భారత్ రానివ్వకూడదు.. ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్‌పై కేసు నమోదు

భారత్ రానివ్వకూడదు.. ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్‌పై కేసు నమోదు

సొంతగడ్డపై భారత జట్టును మట్టికరిపించి క్రికెట్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ట్రోఫీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆ జట్టు ఆటగాళ్లు ట్రోఫీతో ఫోటోలు దిగుతూ సంబరాల్లో మునిగిపోయారు. ఆ క్రమంలో ఆ జట్టు ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) డ్రెస్సింగ్ రూమ్‌లో వరల్డ్ కప్ ట్రోఫీ మీద కాళ్లు ఉంచి చేతిలో బీర్ బాటిల్ పట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని చూసి ప్రతి అభిమాని వీళ్లకు ఎంతపొగరు అని తిట్టుకుంటారు. తాజాగా, ఈ ఘటనపై అలీఘర్‍కు చెందిన పండిట్ కేశవ్ అనే ఆర్‌టీఐ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.    

వరల్డ్ కప్ ముగిసిన అనంతరం మిచెల్ మార్ష్ చేష్టలు భారత క్రికెట్ జట్టు అభిమానుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్ ఆరోపించారు. ప్రతిష్టాత్మక వరల్డ్‌కప్ ట్రోఫీ మీద కాళ్లు ఉంచడం ద్వారా దాని ప్రతిష్టను అవమానించటంతో పాటు 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని అవమానించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు దిల్లీ గేట్‌ పోలీసులు మిచెల్ మార్ష్‌పై కేసు నమోదు చేశారు. అలాగే, భారత్‌లో క్రికెట్ ఆడేందుకు మార్ష్‌ను అనుమతించవద్దని కోరుతూ ఫిర్యాదు కాపీని ప్రధాని మోదీకి పంపించారు.

ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి.