భళా భారత్: శ్రీలంక చిత్తు.. ఫైనల్‌లో అడుగుపెట్టిన టీమిండియా

భళా భారత్: శ్రీలంక చిత్తు.. ఫైనల్‌లో అడుగుపెట్టిన టీమిండియా

ఆసియా కప్‌ సూపర్-4లో భారత్ మరో విజయం సాధించింది. ఆతిథ్య శ్రీలంకతో జరిగిన మ్యాచులో 41 పరుగుల తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. చేసింది తక్కువ పరుగులే అయినా.. దాన్ని కాపాడడంలో భారత బౌలర్లు శభాష్ అనిపించారు. మొదట భారత జట్టు 213 పరుగులు చేయగా.. లక్ష్య చేధనలో లంకేయులు 171 పరుగులకే కుప్పకూలారు. ఈ గెలుపుతో టీమిండియా సగర్వంగా ఫైనల్‌లో అడుగుపెట్టింది. 

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు నిర్ణీత 49.1 ఓవర్లలో 213 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(53) టాప్ స్కోర‌ర్‌గా నిలవగా.. కేఎల్ రాహుల్(39), ఇషాన్ కిష‌న్(33) పర్వాలేదనిపించారు. ఒక‌ద‌శ‌లో స్కోర్ 200 దాటుతుందా? లేదా? అనిపించినా.. అక్షర్ పటేల్(26) మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్‌(5 నాటౌట్) జోడి చివ‌రి వికెట్‌కు విలువైన 26 పరుగులు జోడించారు. లంక బౌలర్లలో యువ స్పిన్న‌ర్ దునిత్ వెల్ల‌లాగే 5 వికెట్ల‌తో అద‌ర‌గొట్టగా.. చ‌రిత అస‌లంక కూడా 4 వికెట్ల‌తో చెలరేగాడు.

అనంతరం 214 పరుగుల లక్ష్య చేధనకు దిగిన శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగుల వద్ద ఆలౌటైంది. ధనంజయ డిసిల్వా (41), దునిల్ వెల్లలాగే (42) పరుగులు చేశారు. ఆరంభం నుంచి వరుస వికెట్లు తీస్తూ వచ్చిన భారత బౌలర్లు మ్యాచ్ పై పట్టు బిగించారు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసుకోగా.. బుమ్రా, రవీంద్ర జడేజా చెరో 2 వికెట్లు, సిరాజ్, హార్దిక్ పాండ్యా చెరో ఒక్క వికెట్ తీసుకున్నారు.