లోక్​సభకు పెరుగుతున్న పోటీ

లోక్​సభకు పెరుగుతున్న పోటీ
  •     1952లో 1,874 మంది బరిలోకి 
  •     2019లో 8039 అభ్యర్థులు పోటీ 
  •     పీఆర్ఎస్  లెజిస్లేటివ్  రిసెర్చ్​లో వెల్లడి
  •     గత ఎన్నికల్లో తెలంగాణ ఫస్ట్ 
  •     ఒక్క నిజామాబాద్ నుంచే అత్యధికంగా 185 మంది కంటెస్ట్

న్యూఢిల్లీ :  లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1952లో నిర్వహించిన లోక్ సభ ఎన్నికల్లో 1874 మంది పోటీచేయగా.. 2019 ఎన్నికల్లో 8039 మంది అభ్యర్థులు పోటీచేశారు. అంటే అభ్యర్థుల సంఖ్య నాలుగు రెట్లుపైనే పెరిగింది. 1952 నుంచి 2019 వరకు ప్రతి లోక్ సభ నియోజకవర్గానికి  పోటీచేసిన అభ్యర్థుల సగటు 4.67 నుంచి 14.8కి ఎగబాకింది. ఈ విషయాన్ని పీఆర్ఎస్  లెజిస్లేటివ్  రిసెర్చ్  అనే సంస్థ తన రిపోర్టులో వెల్లడించింది. 2024 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. 

1977లో జరిగిన ఆరో లోక్ సభ ఎన్నికల వరకు ప్రతి నియోజకవర్గానికి సగటున ముగ్గురి నుంచి ఐదుగురు పోటీచేశారని తెలిపింది. అయితే, 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి సగటున 14.8 మంది క్యాండిడేట్లు బరిలో నిలిచారని వివరించింది. ఆ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. 2019 లోక్ సభ ఎన్నికల్లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పోటీచేసిన సగటు అభ్యర్థుల సంఖ్య తెలంగాణలో అత్యధికంగా ఉంది. ఒక్క నిజామాబాద్  లోక్ సభ స్థానం నుంచే 185 మంది పోటీచేశారు. వారిలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్  వంటి ప్రధాన పార్టీల క్యాండిడేట్లతో పాటు ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. 

నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే తెలంగాణలోని అన్ని సీట్లలో పోటీచేసిన అభ్యర్థుల సగటు 16.1. తెలంగాణ తర్వాత తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మూడింట రెండు వంతులు ఇండిపెండెంట్లే ఉన్నారు. నిజామాబాద్  తర్వాత కర్నాటకలోని బెళగావి రెండో స్థానంలో నిలిచింది. పార్టీల విషయానికి వస్తే బీజేపీ తరపున 435, కాంగ్రెస్  నుంచి 420 మంది అభ్యర్థులు పోటీచేశారు. మూడో స్థానంలో బీఎస్పీ నిలిచింది. ఐదు అతిపెద్ద రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్  నుంచి అత్యధిక మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

 ఈ రాష్ట్రంలో జాతీయ పార్టీల నుంచి సగటున 4.6 మంది అభ్యర్థులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే, గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలు నియోజకవర్గానికి తమ పార్టీల నుంచి 1.53 అభ్యర్థులను నిలబెట్టాయి. ప్రాంతీయ పార్టీల్లో బిహార్ (ఆరు పార్టీలు), తమిళనాడు (8 పార్టీలు) వరుసగా 1.2, 1.3 అభ్యర్థులను నిలబెట్టాయి.  

1952లో ఒక్కోచోటా సగటున 3.83 మంది..

1952లో మొత్తం 489 లోక్ సభ సీట్లకు 1874 మంది పోటీచేశారు. అంటే నియోజకవర్గానికి సగటున 3.83 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆ సంఖ్య 1971లో 2,784 (నియోజకవర్గానికి సగటున 5.37) కు పెరిగింది. 1977లో 2439 మంది (ప్రతి సీటుకు 4.5 క్యాండిడేట్లు), 1980లో 4629 మంది (ప్రతి సీటుకు 8.45), 1984లో 5492 మంది (ప్రతి నియోజకవర్గానికి 10.13 అభ్యర్థులు) పోటీచేశారు. 1989లో జరిగిన ఆరో సార్వత్రిక ఎన్నికల్లో 6160 మంది (ప్రతి సీటుకు 11.34 అభ్యర్థులు), 1991లో 8668 మంది (ప్రతి నియోజకవర్గానికి 15.96 మంది), 1996లో జరిగిన పదకొండో లోక్ సభ ఎన్నికల్లో 13,952 మంది (ప్రతి నియోజకవర్గానికి 25.69 అభ్యర్థులు) బరిలో నిలిచారు.

 పోటీచేసే అభ్యర్థుల సంఖ్య ప్రతి ఎన్నికల్లో పెరుగుతుండడంతో ఎన్నికల సంఘం డిపాజిట్  అమౌంట్ ను రూ.500 నుంచి రూ.10 వేలకు పెంచింది. దీంతో 1998 లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య 4,750 కు తగ్గింది. 1999 ఎన్నికల్లోనూ అభ్యర్థుల సంఖ్య 4,648కే పరిమితమైంది. ఇక 2004లో అభ్యర్థుల సంఖ్య మళ్లీ ఐదువేల మార్కు దాటి 5435 కు చేరింది. 2009లో 8070 (14.86), 2014లో 8251 మంది పోటీ చేశారు.