జాడలేని ఫుడ్ కమిటీలు.. పెరుగుతున్న ఫుడ్ పాయిజన్​ ఘటనలు

జాడలేని ఫుడ్ కమిటీలు.. పెరుగుతున్న ఫుడ్ పాయిజన్​ ఘటనలు
  • వనపర్తి జిల్లాలో పెరుగుతున్న ఫుడ్ పాయిజన్​ ఘటనలు
  • కేజీబీవీలు, హాస్టళ్లను తనిఖీ చేయని ఆఫీసర్లు

వనపర్తి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక గురుకులాలను తామే ఏర్పాటు చేశామని గొప్పలు చెబుతున్నా, స్టూడెంట్ల ఆరోగ్య భద్రతపై ఏ మాత్రం శ్రద్ద చూపకపోవడంతో గురుకులాలు, కేజీబీవీలు, హాస్టళ్లలో చదువుకుంటున్న స్టూడెంట్స్​ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు తరుచూ ఫుడ్ పాయిజన్​కు గురవుతున్నారు. చిన్నారులకు ఇచ్చే ఆహారం విషయంలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యతను పక్కన పెడుతున్నారు. ఇటీవల అమరచింత కేజీబీవీలో 60 మందికి పైగా స్టూడెంట్లు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి  పాలయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు  సిబ్బందిపై వేటు వేశారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని గురుకులాలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లలో ఇదే పరిస్థితి ఉందని, వీటి పర్యవేక్షణ కోసం పేరెంట్స్, టీచర్లతో ఫుడ్  కమిటీలు ఏర్పాటు చేయాలని  డిమాండ్ చేస్తున్నారు. 

సొంత వారికి కాంట్రాక్ట్ లతోనే..

బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతల దగ్గరి బంధువులు, అనుచరులు కేజీబీవీలు, గురుకులాలు, హాస్టళ్లలో సరుకుల సరఫరా టెండర్లను దక్కించుకుంటున్నారు. తాగునీటి నుంచి స్టూడెంట్లకు ఇచ్చే కూరగాయలు, పాలు, పండ్లు, గుడ్లు, చికెన్, మటన్, కిరాణం వంటి వస్తువులను నాణ్యత లేకుండా సప్లై చేస్తున్నారు. వీటి విషయంలో అక్కడి ప్రిన్సిపాళ్లు, సిబ్బంది నోరు మెదపడం లేదని అంటున్నారు. ఇక ఉడకని అన్నం, నీళ్లచారు, రుచి లేని కూరలు వడ్డిస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా ఒక్కరిద్దరే టెండర్లు దక్కించుకొని అధికారులను సైతం కమీషన్లతో తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.

పౌష్టికాహారం అందక విద్యార్థుల్లో రక్తహీనత కనిపిస్తోంది. మెనూ ప్రకారం అందించే ఆహారంపై అధికారుల పర్యవేక్షణ ఉండడం లేదు. గతంలో విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు, మీడియా కేజీబీవీలు, హాస్టళ్లు, గురుకులాలను సందర్శించి అక్కడ ఉన్న లోపాలను వెలుగులోకి తెచ్చేవారు. ప్రస్తుతం ఎవ్వరినీ అనుమతించడం లేదు. కనీసం స్టూడెంట్లతో మాట్లాడనివ్వడం లేదు. దీంతో స్టూడెంట్ల పరిస్థితి దయనీయంగా మారుతుందని అంటున్నారు. వనపర్తి న్యాయమూర్తి రజని విద్యార్థులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న మెనూ చూసి ఆవేదనకు గురయ్యారు.

జాడలేని ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌

ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఒకే ఒక్క ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌  ఉండడంతో ప్రభుత్వ, ప్రైవేట్  సంస్థల్లో ఆహారం విషతుల్యంగా మారుతోందని అంటున్నారు. అన్ని విద్యా సంస్థలను ఫుడ్ ఇన్స్ పెక్టర్  తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో వందకు పైగా స్టూడెంట్లు అస్వస్థతకు గురైనా, సంబంధిత  వ్యక్తులపై కేసులు నమోదు కావడం లేదు. విద్యాశాఖకు జిల్లాలో రెగ్యులర్  ఆఫీసర్​ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఫుడ్ కాంట్రాక్టర్ల పై పర్యవేక్షణ బాధ్యత డీఈవో పైనే ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లు, కేజీబీవీలకు ఇచ్చే వస్తువులు గుర్తింపు పొందిన సంస్థలకే టెండర్లు ఇవ్వాలి. రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాల కారణంగా ఎవరు పడితే వారు టెండర్లు దక్కించుకొని నాణ్యత లేని సరుకులు సప్లై చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావిడి చేసే ఆఫీసర్లు, ఆ తర్వాత ఈ విషయాన్ని పక్కన పెడుతున్నారు.

శాంపిళ్లు తీసుకుంటాం..

అమరచింత కేజీబీవీలో ఫుడ్​ పాయిజన్​ ఘటన తర్వాత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్ శాంపిళ్లు సేకరిస్తున్నాం. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, నీరు, పాలు వంటివి సప్లై చేసే వారి వివరాలు తెప్పించుకుంటున్నాం. ఏమైనా తేడా వస్తే కమిషనర్ కు ఫిర్యాదు చేస్తాం. నాణ్యత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్ట్ ను రద్దు చేయాలని ప్రతిపాదిస్తాం.

 నీలిమ, ఫుడ్​ ఇన్స్ పెక్టర్, మహబూబ్ నగర్