గేమింగ్ సెంటర్లలో పెరిగిన రద్దీ

గేమింగ్ సెంటర్లలో పెరిగిన రద్దీ

పిల్లలు, పెద్దలతో షాపింగ్​ మాల్స్ కిటకిట

హైదరాబాద్, వెలుగు: స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులు ఇయ్యడంతో చాలా మంది పిల్లలతో సొంతూళ్లకు వెళ్తున్నారు. పండక్కి సిటీలో ఉంటున్నవారు, ఊళ్ల నుంచి సిటీకి వచ్చిన వారితో పర్యాటక, వినోద ప్రాంతాలకు రద్దీ పెరుగుతోంది. మామూలు రోజుల్లో శని, ఆదివారాలు మాల్స్, గేమింగ్ జోన్లలో ఎక్కువ మంది కనిపిస్తుంటారు. వరుస సెలవులు రావడంతో ప్రస్తుతం కస్టమర్ల సంఖ్య పెరిగిందని గేమింగ్ జోన్ల మేనేజర్లు చెబుతున్నారు. మునుపటితో పోలిస్తే ఒక్కోచోట పదివేల నుంచి 20 వేల వరకు కస్టమర్లు వస్తున్నారు.   

ఆటలతో ఆరోగ్యం ..

సిటీలో పదుల సంఖ్యలో ఇండోర్, ఔట్​ డోర్ గేమింగ్ జోన్‌‌‌‌లు ఉన్నాయి. శివార్లలోనూ కొత్త కొత్త గేమ్‌‌‌‌లతో జోన్లు పుట్టుకొస్తున్నాయి. వీటిలో పిల్లలు, పెద్దలు అందరూ ఆడుకునేలా వందల గేమ్‌‌‌‌లు ఉన్నాయి. వర్చువల్, ఫిజికల్ ఆటలపై చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటిల్లీపాది నచ్చిన గేమ్స్ ఆడుకునేలా ప్యాకేజీలు ఉన్నాయి. పండుగ రోజుల్లో రద్దీ రెండు మూడింతలు అవుతుందని గేమింగ్ జోన్ల మేనేజర్లు చెబుతున్నారు. అన్ని రకాల గేమ్‌‌‌‌లు ఉన్నచోట ఒక్కరోజు లక్షల్లో బిజినెస్ అవుతుంది. 

ఇండోర్ కే ఎక్కువగా..

ఆట, పాట, ఫుడ్, షాపింగ్, మూవీస్ అన్నీ ఒకేచోట ఉన్న ప్లేస్‌‌‌‌లకు నగరవాసుల నుంచి ఎక్కువ ఆదరణ ఉంటుంది. మాల్స్‌‌‌‌లో ఉండే ఇండోర్ గేమింగ్ జోన్లకే జనాలు అధికంగా వెళ్తున్నారు. ప్రతి మాల్‌‌‌‌లో విభిన్న రకాల గేమ్‌‌‌‌లతో ప్లే ఏరియాలు ఉన్నాయి. వీటిలో చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్లు ఆడుకునేందుకు విడిగా గేమ్‌‌‌‌లు ఉన్నాయి. అందుకే అన్నీ అందుబాటులో ఉండే ప్లే జోన్లకు జనం వెళ్తున్నారు. గేమింగ్ జోన్‌‌‌‌లోకి ఒక్కసారి అడుగుపెడితే క్యాష్ లెస్ పేమెంట్ కోసం స్మార్ట్ కార్డ్ ఇస్తారు. ఆ స్మార్ట్ కార్డ్‌‌‌‌ ఒకసారి తీసుకుంటే మనకు నచ్చిన అమౌంట్​ను రీచార్జ్ చేసుకోవచ్చు. 500 నుంచి1500 వరకు అమౌంట్​ని యాడ్ చేసుకుని నచ్చిన గేమ్‌‌‌‌లు ఆడుకునే వెసులుబాటు ఉంటుంది. ఆడే ఆటలో చేసే స్కోర్ ని బట్టి టికెట్లు వస్తాయి. వాటితో పిల్లలకు, పెద్దలకు గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. కొన్నిగేమ్‌‌‌‌లలో వేల రూపాయల బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో అటు ఆటలు ఇటు గిఫ్ట్స్ వస్తుండటంతో అందరూ వాటివైపే మొగ్గు చూపుతున్నారు.

ఫుల్ క్రౌడ్ ఉంటుంది..

మాములుగా గేమ్ జోన్​కు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదారు వేల మంది వస్తే శని, ఆదివారాల్లో 20వేలకు పైగా సందర్శకులు వస్తున్నారు. పండుగ సెలవులు మొదలయ్యాక క్రౌడ్ ఇంకా పెరిగింది. ఉదయం పదిన్నర నుంచి రాత్రి పదిన్నర వరకు కంటిన్యూస్ గా గేమ్ జోన్ ఓపెన్ ఉంటుంది. షిఫ్ట్ ల వారీగా స్టాఫ్ ని పెట్టి కో–ఆర్డినేట్ చేయిస్తున్నాం. పిల్లలతో ఎక్కువమంది వస్తున్నారు. 

- వివేక్, మేనేజర్, 
ట్రిడోమ్ గేమింగ్ జోన్, కొండాపూర్

మొదటిసారిగా..

సిటీలో బంధువుల ఇంటికి వచ్చాం. అందరం కలిసి మాల్​కి వెళ్లాం. అక్కడ గేమ్ జోన్​కు వెళ్లాం. మా మనువడు చాలా ఆటలు నాలుగు గంటల పాటు ఆడాడు. అక్కడ చాలామంది 
పిల్లలు, పెద్దలతో రద్దీగా ఉంది. పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఎంజాయ్ చేశాడు. మీం కూడా చాలా గేమ్స్ ఆడాం. చాలా సంతోషంగా అనిపించింది.

- సుజాత, కూకట్​పల్లి