ఇండియా, పాక్ మ్యాచ్ జరిగి తీరుతుంది: మ్యాచ్ రద్దు చేయాలన్న పిల్ కొట్టేసిన సుప్రీంకోర్టు

ఇండియా, పాక్ మ్యాచ్ జరిగి తీరుతుంది: మ్యాచ్ రద్దు చేయాలన్న పిల్ కొట్టేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఆసియా కప్‌ 2025లో భాగంగా భారత్ vs పాకిస్తాన్ తలపడనున్న మ్యాచ్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్)ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్‎ను అత్యవసరంగా విచారించడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. షెడ్యూల్ ప్రకారం ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆసియా కప్‎లో ఇండియా, పాక్ మ్యాచ్ రద్దు చేయాలని కోరుతూ నలుగురు లా విద్యార్థులు పిల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

పహల్గాంలో ఉగ్రదాడికి ప్రేరేపించిన పాకిస్థాన్‎తో క్రికెట్ మ్యాచ్ జాతీయ గౌరవం, ప్రజల భావోద్వేగాలకు విరుద్ధంగా సందేశాన్ని పంపుతోందని పేర్కొన్నారు. ఈ మ్యాచ్ పాకిస్తానీ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాల మనోభావాలను కూడా దెబ్బతీస్తుందని.. అలాగే ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడిన సైనికుల త్యాగాలకు విలువ లేకుండా పోతుందన్నారు. దేశ గౌరవం,  పౌరుల భద్రత వినోదం కంటే ముఖ్యమైనది కాదని పిటిషన్‎లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‎ను అత్యవసరంగా విచారించాలని కోరారు. 

►ALSO READ | ఆర్చరీ వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌: దీపిక బృందానికి కాంస్యం మిస్‌‌‌‌‌‌‌‌

న్యాయమూర్తులు జెకె మహేశ్వరి, విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‎ను అత్యవసరంగా విచారించడానికి నిరాకరించింది. ఈ పిల్‎ను అంత అత్యవసరంగా విచారించాల్సిన అవశ్యకత ఏంటని ప్రశ్నించింది. అది ఒక మ్యా్చ్ అని.. ఆటను ఆటలాగే చూడాలని పేర్కొంది. ఇండియా, పాక్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరగాలని స్పష్టం చేసింది. పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇండియా, పాక్ మ్యాచ్ లపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. 

ఇండియా, పాకిస్తాన్‌ మధ్య ద్వైపాక్షిక మ్యాచ్‌లు జరగవని తేల్చిచెప్పింది. ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ వంటి బహుళ పక్ష టోర్నీల్లో మాత్రం పాకిస్థాన్ తో తలపడటానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగానే ఆసియా కప్ లో పాక్ తో మ్యాచ్ ఆడేందుకు బీసీసీఐ అంగీకరించింది. ఆసియా కప్ లో భాగంగా 2025, సెప్టెంబర్ 14 చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మెగా ఫైట్ కోసం యావత్ క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.