క్రికెట్‌లో ABS HURT అంటే ఏంటి? పాక్ ఎందుకు ఓటమిని అంగీకరించింది!

క్రికెట్‌లో ABS HURT అంటే ఏంటి? పాక్ ఎందుకు ఓటమిని అంగీకరించింది!

దాయాదుల పోరులో భారత్ విజయదుంధుభి మోగించిన విషయం విదితమే. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింటిలోనూ భారత ఆటగాళ్లు వహ్వా అనిపించారు. ఈ మ్యాచ్‌ను గుర్తు చేసుకోవాలంటేనే పాకిస్థాన్‌ వణికిపోయేలా బెదరగొట్టారు. అచ్చొచ్చిన స్టేడియంలో విరాట్‌ కోహ్లీ (122 నాటౌట్‌) సెంచరీతో చెలరేగగా..  కేఎల్‌ రాహుల్‌ (నాటౌట్‌) కూడా శతకం బాది తన ఫిట్‌నె్‌సపై ఉన్న సందేహాలను పటాపంచలు చేశాడు. అనంతరం చైనా మెన్ కుల్దీప్‌ యాదవ్‌ (5/25) బంతితో మ్యాజిక్‌ చేశాడు. 

మొత్తానికి రోహిత్ సేన.. ఈ మ్యాచ్‌లో వరుణుడి అడ్డంకులను అధికగమిస్తూ 228 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేయగా..  ఛేదనలో పాక్‌ 32 ఓవర్లలో 8 వికెట్లకు 128 పరుగులు చేసింది. అయితే.. ఈ మ్యాచ్‌లో పాక్ 8 వికెట్ల వద్దే ఓటమిని అంగీకరించడం గమనార్హం.  అదేంటి మరో రెండు వికెట్ల పడాలి కదా.. అని క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం..ABS HURT. 

ABS HURT అంటే ఏంటి?

క్రికెట్‍లో ABS HURT అంటే.. అబ్సెంట్‌ హర్ట్‌ అని అర్థం. ఎవరైనా ఆటగాడు ఆ మ్యాచ్‌లో గాయపడిన లేదా అనారోగ్యం లేదా ఇతర ఏదేని అనివార్య కారణాల వల్ల బ్యాటింగ్ చేయలేకపోతే అతనిని అబ్సెంట్‌ హర్ట్‌‌గా పరిగణిస్తారు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ పేసర్లు నసీమ్‌, హరీస్‌ రౌఫ్‌ గాయాల కారణంగా బ్యాటింగ్‌కు దిగలేదు. దీంతో పాకిస్తాన్ 8వ వికెట్ పడగానే ఆలౌట్‌ అయినట్లుగా అంపైర్లు ప్రకటించారు. అందువల్లే పాక్ ముందుగానే ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది.