మోడీ బర్త్‌ డే రికార్డ్‌: సాయంత్రానికే 2 కోట్ల డోసులు దాటి..

మోడీ బర్త్‌ డే రికార్డ్‌: సాయంత్రానికే 2 కోట్ల డోసులు దాటి..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు (సెప్టెంబర్ 17)న కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకెళ్తోంది. శుక్రవారం సాయంత్రం 5.05 గంటల సమయానికే దేశవ్యాప్తంగా 2 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేశారు. రెండు కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు ఒకే రోజులో వేయడం ఇదే తొలిసారి. అయితే కోటి డోసులకు పైగా వ్యాక్సిన్‌ వేయడం మాత్రం ఇది నాలుగోసారి కావడం విశేషం. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికే కోటి డోసుల వ్యాక్సిన్‌ వేసేశారు. ఇంత వేగంగా కోటి వ్యాక్సిన్ డోసులు వేయడం ఇదే తొలిసారని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్వీట్‌ చేశారు. సాయంత్రం మళ్లీ రెండ కోట్లు దాటాక మరోసారి ఆయన ట్విట్టర్‌‌లో పోస్ట్ పెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీకి పుట్టిన రోజు సందర్భంగా హెల్త్ వర్కర్స్, ప్రజల తరఫున ఇదొక గిఫ్ట్ అని ఆయన పేర్కొన్నారు. ఒక్క రోజలోనే రెండు కోట్లపైగా వ్యాక్సిన్ డోసులు వేసి సరికొత్త రికార్డు సృష్టించామంటూ హిందీలో ఆయన ట్వీట్ చేశారు.

రెండు కోట్ల డోసులు దాటిన సమయంలో ఢిల్లీలోని సఫ్దర్‌‌జంగ్‌ హాస్పిటల్‌లో ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ హెల్త్ సిబ్బందితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. సిబ్బందికి ఆయన లడ్డూలు పంచి అభినందనలు తెలిపారు.

 

దేశంలో కోటి డోసుల వ్యాక్సినేషన్ ఒక్క రోజులో తొలిసారి వేసింది ఆగస్టు 27న, ఆ తర్వాత మరో రెండు సార్లు ఈ రికార్డును భారత్ క్రియేట్ చేసింది. అయితే ఇప్పటి వరకు హయ్యెస్ట్ సింగిల్‌ డే రికార్డు కోటి 30 లక్షల వ్యాక్సిన్ డోసులు.. ఈ రికార్డును సృష్టించింది ఆగస్టు 31న. శుక్రవారం ఉదయం వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలయ్యే సమయానికి దేశవ్యాప్తంగా సుమారు 77 కోట్ల డోసుల కరోనా వ్యాక్సినేషన్ పూర్తయింది. సాయంత్రానికి 79 కోట్లు దాటి పరుగులు తీస్తోంది. 

భారత్‌లో తొలి 10 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేయడానికి 85 రోజుల సమయం పట్టింది. అయితే ఆ తర్వాత 45 రోజుల్లోనే 20 కోట్ల మార్క్ దాటేశాం. మరో 29 రోజుల్లో 30 కోట్ల డోసులు వ్యాక్సినేషన్ పూర్తయింది. అక్కడి నుంచి 40 కోట్లకు చేరుకోవడానికి 24 రోజులు పడితే, మరో 20 రోజుల్లో ఆగస్టు 6 నాటికి 50 కోట్ల మార్కును మన దేశం చేరుకుంది. మరో 19 రోజుల్లో 60 కోట్ల మార్క్‌కు, ఆ తర్వాత కేవలం 13 రోజుల్లోనే సెప్టెంబర్‌‌ 7 నాటికి 70 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేయడం పూర్తయింది.