దోస్తులిద్దరూ శవాలైన్రు.. బావిలో బయటపడ్డ డెడ్​బాడీలు

దోస్తులిద్దరూ శవాలైన్రు.. బావిలో బయటపడ్డ డెడ్​బాడీలు

కాగజ్ నగర్, వెలుగు: వాళ్లిద్దరూ క్లోజ్​ ఫ్రెండ్స్..ఇద్దరూ వాలీబాల్​ ప్లేయర్స్​. అన్న పెండ్లిలో తమ్ముడు దోస్త్​తో కలిసి పాల్గొన్నాడు. కానీ, తెల్లారేసరికి వ్యవసాయ బావిలో శవాలై కనిపించారు. ఇవి హత్యలేనని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లికి చెందిన కంబాల మహేశ్(22) అన్న శ్రీనుకు మహారాష్ట్రలోని అహెరి గ్రామానికి చెందిన మీనాక్షితో ఆదివారం పెండ్లి జరిగింది. అయితే, శ్రీనుకు పెండ్లి ఇష్టం లేకపోయినా వేధింపులు, కేసుల పేరుతో అమ్మాయి బంధువులు బలవంతంగా పెండ్లి చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు.

పెండ్లికి ముందు శ్రీను ఫ్యామిలీకి, అమ్మాయి బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీను తమ్ముడు మహేశ్​ను చంపేస్తానని అమ్మాయి బంధువులు బెదిరించారు. అదే రోజు సాయంత్రం మహేశ్ కర్జెల్లికి చెందిన తన ఫ్రెండ్​ తుమ్మిడే హరీశ్(22)తో కలిసి బయటకు వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫోన్లు చేయగా స్విచ్చాఫ్ వచ్చాయి. బంధువుల ఇండ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదు. సోమవారం హరీశ్ బైక్ ​చింతలమానేపల్లి సమీపంలోని టవర్ దగ్గర్లోని చేను వద్ద కనిపించింది. పక్కనే ఉన్న పత్తి చేన్లలో వెతుకుతూ ఓ బావిలో చూడగా ఇద్దరి చెప్పులు తేలుతూ కనిపించాయి. పోలీసులకు సమాచారమివ్వగా సీఐ సాదిక్ పాషా, ఎస్ఐ సురేశ్ గజ ఈతగాళ్లను పిలిపించారు.

బావిలో వెతకగా ఇద్దరి డెడ్​బాడీలు దొరికాయి. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  మరణాలపై  మహేశ్​ సోదరుడు మాట్లాడుతూ అమ్మాయిని వేధిస్తున్నానని తనపై కేసు పెట్టి, ఇష్టంలేకపోయినా పెండ్లి చేశారని, వారే మా ఇద్దరన్నదమ్ముల్లో ఒకరిని చంపుతామని బెదిరించారన్నారు. రాత్రి వాళ్లంతా తమ ఊర్లోనే ఉన్నారని, వారే హత్య చేసి ఉంటారన్నాడు. హరీశ్​ తండ్రి శంకర్​ మాట్లాడుతూ పెండ్లి ఉందని తన కొడుకు వెళ్లాడని , రాత్రి 8 గంటలకు తమ  ఇంటికి ఇద్దరు వచ్చి హరీశ్ గురించి అడిగి ఫోన్ నంబర్ తీసుకొని వెళ్లారన్నారు. ప్రమాదవశాత్తూ పడి చనిపోలేదని, కొట్టి చంపి బావిలో పడేసి ఉంటారన్నాడు.