IND vs NZ: కోహ్లీ, అయ్యర్ సెంచరీలు.. న్యూజిలాండ్ టార్గెట్ 398

IND vs NZ: కోహ్లీ, అయ్యర్ సెంచరీలు.. న్యూజిలాండ్ టార్గెట్ 398

రోహిత్ మెరుపులు.. గిల్ క్లాసిక్ ఇన్నింగ్స్.. వన్డేల్లో కోహ్లీ 50వ సెంచరీ.. అయ్యర్ సునామీ ఇన్నింగ్స్.. వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్‌ పోరులో భారత బ్యాటర్ల జోరు ఇది. కీలక మ్యాచ్‌లో మన బ్యాటర్లు అందరూ పరుగుల వరద పారించారు. కోహ్లీ(117), అయ్యర్(105) సెంచరీలకు తోడు గిల్(80 నాటౌట్), రోహిత్(47) కూడా రాణించడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోర్ చేసింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు రోహిత్ శర్మ(47)- గిల్(80 నాటౌట్) జోడి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 71 పరుగులు జోడించారు. అనంతరం రోహిత్ వెనుదిరిగినా.. అక్కడినుండి ఆ భాద్యతను గిల్ కొనసాగించాడు. ఒకవైపు నిలకడగా ఆడుతూనే మరోవైపు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. అనంతరం కాలు కండరాలు పట్టేయడంతో గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా అతని స్థానంలో క్రీజులోకి వచ్చిన అయ్యర్.. కోహ్లీతో జత కలిశాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూనే స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు.

ఈ క్రమంలో కోహ్లీ(117; 113 బంతుల్లో 9 ఫోర్లు, 2  సిక్సర్లు) వన్డేల్లో50వది, కెరీర్‌లో 80వ శతకం పూర్తిచేసుకోగా.. అయ్యర్(105; 70 బంతుల్లో 4 ఫోర్లు, 8  సిక్సర్లు) కెరీర్‌లో ఐదో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. కివీస్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. టిమ్ సౌథీ 3 వికెట్లు తీసుకోగా.. బోల్ట్ ఒక వికెట్ పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించాలంటే నిర్ణీత ఓవర్లలో 398 పరుగులు చేయాలి.