
- నానాటికి పెరుగుతున్న భక్తుల రద్దీ
- అవసరాలకు తగ్గ వసతి కరువు
- పని చేయని నెట్వర్క్, అత్యవసర పరిస్థితిలో తప్పని తిప్పలు
అమ్రాబాద్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మద్దిమడుగులోని పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ నానాటికి పెరుగుతోంది. అందుకు అనుగుణంగా వసతి లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నల్లమల అభయారణ్యం కృష్ణానది తీరంలో శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారి గుండా 52 కిలోమీటర్ల దూరంలో స్వయంభూగా వెలసిన పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏపీ, దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అంజన్న దర్శనానికి వస్తుంటారు. మంగళ, శని, ఆదివారాల్లో వేలాదిగా భక్తులు తరలి వచ్చి స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు.
సౌలతులు అంతంతే..
మద్దిమడుగు క్షేత్రంలో భక్తుల అవసరాలకు తగ్గట్లు సౌలతులు లేవు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రాత్రి వేళల్లో నిద్రించేందుకు గుడి ఆవరణే దిక్కవుతోంది. భక్తుల సంఖ్యకు అనుగుణంగా వసతి గృహాలు, షెడ్లు లేకపోవడంతో భక్తులు తిప్పలు పడుతున్నారు. రాత్రిళ్లు చిన్నారులతో గుడి ఆవరణలో గడపాల్సి వస్తోంది.
వసతి గృహాల నిర్మాణానికి దాతలు ముందుకు వస్తున్నా అవసరమైన స్థలం అందుబాటులో లేకపోవడం, ఫారెస్ట్ రూల్స్ అడ్డంకిగా మారుతోంది. ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చినప్పటి నుంచి ఆలయ అభివృద్ధి కోసం అటవీ శాఖకు అనేక సార్లు ల్యాండ్ బదలాయింపు కోసం దరఖాస్తు చేసినా ఎలాంటి ఫలితంకలగడం లేదు.
నీళ్లకూ తిప్పలే..
భక్తుల రద్దీ పెరగడంతో స్నానాలు, తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మిషన్ భగీరథ నీళ్లు సప్లై అవుతున్నప్పటికీ, భక్తుల అవసరాలకు తగ్గట్లు సరఫరా కావడం లేదు. ఫారెస్ట్ అడ్డంకులతో బోర్లు వేయడం, ట్యాంకుల నిర్మాణం ముందుకు పడడం లేదు. గ్రామస్తులు, భక్తుల అవసరాలకు తగినట్లుగా నీటిని సప్లై చేయలేకపోతున్నారు.
ఫారెస్ట్ అధికారులు సహకరించాలి..
ఆలయ అభివృద్ధిలో భాగంగా ధర్మశాల, కల్యాణ కట్ట, కల్యాణ మండపం, వసతి గృహాలు, టాయ్ లెట్స్, ఇతర అభివృద్ధి పనులకు ల్యాండ్ అవసరం ఉంది. ల్యాండ్ బదలాయింపుపై పంపిన ప్రపోజల్స్ను అటవీ శాఖ అధికారులు పరిశీలించి పర్మిషన్ ఇవ్వాలి. ఆలయ సమీపంలో 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చి, కొల్లాపూర్ మండలం మాచినోనిపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి సంబంధించిన భూమి తీసుకోవాలి. ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఆలయ అభివృద్ధికి సహకరించాలి.-మంతటి రామాంజనేయులు, మాజీ ఎంపీటీసీ