మండలం పెద్ద వాగుపై 6 చెక్ డ్యామ్ లు మత్తడి పోస్తుండగా పలుచోట్ల చెరువులు, కుంటు వాగుల్లోకి భారీగా వరద నీరు చేరింది. వర్గల్ మండలంలోని నాచారం వద్ద హల్దీ వాగు పొంగిపొర్లుతోంది.