Shoaib Bashir: అబుదాబి ఎయిర్‌పోర్టులో ఉండిపోయిన ఇంగ్లాండ్ స్పిన్నర్

Shoaib Bashir: అబుదాబి ఎయిర్‌పోర్టులో ఉండిపోయిన ఇంగ్లాండ్ స్పిన్నర్

జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి టెస్ట్  ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ సమరం కోసం ఇంగ్లాండ్ జట్టు ఆదివారం(జనవరి 21) రాత్రే హైదరాబాద్‌ చేరుకోగా.. ఒక్క ఆటగాడు మాత్రం జట్టుకు దూరమయ్యాడు. యువ ఆఫ్ స్పిన్నర్ షోయ‌బ్ బ‌షీర్ అబుదాబిలో ఒంటరిగా మిగిలిపోయాడు. వీసా జారీ ఆల‌స్యం కావ‌డంతో అత‌ను ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయాడు.

వన్డే ప్రపంచ క‌ప్ పేలవ ప్రదర్శన అనంతరం ఇంగ్లాండ్ జట్టు.. వెస్టిండీస్ ప‌ర్యట‌నకు వెళ్ళింది. ఆ టూర్ ముగిసిన వెంటనే అబూదాబీలో శిక్షణ మొదలుపెట్టింది. అక్కడి నుంచి నేరుగా భార‌త విమానం ఎక్కి హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యింది. అయితే, చివరి నిమిషంలో షోయ‌బ్ బ‌షీర్ వీసా జారీ ఆల‌స్యం కావ‌డంతో అతను లేకుండానే ఇంగ్లాండ్ జట్టు.. ఇండియాకు పయనమైంది. ఈ విషయమై ఇంగ్లండ్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్ మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)అధికారులు, భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారని, రాబోయే 24 గంటల్లో పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.

షోయ‌బ్ బ‌షీర్‌కు త్వరగతిన వీసా మంజూరు చేయాలనీ ఇప్పటికే బీసీసీఐ అక్కడి భార‌త దౌత్య కార్యాల‌యం అధికారుల‌కు తెలియజేసింది. వారు వీసా ఓకే చేశాక బ‌షీర్ భార‌త విమానం ఎక్కనున్నాడు. అయితే, తొలి టెస్టుకు మ‌రో మూడు రోజుల సమయమే ఉంది. ఆలోపు బ‌షీర్ జ‌ట్టుతో క‌లుస్తాడా..! లేదా అనేది ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాల రీత్యా స్వదేశానికి తిరిగి వెళ్ళిపోగా.. అతని స్థానంలో డాన్ లారెన్స్‌ను ఎంపిక చేసింది.

ఇండియా - ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్

  • మొదటి టెస్ట్ (జనవరి 25 - జనవరి 29): హైదరాబాద్
  • రెండో టెస్ట్ (ఫిబ్రవరి 02 - ఫిబ్రవరి 06): విశాఖపట్నం
  • మూడో టెస్ట్ (ఫిబ్రవరి 15 - ఫిబ్రవరి 19) : రాజ్‌కోట్
  • నాలుగో టెస్ట్ (ఫిబ్రవరి 23 - ఫిబ్రవరి 27): రాంచీ
  • ఐదో టెస్ట్(మార్చి 7 - మార్చి 11): ధర్మశాల

ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్(కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ ఎమర్సన్, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్.