
- ఎంసీహెచ్ఆర్డీలో ఫైనల్ రిపోర్టుపై చర్చించిన స్వతంత్ర నిపుణుల కమిటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చేపట్టిన కులగణనను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ (ఐఈడబ్ల్యూజీ) తన నివేదికను త్వరలోనే సర్కారుకు అందించనుంది. బుధవారం కమిటీ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన మర్రి చెన్నా రెడ్డి మానవ వనరుల సంస్థలో జరిగిన కమిటీ సమావేశంలో నివేదికకు తుది మెరుగులు దిద్దింది. కులగణనలో పేర్కొన్న 242 కులాల వెనుకబాటుతనానికి సంబంధించిన కాంపొజిట్ బ్యాక్‌వర్డ్ నెస్ ఇండెక్స్ (సీబీఐ) సూచీని నివేదికలో పొందుపరిచింది. 300 పేజీలకుపైగా రూపొందించిన నివేదికలో 242 కులాల వారీగా వెనుకబాటుపై సీబీఐ స్కోర్, ర్యాంకులకు ఇచ్చింది. మరో వారం రోజుల్లో నివేదిక సిద్ధమవుతుంది.
రిపోర్టును అందించడానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టిని కమిటీ సమయం కోరింది. ఈ కమిటీ సమావేశంలో వైస్ చైర్మన్ కంచ ఐలయ్య, కన్వీనర్ ప్రవీణ్ చక్రవర్తి, సభ్యులు ప్రొఫెసర్ శాంతా సిన్హా, డాక్టర్ సుఖ్‌దేవ్ థారోట్, డాక్టర్ హిమాన్షు, నిఖిల్ డే, ప్రొఫెసర్ భాంగ్య భుక్య, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిటీ కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. కాగా, గతేడాది నవంబర్, డిసెంబర్‌లలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల గణన సర్వే డేటాను పరిశీలించి, విశ్లేషించి, దానిపై ఒక రిపోర్ట్ ఇవ్వడం కోసమే ఐఈడబ్ల్యూజీ కమిటీని ప్రభుత్వం నియమించింది.