న్యూఢిల్లీ: ఇన్సూరెన్స్ కంపెనీల కమీషన్ల చెల్లింపులో జరిగిన అవకతవకలపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ తన దర్యాప్తును పూర్తి చేసింది. ఈ రిపోర్టులో సంచలన విషయాలను వెల్లడించింది. రూ.15 వేల కోట్లకు పైగా చెల్లింపులలో ఎగవేతలు జరిగాయని తెలిపింది. దీని మీద పన్నే దాదాపు రూ.4,500 కోట్లు ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. 25 కి పైగా బీమా సంస్థలు, 250కి పైగా వ్యాపారాలు కమీషన్లను అక్రమంగా ఏజెంట్లకు మళ్లించినట్టు డిపార్ట్‌మెంట్ ఇన్వెస్టిగేషన్ వింగ్ గుర్తించింది. ఈ వివరాలను అసెస్మెంట్ ఆఫీసర్లకు (ఏఓలు) పంపించారు. ఎగవేతలు, నేరం చేసిన పద్ధతి, ఎగ్గొట్టిన మొత్తం వంటి వివరాలను సంబంధిత సంస్థలు తమ ఏఓలకు పంపించాయి. ఏఓలు ఫలితాలను అధ్యయనం చేసిన తర్వాత, వడ్డీ పెనాల్టీతో సహా పన్ను డిమాండ్ నోటీసులను పంపిస్తారు. ఈ అక్రమాలపై ఐటీ శాఖతో పాటు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) విచారణ జరిపింది. నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్‌ల కోసం డీజీజీఐ కొంతమందిని ప్రశ్నించింది. ఐఆర్డీఏఐ నిబంధనలను ఉల్లంఘించి కంపెనీలు పన్ను ఎగవేసినట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ ఏడాది మార్చి నుంచి, డీజీజీఐ రూ. 4,000 కోట్లకు పైగా జీఎస్టీ చెల్లించాలని కోరుతూ 30 సంస్థలకు షో-కాజ్ నోటీసులు పంపింది. ఈ సంస్థలు ఇప్పటివరకు సుమారు రూ.700 కోట్లు చెల్లించాయి.
కోర్టుకు వెళ్తున్న కంపెనీలు..
కొన్ని సంస్థలు డీజీజీఐ చర్యకు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించే పనిలో ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సమస్యను పరిష్కరించడానికి ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో చర్చించాలని యోచిస్తున్నారని సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. డీజీజీఐ, ఐటీ డిపార్ట్‌మెంట్ చర్యలు అన్యాయమని ఇండస్ట్రీ వాదిస్తోంది. సమస్య చట్టపరమైన వివరణకు సంబంధించినదని , మోసం కేసు కాదని చెబుతోంది.దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపింది.
సక్రమంగా ఉండే కంపెనీలకూ ఇబ్బందులే...
బోగస్ ఐటీసీ క్లెయిమ్‌లను గుర్తించడానికి జరుగుతున్న విచారణ సందర్భంగా డేటా సరిపోలకపోవడం వల్ల నిజమైన కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయని సంబంధిత సంస్థలు అంటున్నాయి. కొన్ని సందర్భాలలో, కొనుగోలుదారు అమ్మకందారు జీఎస్టీ ఫైలింగ్‌ల మధ్య డేటా సరిపోలడం లేదు. దీనివల్ల కొనుగోదారులు ఐటీసీని క్లెయిమ్ చేయలేకపోతున్నారు. వ్యాపారం కోసం ఉపయోగించే వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేసేటప్పుడు చెల్లించే పన్నుకు సంబంధించిన జీఎస్టీ క్రెడిట్‌ని ఐటీసీ సూచిస్తుంది. ఐటీసీకి ఒక ఉదాహరణ ఏమిటంటే... ముడిసరుకుపై చెల్లించే జీఎస్టీ. కొనుగోలుదారు ఐటీసీ విలువను కుదించడానికి ఒక రూల్ ఉంది. డేటా పోలకపోవడం వల్ల చాలా మంది నిజమైన కొనుగోలుదారులు తమ ఐటీసీ క్లెయిమ్‌లను వాపసు చేయవలసి వచ్చింది. కొనుగోలుదారు పెద్ద కంపెనీ అయితే, వాపసు చేసిన మొత్తం రూ.కోట్లలో ఉంటోంది. చాలా ఐటీసీ సమస్యలు సరఫరాదారు తప్పుగా ఫైల్ చేయడం లేదా నాన్-ఫైలింగ్ చేయడం వల్ల వస్తాయని అధికారులు అంటున్నారు. ఇటువంటి సందర్భాలలో, సరఫరాదారు పన్ను చెల్లించలేదని జీఎస్టీ అధికారులు భావిస్తారు.