ఇటు రోహిత్, కోహ్లీ.. అటు మ్యాక్స్‌వెల్, స్టార్క్.. మూడో వన్డేలో హోరాహోరీ తప్పదు

ఇటు రోహిత్, కోహ్లీ.. అటు మ్యాక్స్‌వెల్, స్టార్క్.. మూడో వన్డేలో హోరాహోరీ  తప్పదు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలివుండగానే చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఒకరకంగా బుధవారం రాజ్‌కోట్‌ వేదికగా జరగనున్న చివరి వన్డే నామ‌మాత్ర‌పు మ్యాచ్. కానీ, ఇరు జట్ల సమీకరణాలు చూస్తుంటే అలా కనిపించటం లేదు. వరల్డ్ కప్ టోర్నీకి ముందు ఇదే చివరి మ్యాచ్ కావడంతో.. విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని ఇరు జట్లు భావి స్తున్నాయి. ఈ క్రమంలో గెలుపు కోసం కీలక ఆటగాళ్లను బరిలోకి దించడానికి సిద్ధమయ్యాయి.

రోహిత్, కోహ్లీ ఇన్

తొలి రెండు మ్యాచులకు విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ మ్యాచులో బరిలోకి దిగడం వంద శాతం ఖాయమే. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాకు కూడా తుది జట్టులో స్థానం దక్కొచ్చు. ఈ మ్యాచ్ నుండి యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌, శార్దూల్‌కు విశ్రాంతి ఇవ్వనుండగా.. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చైనా(ఆసియన్ గేమ్స్) పర్యటన కారణంగా దూరం కానున్నాడు.

Also Read :- గెలిస్తే తప్పుకుంటాడు: కోహ్లీ రిటైర్మెంట్ వార్తలపై డివిలియర్స్

మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్

మరోవైపు ఆస్ట్రేలియా సైతం బలమైన ఆటగాళ్లను బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది. గాయంతో యాషెస్ సిరీస్ నుండి దూరంగా ఉన్న స్టార్క్ రాజ్‌కోట్‌ వన్డేతో పునరాగమనం చేయనున్నాడు. అలాగే, మొదటి రెండు మ్యాచులకు దూరంగా ఉన్న మ్యాక్స్‌వెల్ సైతం తుదిలో జట్టులో ఉండనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నెట్స్ సెషన్‌లో ఈ విధ్వంసకర బ్యాటర్ తీవ్రంగా శ్రమించాడు. ఈ మార్పులను బట్టి చూస్తుంటే మూడో వన్డేలో హోరాహోరీ తప్పదనిపిస్తోంది.

క్లీన్ స్వీప్ చేస్తే.. చరిత్రే

ఇప్పటికే తొలి రెండు వన్డేలలో విజయం సాధించిన భారత జట్టు.. మూడు వన్డేలోనూ గెలిస్తే అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకోవచ్చు. ఇప్పటివరకు ద్వైపాక్షిక సిరీసుల్లో కొన్నింటిని టీమిండియా గెలిచినా.. క్లీన్‌స్వీప్‌ మాత్రం చేయలేదు. ఇప్పుడు అలాంటి సువర్ణావకాశం ముందుంది. భారత క్రికెట్‌లో ఆసీస్‌ను వైట్‌వాష్‌ చేసిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించొచ్చు. అదే జరిగితే రెట్టింపు ఆత్మ‌విశ్వాసంతో వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో అడుగుపెట్టొచ్చు.