వెస్టిండీస్ రెండో టెస్టులో జైశ్వాల్ విజృంభణ..

వెస్టిండీస్ రెండో టెస్టులో  జైశ్వాల్ విజృంభణ..
  •     సత్తాచాటిన సుదర్శన్
  •     తొలి రోజే ఇండియా 318/2
  •     వెస్టిండీస్‌‌‌‌తో రెండో టెస్టు

న్యూఢిల్లీ:  అద్భుతమైన డిఫెన్స్, క్లాసిక్  డ్రైవ్‌‌‌‌లు, ఖతర్నాక్ కట్‌‌‌‌ షాట్లు.. ఇలా తన అమ్ములపొదిలోని అన్ని అస్త్రాలతో వెస్టిండీస్‌ బౌలింగ్‌‌‌‌ను చీల్చి చెండాడిన యంగ్‌‌‌‌ సెన్సేషన్‌‌‌‌ యశస్వి జైస్వాల్ (253 బాల్స్‌‌‌‌లో 22 ఫోర్లతో 173 బ్యాటింగ్‌‌‌‌) భారీ సెంచరీతో కదం తొక్కాడు. దాంతో వెస్టిండీస్‌‌‌‌తో రెండో టెస్టును టీమిండియా గొప్పగా ఆరంభించింది. ఫిరోజ్‌‌‌‌ షా కోట్లా స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ పోరులో జైస్వాల్‌‌‌‌కు తోడు మరో యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ (165 బాల్స్‌‌‌‌లో 12 ఫోర్లతో 87) సత్తా చాటడంతో తొలి రోజే ఇండియా 318/2 భారీ స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది.  జైస్వాల్‌‌‌‌తో పాటు కెప్టెన్ శుభ్‌‌‌‌మన్ గిల్ (20 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నాడు. విండీస్ బౌలర్లలో జోమెల్ వారికన్ (2/60) మాత్రమే రెండు వికెట్లు తీయగా.. మిగతా వాళ్లు చేతులెత్తేశారు. ఫస్ట్ డే ఇండియా బ్యాటర్లు 43 బౌండరీలు కొట్టారంటే విండీస్ బౌలింగ్ ఎంత చెత్తగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. రెండో రోజూ అదే ధాటిని కొనసాగించి  జైస్వాల్ డబుల్ సెంచరీ కొట్టి ఇండియా 400 ప్లస్ రన్స్ చేస్తే ఫస్ట్ టెస్టు మాదిరిగా ఇన్నింగ్స్‌‌‌‌ విక్టరీ అందుకునే అవకాశం ఉంది. 

జైస్వాల్ క్లాస్ ఇన్నింగ్స్

ఏడు ప్రయత్నాల తర్వాత తొలిసారి టాస్ గెలిచిన కెప్టెన్ శుభ్‌‌‌‌మన్ గిల్ బ్యాటింగ్ ఎంచుకోగా, జైస్వాల్ తన క్లాస్ బ్యాటింగ్‌‌‌‌తో ఆ నిర్ణయానికి పూర్తి న్యాయం చేశాడు. అతనికి సుదర్శన్ నుంచి అద్భుతమైన సహకారం లభించడంతో ఇండియా భారీ స్కోరుకు బాటలు వేసుకుంది. తొలి టెస్టులో ఫెయిలైనా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోని జైస్వాల్ ఈ ఇన్నింగ్స్‌‌‌‌లో పరిపూర్ణమైన టెస్టు బ్యాటర్‌‌‌‌గా కనిపించాడు. 

ఆరంభంలో ఓపికగా ఆడి పిచ్ స్వభావాన్ని అంచనా వేసి, ఆ తర్వాత విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అతని బ్యాటింగ్ మూడు దశల్లో సాగింది. తొలి ఫిఫ్టీ చేసేందుకు 82 బాల్స్‌‌‌‌ తీసుకున్న అతను ఆరంభంలో ఆచితూచి ఆడాడు. 50 నుంచి సెంచరీని 60 బాల్స్‌‌‌‌లో చేరుకున్న యశస్వి పూర్తి కంట్రోల్‌‌‌‌తో దూకుడు చూపెట్టాడు. సెంచరీ తర్వాత మరింత స్వేచ్ఛగా ఆడి పరుగుల మోత మోగించాడు. తొలుత మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌‌‌‌ (38)తో కలిసి జట్టుకు శుభారంభం ఇచ్చాడు. తొలి గంటలో విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేసినా, ఈ జోడీ వికెట్ పడకుండా జాగ్రత్త పడింది. ముఖ్యంగా రాహుల్ మంచి టచ్‌‌‌‌లో కనిపించాడు. అయితే, లంచ్‌‌‌‌కు ముందు స్పిన్నర్ జోమెల్ వారికన్ బౌలింగ్‌లో రాహుల్ స్టంపౌట్ అయ్యాడు. వారికన్ తెలివిగా బాల్‌‌‌‌వేగాన్ని, లెంగ్త్‌‌‌‌ను మార్చడంతో  రాహుల్ అంచనా వేయడంలో విఫలమయ్యాడు. దాంతో తొలి వికెట్‌‌‌‌కు 58 రన్స్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ ముగిసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్‌‌‌‌తో కలిసి జైస్వాల్ ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌ను అద్భుతంగా నిర్మించాడు. 94/1తో లంచ్‌‌‌‌ బ్రేక్‌‌‌‌కు వెళ్లొచ్చిన తర్వాత వీరిద్దరూ విండీస్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. 

సుదర్శన్ సూపర్‌‌‌‌‌‌‌‌.. బౌలర్లు ఫ్లాప్‌‌‌‌

తొలి సెషన్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న  జైస్వాల్  బ్రేక్ తర్వాత  తన ఇన్నింగ్స్‌‌‌‌ను అద్భుతంగా నడిపించాడు. అతని స్క్వేర్ కట్స్‌‌‌‌, కవర్ డ్రైవ్స్‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌ను ఎంతగానో అలరించాయి. మరోవైపు టెస్టు జట్టులో వన్‌‌‌‌డౌన్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌గా స్థానాన్ని పదిలం చేసుకునే క్రమంలో సాయి సుదర్శన్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌‌‌‌తో ఆకట్టుకున్నాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడిన అతను, తన క్లాస్ టచ్‌‌‌‌తో అలరించాడు. కవర్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్స్‌‌‌‌, ఆన్ డ్రైవ్స్‌‌‌‌తో బౌండ్రీలు కొట్టి పక్కా టెస్టు బ్యాటర్‌‌‌‌‌‌‌‌ను తలపించాడు. ఈ క్రమంలో 87 బాల్స్‌‌‌‌లో సుదర్శన్  ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. జైస్వాల్ వంద మార్కు చేరాడు. ఇక, 58 రన్స్ వద్ద ఇచ్చిన క్యాచ్‌‌‌‌ను విండీస్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన సుదర్శన్  తన తొలి టెస్టు సెంచరీ దిశగా సాగాడు.  220/1తో టీ బ్రేక్‌‌‌‌కు వెళ్లొచ్చిన తర్వాత కూడా ఇద్దరు బ్యాటర్లు కరీబియన్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు.  కానీ,  వారికన్ బౌలింగ్‌‌‌‌లో టర్న్‌‌‌‌ను అంచనా వేయలేక సుదర్శన్ ఎల్బీగా వెనుదిరిగాడు.  13 రన్స్ తేడాతో అతను సెంచరీ కోల్పోగా రెండో వికెట్‌‌‌‌కు 193 రన్స్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ ముగిసింది. ఆ తర్వాత కెప్టెన్ గిల్ తో కలిసి జైస్వాల్ తన దాడిని కొనసాగించాడు. ఈ క్రమంలో 150 మార్కు దాటడంతో పాటు స్కోరు 300 దాటించాడు. మరోవైపు తొలి గంట మినహా, మిగతా రోజంతా వెస్టిండీస్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. మెయిన్ పేసర్లు జేడెన్ సీల్స్‌‌‌‌, అండర్సన్ ఫిలిప్‌‌‌‌పదేపదే హాఫ్ వాలీలు, ఓవర్ పిచ్ బాల్స్‌‌‌‌ వేసి ఇండియా బ్యాటర్లకు ఈజీగా రన్స్ ఇచ్చుకున్నారు. వారికన్  మినహా స్పిన్నర్లు కూడా సరైన లెంగ్త్‌‌‌‌తో బౌలింగ్ చేయడంలో విఫలమయ్యారు. కొత్త బాల్‌‌‌‌తోనూ ప్రభావం చూపకపోవడంతో మరో వికెట్‌‌‌‌ పడకుండా జైస్వాల్, గిల్ రోజు ముగించారు. 

సంక్షిప్త స్కోర్లు:


ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌: 90 ఓవర్లలో 318/2 (జైస్వాల్ 173 బ్యాటింగ్‌‌‌‌, సుదర్శన్ 87, వారికన్ 2/60)

7  టెస్టుల్లో జైస్వాల్‌‌‌‌కు ఇది ఏడో సెంచరీ.  24 ఏండ్ల ఏజ్‌లోనే అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌‌‌‌‌‌‌‌గా అతను సౌతాఫ్రికా లెజెండ్  గ్రేమ్ స్మిత్ రికార్డును సమం చేశాడు.