ఫ్రీ జర్నీ ఎఫెక్ట్​.. ఫుల్​ ఆక్యుపెన్సీ

ఫ్రీ జర్నీ ఎఫెక్ట్​.. ఫుల్​ ఆక్యుపెన్సీ
  • కరీంనగర్ రీజియన్‌‌‌‌లో పెరిగిన ఆర్టీసీ ఆదాయం 
  •      ఐదున్నర నెలల్లో మూడున్నర కోట్ల జీరో టికెట్ల వినియోగం
  •      మార్చిలో అత్యధికంగా 93 లక్షల జీరో టికెట్ల జారీ

కరీంనగర్, వెలుగు: మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ తో ఆర్టీసీ బస్సుల్లో ఫుల్ ఆక్యుపెన్సీ ఉంటోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మీ స్కీమ్ లో భాగంగా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఆధార్ కార్డు చూపిస్తే మహిళలకు ఫ్రీ జర్నీ కల్పించిన విషయం తెలిసిందే. ఐదున్నర నెలల్లో కేవలం ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలోనే సుమారు మూడున్నర కోట్ల జీరో టికెట్లు తీసుకుని మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. స్కీమ్ ప్రారంభంలో బస్సుల కొరత, జాతర సమయం కావడంతో మహిళా ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోయేవి. క్రమంగా కొత్త బస్సుల సంఖ్య పెరగడం, జాతరల సీజన్ ముగియడంతో గతంతో పోలిస్తే బస్సుల్లో రద్దీ తగ్గింది.

రోజుకు 4.5లక్షల మంది ప్రయాణం 

కరీంనగర్ రీజియన్ లో కరీంనగర్-1, 2, హుజూరాబాద్, హుస్నాబాద్, మంథని, గోదావరిఖని, మెట్‌‌‌‌పల్లి, జగిత్యాల, కోరుట్ల, వేములవాడ, సిరిసిల్ల డిపోలు ఉన్నాయి.  డిసెంబర్ 9కి ముందు వరకు రోజుకు రెండున్నర లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండేవారు. మహిళలకు ఫ్రీ జర్నీ స్కీమ్ అమల్లోకి వచ్చాక ఆ సంఖ్య క్రమంగా 4.5 లక్షలకు చేరింది. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉంటున్నారు. మహిళలకు ఫ్రీ జర్నీ సౌకర్యం ప్రారంభమయ్యాక కరీంనగర్ రీజియన్ లో ఐదున్నర నెలల్లో మూడున్నర కోట్ల జీరో టికెట్లు జారీ అయ్యాయంటే మహిళల తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో 60 శాతం నుంచి 100 శాతం దాటింది.  ఆక్యుపెన్సీ పెరగడంతో అదే స్థాయిలో రీజియన్‌‌‌‌కు ఆదాయం సమకూరుతోంది. 

బస్సులు ఫుల్.. 

మహాలక్ష్మీ స్కీమ్ అమల్లోకి రావడానికి ముందు డ్రైవర్లు బస్సుల్లో ప్రయాణికులు నిండేందుకు అరగంట, గంట వేచి చూసేవారు. అలాగే చేయి ఎత్తిన చోట బస్సు ఆపి ప్రయాణికులను ఎక్కించుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు బస్సులు ప్లాట్ మీదికి రాగానే నిండిపోతున్నాయి. అన్ని బస్సుల్లో సీట్లకు మించి ఎక్కడంతో నిల్చొని ప్రయాణిస్తున్నారు. ఈ బస్సుల్లో రష్ ఎక్కువగా ఉండడంతో పురుషులు చాలామంది డీలక్స్‌‌‌‌, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, లహరి  బస్సుల్లో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ బస్సుల్లో కూడా గతంతో పోలిస్తే ఆక్యుపెన్సీ పెరిగింది.  

మార్చిలో అత్యధికంగా జీరో టికెట్లు జారీ 

మహిళలకు ఫ్రీ జర్నీ ప్రారంభమై ఐదున్నర నెలలు దాటుతుండగా.. కరీంనగర్ రీజియన్ పరిధిలో మార్చిలో అత్యధికంగా 93 లక్షల జీరో టికెట్లు జారీ అయ్యాయి. స్కీమ్ ప్రారంభమైన మొదటి నెల డిసెంబర్ లో 41,42,274  జీరో టికెట్లు జారీ కాగా, జనవరిలో 77,26,662, ఫిబ్రవరిలో 83,20,216, మార్చిలో 93,25,618, ఏప్రిల్ లో 85,06,379, మే 20 వరకు  50.32 లక్షల జీరో టికెట్లు జారీ అయ్యాయి. 

మహాలక్ష్మి స్కీమ్‌‌‌‌తో ఆర్టీసీ బలోపేతం

ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో మహిళలకు ఆర్థికంగా ఊరట లభిస్తోంది.  జీరో టికెట్ల డబ్బులను ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్‌‌‌‌ చేస్తోంది. దీంతో సంస్థ ఆర్థికంగా బలోపేతమవుతోంది. డిమాండ్ తగ్గట్లు క్రమంగా కొత్త బస్సులను పెంచుతున్నాం. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వెనక్కి తగ్గం.
- పొన్నం ప్రభాకర్, 
బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి