భారత్ గెలుపు.. అదరగొట్టిన అయ్యర్, ఇషాన్

భారత్ గెలుపు.. అదరగొట్టిన అయ్యర్, ఇషాన్

రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఇచ్చిన 279 పరుగుల టార్గెట్ ను భారత్ కేవలం 45.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేవలం 48 పరుగులకే ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్‌ పెవీలియన్‌ చేరినా.. ఆ తర్వాత క్రీజులో అడుగుపెట్టిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ మూడో వికెట్‌కు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 161 పరుగుల భారీ పార్టనర్‌షిప్‌తో జట్టు విజయానికి పునాదులు వేశారు.  

అయ్యర్ 111 బంతుల్లో 15 ఫోర్లతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇషాన్ కిషన్ 84 బంతుల్లోనే 93 పరుగులు చేశాడు. కిషన్ ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 7 భారీ సిక్సులు ఉన్నాయి. చివర్లో సంజు శాంసన్ (36 బంతుల్లో 30 నాటౌట్) సమయోచితంగా రాణించడంతో టీమిండియా విజయతీరాలకు చేరింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫోర్టుయిన్ 1, వేన్ పార్నెల్ 1, కగిసో రబాడా 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ను 1–1తో సమం చేసింది. ఇక సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే అక్టోబరు 11న ఢిల్లీలో జరగనుంది.

భారత బ్యాటింగ్ : శిఖర్ ధవన్ (13), శుభ్‌మన్ గిల్ (28), ఇషాన్ కిషన్ (93), శ్రేయస్ అయ్యర్ (113 నాటౌట్), సంజూ శాంసన్ (30 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. 

దక్షిణాఫ్రికా బ్యాటింగ్ : క్వింటన్ డికాక్ (5), మలన్ (25), రీజా హెండ్రిక్స్ (74), మార్‌క్రమ్ (79), క్లాసెన్ (30), డేవిడ్ మిల్లర్ (35 నాటౌట్), పార్నెల్ (16), కేశవ్ మహరాజ్ (5), ఫోర్టున్(0 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.