సన్నాలకు ఫుల్​ డిమాండ్ .. 2,500 చెల్లిస్తూ కల్లాల కాడనే కొంటున్న వ్యాపారులు

సన్నాలకు ఫుల్​ డిమాండ్ .. 2,500 చెల్లిస్తూ కల్లాల కాడనే కొంటున్న వ్యాపారులు

వనపర్తి, వెలుగు: దేశవ్యాప్తంగా సన్న వడ్లకు డిమాండ్​ పెరగడం జిల్లా రైతులకు కలిసివస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు పండించిన సన్న రకం వడ్లను వ్యాపారులు కల్లాల వద్దకే వచ్చి క్వింటాల్​కు రూ.2,500 చెల్లించి కొంటున్నారు. మంచి ధర వస్తుండడంతో పాటు కల్లాల వద్దనే వ్యాపారులు కాంటా వేయడంతో రైతులు వారికే అమ్ముతున్నారు. పక్క జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి వడ్లను ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువ పెట్టి కొనుగోలు కొనుగోలు చేయడం గమనార్హం. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, సంగంబండ, భీమా, కోయిల్ సాగర్  లిఫ్ట్​ల కింద దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు.

అలాగే చెరువులు, కుంటల కింద మరో లక్ష ఎకరాల్లో పంట సాగు చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అంతరాష్ట్ర  వ్యాపారులు వడ్లు కొని నగదు చెల్లించి లారీలు,డీసీఎంలలో తీసుకుపోతున్నారు. పొలాల వద్దే కొంత వరకు తేమ ఉన్న వడ్లను కొనుగోలు చేస్తుంచడంతో రైతులకు ఇబ్బందులు తప్పాయి.జిల్లాలో  ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ప్రభుత్వ మద్దతు ధర కంటే అదనంగా క్వింటాకు వంద రూపాయలు వ్యాపారులు చెల్లింస్తున్నారు.దీంతో రైతులు వ్యాపారుల వైపే  మొగ్గుచూపుతున్నారు.

దిగుబడి అంతంతే..

వనపర్తి జిల్లాలో 4.70  లక్షల మెట్రిక్  టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 1.5 లక్షల మెట్రిక్  టన్నుల సన్న వడ్లు దిగుబడి వస్తుందని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 5.5 లక్షల మెట్రిక్ టన్నుల్లో 2.1 లక్షల మెట్రిక్  టన్నుల సన్న వడ్ల దిగుబడి వస్తుందని అధికారులు తెలిపారు. మహబూబ్​నగర్, నారాయణ పేట జిల్లాల్లో 410 మెట్రిక్  టన్నులకు గాను 1.25 లక్షల మెట్రిక్  టన్నులు సన్న రకం వడ్ల దిగుబడి రావచ్చని సివిల్  సప్లై ఆఫీసర్లు తెలిపారు.

పడిపోయిన సన్నరకాల సాగు..

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల కింద మూడున్నర లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు.అందులో బీపీటీ స్వర్ణ మసూరి 5204 రకం విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. ఈ పంటకు వానాకాలం సీజన్ లో అగ్గి తెగులు సోకుతుండడంతో ప్రతి ఏటా దిగుబడి తగ్గుతూ వస్తోంది. దీంతో సన్న రకాల్లో హైబ్రిడ్ వంగడాలను రైతులు ఎంచుకుంటున్నారు. ఆర్ఎన్ఆర్, కేఎన్ఎం, వర్షా, కావేరీ వంటి సన్నాలు చీడపీడలు తట్టుకుంటున్నాయి. అయితే వీటికి స్వర్ణ మసూరికి ఉన్న డిమాండ్ ఉండదు. నాణ్యతలో కూడా తేడా ఉంటుంది. పంట కాలం కూడా బీపీటీ కంటే తక్కువ కావడంతో రైతులు వీటిని సన్న రకం వడ్లుగా పండించి ప్రభుత్వానికి అమ్ముతున్నారు. అయితే ఈసారి బయటి మార్కెట్ లో వీటికి డిమాండ్  ఏర్పడడంతో రైతులు ఊరట చెందుతున్నారు.

కేంద్రాలు ఏర్పాటు చేయాలి..

10 రోజుల నుంచి కోతలు ప్రారంభమయ్యాయి. వ్యాపారులు సన్న వడ్లనే కొంటున్నారు. దొడ్డు వడ్లు సర్కారు కొనుగోలు చేసేందుకు సెంటర్లు ఏర్పాటు చేయాలి. ముందు కోతకు వచ్చిన వడ్లు ఆరబెట్టి అమ్మడానికి రెడీగా ఉన్నాం. -  బాలయ్య, తూంకుంట

ఖర్చులు మిగులుతున్నయ్..

ఈ ఏడాది ఆర్ఎస్ఆర్  రకం సన్నాలు సాగు చేసిన. మంచి ధర రావడంతో వ్యాపారులకు నగదుకు వడ్లు అమ్ముతున్నాం. దీంతో ఆరబెట్టి, కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లే ఖర్చులు మిగిలినయ్. క్వింటాకు 3 కిలోల తరుగు తీసి, రూ. 2,300 ఇచ్చిన్రు. - సురేందర్ రెడ్డి, కానాయపల్లి