
వెస్ట్ ఇండీస్ తో రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇవాళ ( అక్టోబర్ 10 ) రెండో మ్యాచ్ లో తలపడుతోంది ఇండియా. మొదటి మ్యాచ్ కైవసం చేసుకొని జోష్ మీదున్న ఇండియా రెండో మ్యాచ్ కూడా గెలిచి క్లీన్ స్వీప్ కోసం ట్రై చేస్తోంది. అయితే.. సెకండ్ టెస్ట్ తొలిరోజు ఆరంభంలోనే కాస్త తడబడింది గిల్ సేన. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా లంచ్ బ్రేక్ కి ముందే ఒక వికెట్ కోల్పోయింది. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ కి దిగగా.. 54 బంతుల్లో 38 రన్స్ చేసిన రాహుల్ వారికన్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
లంచ్ బ్రేక్ సమయానికి 28 ఓవర్లకు గాను ఒక వికెట్ కోల్పోయి 98 పరుగులు చేసింది టీం ఇండియా. యశస్వి జైస్వాల్ 82 బంతుల్లో 52 రన్స్ చేసి హాఫ్ సెంచరీ సాధించాడు. రెండో సెషన్ స్టార్ట్ అయ్యాక 30 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 117 రన్స్ దగ్గర ఉంది టీం ఇండియా. ఇదిలా ఉండగా.. టీమిండియాతో పోలిస్తే విండీస్ చాలా అంశాల్లో బలహీనంగా కనిపిస్తోంది. తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ తేడాతో ఓడటమే ఇందుకు నిదర్శనం. ప్లేయర్లు, టెక్నిక్ పరంగా చాలా బలహీనంగా ఉండటంతో ఈ మ్యాచ్‌పై కరీబియన్లలో పెద్దగా సందడి కనిపించడం లేదు.
కానీ తొలి టెస్ట్ ఓటమికి ఘనమైన ప్రతీకారం తీర్చుకోవాలని మాత్రం విండీస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో వివియన్ రిచర్డ్స్, రిచీ రిచర్డ్‌సన్, బ్రియాన్ లారాతో ఓ గోల్ఫ్ కోర్స్‌లో అనధికారికంగా సమావేశమయ్యారు. కనీసం ఈ లెజెండ్స్ మాటలతోనైనా విండీస్ పోటీ ఇస్తుందా? చూడాలి. బౌలింగ్ పదును పెంచడానికి తుది జట్టులో మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో జైడెన్ సీల్స్, వారికాన్ మరోసారి కీలకం కానున్నారు. వీళ్లకు తోడుగా జెడియా బ్లేడ్స్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని యోచిస్తున్నారు.
ఒకవేళ ఇండియా మొదట బ్యాటింగ్ చేస్తే తక్కువ స్కోరుకు కట్టడి చేయాలని బౌలింగ్ వ్యూహాలు రచిస్తున్నారు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 162 రన్స్‌కే కుప్పకూలిన బ్యాటింగ్ లైనప్‌పై కూడా దృష్టి సారించారు. టాప్ ఆర్డర్‌లో చందర్‌పాల్, క్యాంప్‌బెల్, అథనాజె గాడిలో పడితే స్కోరును ఆశించొచ్చు. మిడిలార్డర్‌లో బ్రెండన్ కింగ్, ఛేజ్, హోప్ భారీ స్కోర్లపై దృష్టి సారించాలి. ఓవరాల్‌గా ఇండియా బ్యాటింగ్, బౌలింగ్‌ను తట్టుకుని ఈ మ్యాచ్‌లో గెలవాలంటే విండీస్‌కు ఆటతో పాటు అదృష్టం కూడా తోడుగా నిలవాల్సిందే.
- 10 టెస్ట్‌ల్లో 4 వేల రన్స్‌కు జడేజా పది పరుగుల దూరంలో ఉన్నాడు. అతని కంటే ముందు ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, డేనియల్ వెటోరీ మాత్రమే 4 వేల రన్స్, 300 వికెట్లు సాధించారు.
- 12 1987 నవంబర్ తర్వాత ఢిల్లీలో టీమిండియా ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడలేదు. యాదృచ్ఛికంగా అప్పుడు విండీస్ చేతిలోనే ఓడటం గమనార్హం. ఆ తర్వాత ఇండియా 12 మ్యాచ్‌లు నెగ్గి 12 డ్రా చేసుకుంది.