IND vs SA: జడేజా మాయాజాలం.. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం

IND vs SA: జడేజా మాయాజాలం.. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం

మళ్లీ పాత కథే. మరో మ్యాచ్.. మరో విజయం.. మొదట బ్యాటర్లు బాదుడు.. అనంతరం బౌలర్లు పని పూర్తిచేయడం. వన్డే ప్రపంచ కప్‌లో భారత జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 243 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 327 పరుగుల ఛేదనలో సఫారీలు 83 పరుగులకే కుప్పకూలారు. 

సొంతగడ్డపై భారత బౌలర్లు మరింత ప్రమాదకరంగా మారుస్తున్నారు. మ్యాచ్ మ్యాచ్‌కి పురోగతి సాధిస్తున్నారు. ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను పరుగులు చేయనివ్వడం కాదు కదా! క్రీజులో నిలవనివ్వడం లేదు. రెండ్రోజుల క్రితం మిత్రం దేశం  శ్రీలంకను 55 పరుగులకే కుప్పకూల్చి వారిని తలెత్తుకోనీకుండా చేశారు. నేడు(ఆదివారం) కోల్‌కతా గడ్డపై దక్షిణాఫ్రికా ఆటగాళ్లను అలానే భయపెట్టారు. ఈ టోర్నీలోనే అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేసి భీకర ఫామ్‌లో ఉన్న సఫారీ బ్యాటర్లను 83  పరుగులకే కుప్పకూల్చారు.

సఫారీ బ్యాటర్లలో 14 పరుగులు చేసిన మార్కో జెన్‌సెన్ టాప్ స్కోరర్. నాలుగు సెంచరీలతో భీకరమైన ఫామ్‌లో ఉన్న క్వింటన్‌ డికాక్‌(5) పరుగులకే వెనుదిరగగా.. టెంబా బవుమా (11), మార్క్‌రమ్‌ (9), హెన్రిచ్‌ క్లాసెన్‌(1), వాండర్ డస్సెన్(13), మిల్లర్(11), కేశవ్ మహరాజ్(7) పరుగులు చేశారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లు పడగొట్టగా..  షమీ, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

అంతకుముందు కోహ్లీ(101) శతకం బాదడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 326 పరుగుల భారీ స్కోర్ చేసింది.ఈ సెంచరీతో భారత  బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ వన్డేలలో నెలకొల్పిన 49 సెంచరీల రికార్డును సమం చేశాడు.