సిర్పూర్(టి) ట్రైన్ పట్టాలపై అర్ధరాత్రి విషాదం.. రైలు ఢీకొని 180 గొర్రెలు మృతి

సిర్పూర్(టి) ట్రైన్ పట్టాలపై అర్ధరాత్రి విషాదం.. రైలు ఢీకొని 180 గొర్రెలు మృతి

కాగజ్ నగర్, వెలుగు: రైలు ఢీకొని గొర్రెలు, మేకలు మృతి చెందిన ఘటన కుమ్రం భీం జిల్లా సిర్పూర్(టి) రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. కౌటాల మండలం శీర్ష గ్రామానికి చెందిన జడ బీరయ్య తన గొర్రెలు, మేకల మందను మేపుతూ శనివారం అర్ధరాత్రి రైలు పట్టాల సమీపంలో ఆపుకుని నిద్రపోయాడు.  రాత్రి ఒక్కసారిగా వాన పడటంతో గొర్రెలు కంచెను దాటుకుని రైలు పట్టాలపైకి చేరాయి. అప్పటికే వస్తున్న హంసఫర్​ఎక్స్​ప్రెస్ రైలు ఢీ కొనడంతో 170 గొర్రెలు,10 మేకలు చనిపోయాయి. ఉదయం యజమాని లేచి చూసే సరికి పట్టాల పక్కన చనిపోయి చెల్లా చెదురుగా పడి ఉండడంతో బోరున విలపించాడు. 

సుమారు రూ.16 లక్షల నష్టం జరిగిందని, ప్రభుత్వం పరిహారం ఇప్పించాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే.. రైల్వే ట్రాక్ పైకి గొర్రెలు, మేకలు వచ్చి ఘటనలో బీరయ్య కొడుకు శ్రీకాంత్ పై కేసు నమోదు చేసినట్లు కాగజ్ నగర్ ఆర్పీఎఫ్ ఎస్ఐ ప్రాచీ దేవి తెలిపారు. అర్ధరాత్రి ట్రాక్ మీదకు వచ్చిన గొర్రెలను రైలు ఢీకొన్న తర్వాత ఆగాల్సి వచ్చిందని చెప్పారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తేవని,  పశువుల యజమానులు రైల్వే ట్రాక్ మీదకు రాకుండా జాగ్రత్త ఉండాలని సూచించారు. 

బస్సును ఢీ కొట్టిన డీసీఎం..

నార్కట్​పల్లి :  నల్గొండ జిల్లా నార్కట్ పల్లి శివారులో హై పై జరిగిన ప్రమాదంలో ఆవులు మృతి చెందాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం. విజయవాడ నుంచి హైదరాబాద్ కు డీసీఎంలో గోవులను  తరలిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున నార్కట్ పల్లి శివారులోని పుజిత హోటల్ వద్ద అదే రూట్ లో వస్తున్న  ట్రావెల్స్ ​బస్సును డీసీఎం వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో డీసీఎంలో  తరలిస్తున్న 40కి పైగా ఆవుల్లో 9  మృతి చెందాయి. మరికొన్నింటిని చికిత్సకు, ఇంకొన్ని ఆవులను మాడుగుల పల్లిలోని గో సంరక్షణ సమితికి అప్పగించారు. నార్కట్​పల్లి సీఐ నగరాజు, ఎస్​ఐ క్రాంతి కుమార్​ స్థానిక యూత్​ సాయంతో డీసీఎంను క్రేన్​తో పక్కకు జరిపి ట్రాఫిక్​ క్లియర్​చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతి కుమార్ తెలిపారు.