ఇండియా కూటమివి ఓటు బ్యాంకు రాజకీయాలు : నరేంద్ర మోదీ

ఇండియా కూటమివి ఓటు బ్యాంకు రాజకీయాలు : నరేంద్ర మోదీ
  • మాకు ఆల్రెడీ 400 సీట్లున్నయ్.. రాజ్యాంగాన్ని మారుస్తామన్నది దుష్ప్రచారమే: మోదీ
  • ఇండియా కూటమి నేతలకు దేశం కన్నా తమ పిల్లలే ముఖ్యం
  • పటేల్ ఇంకొంతకాలం ఉంటే.. బ్యూరోక్రసీ రూపురేఖలు మారేవి  
  • ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ప్రధాని 

న్యూఢిల్లీ : రాజ్యాంగాన్ని పదే పదే అవమానించిన వాళ్లే ఇప్పుడు దానిని తమ తలలపై పెట్టుకుని చిందులు వేస్తున్నారని ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలపై ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్ అయ్యారు. ఎన్డీఏ సర్కారు రాజ్యాంగాన్ని మారుస్తుందని, అందుకే 400 సీట్లు కావాలని అంటోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలనూ ఆయన ఖండించారు. తమకు ఆల్రెడీ పార్లమెంట్​లో 400 సీట్లు ఉన్నాయన్నారు. ఎన్డీఏకు 360 సీట్లు ఉండగా.. ఎన్డీఏ ప్లస్ పార్టీలను కలుపుకుంటే 400కుపైనే సీట్లు తమకు ఉన్నాయని చెప్పారు.

అసలు 400 సీట్లకు, రాజ్యాంగానికి ముడిపెట్టడమే మూర్ఖత్వమన్నారు. సభను నడవనివ్వకూడదని వాళ్లు అనుకుంటుండటమే అసలు సమస్యని స్పష్టం చేశారు. ఆదివారం ఎన్డీటీవీ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ రాజ్యాంగం పట్ల గాంధీ ఫ్యామిలీ ఎలా వ్యవహరించింది? 1950లో పురుషోత్తమ్ దాస్ టాండన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. కానీ నెహ్రూజీ ఒప్పుకోలేదు. వర్కింగ్ కమిటీ నుంచి తప్పుకుంటానని డ్రామా ఆడారు.

దీంతో పార్టీ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న నేతను ఒక కుటుంబం సంతోషం కోసం తొలగించారు. 1998లో సీతారాం కేసరి కాంగ్రెస్ ప్రెసిడెంట్​గా ఉన్నారు. ఆయనను బాత్రూంలో లాక్ చేసి మరీ సోనియా గాంధీని పార్టీ ప్రెసిడెంట్​గా చేశారు. వీళ్లకు రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు ఉందా?” అని ప్రధాని ప్రశ్నించారు. 

రాజ్యాంగం ఆత్మను దెబ్బతీశారు.. 

భారత రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు అందులో దేశ వర్తమానం, భవిష్యత్తు గురించి కూడా రాశారని, దేశ వారసత్వాన్ని కూడా ప్రస్తావించారని మోదీ చెప్పారు. ‘‘రామాయణం నుంచి మహాభారతం, ఛత్రపతి శివాజీ వరకు దేశ వారసత్వానికి సంబంధించిన ఎన్నో చిత్రాలను రాజ్యాంగంలో పొందుపర్చారు. కానీ నెహ్రూ ఆ వారసత్వ చిత్రాలను తీసివేయించి రాజ్యాంగాన్ని పబ్లిష్ చేయించారు. రాజ్యాంగానికి నెహ్రూ మొదటి సవరణ చేసి భావ ప్రకటన స్వేచ్ఛను తొలగించారు. ఇది రాజ్యాంగం ఆత్మపై కొట్టిన తొలిదెబ్బ.

ఆర్టికల్ 356ని దుర్వినియోగం చేస్తూ వందల సార్లు ప్రభుత్వాలను పడగొట్టారు. ఎమర్జెన్సీ పెట్టి రాజ్యాంగాన్ని డస్ట్ బిన్ లో వేశారు. ఫస్ట్ నెహ్రూ, తర్వాత ఇందిరా గాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఇలాగే చేశారు. మీడియాను కంట్రోల్ చేయడం కోసమని షా బానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే తోసిపుచ్చేందుకు రాజీవ్ ప్రయత్నించారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసమే రాజ్యాంగాన్ని సవరించారు.

రాహుల్ సైతం మహిళా రిజర్వేషన్ బిల్లు కాగితాలను చింపిపారేశారు. ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు” అని ప్రధాని విమర్శించారు. 

సెక్యులరిజం ముసుగులో కుల, మత రాజకీయాలు  

ప్రతిపక్ష ఇండియా కూటమి సెక్యులరిజం ముసుగులో కుల, మత, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మోదీ మండిపడ్డారు. సామాజిక సంక్షేమం అన్న అంశం వస్తే.. 100 శాతం మందికి ప్రయోజనం చేకూర్చాలన్నదే తన లక్ష్యమన్నారు. తాను వంద శాతం మందికి అంటున్నానని.. అదే నిజమైన సామాజిక న్యాయం, సెక్యులరిజం అని అన్నారు. అందుకే ప్రజలు తన ప్రభుత్వాన్ని నమ్ముతున్నారని చెప్పారు. ఏదైనా ఒక స్కీంను మొదలుపెడితే..

దానిని వాళ్లకే ఇవ్వండి. వీళ్లకు ఇవ్వొద్దని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ‘‘ప్రతిపక్షాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని కూడా ఓట్ల కోసం వాడుకుంటున్నారు. వాళ్లు ఓట్ జిహాద్ కు మద్దతిస్తున్నారు. ఇవన్నీ సెక్యులరిజం ముసుగులోనే చేస్తున్నారు. అందుకే వాళ్లు ఎంత తీవ్రమైన మతతత్వవాదులో అన్నది ఇప్పుడు ముసుగు విప్పి నేను చూపిస్తున్నా” అని మోదీ అన్నారు.

‘‘చివరకు కాంట్రాక్టులు కూడా మతం ఆధారంగా కట్టబెడతామని ఒక ప్రతిపక్ష పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. ఓ బ్రిడ్జి బ్రిడ్జి కట్టే నైపుణ్యం, అనుభవం, వనరులు ఎవరికి ఉన్నాయో చూడాలి.. కానీ మతం ఆధారంగా ఆ బ్రిడ్జి కట్టేందుకు కాంట్రాక్టు ఇస్తామంటే దేశం ఏమైపోతుంది?’’ అని ప్రశ్నించారు. ఇండియా కూటమిలోని నేతలకు తమ పిల్లల సంక్షేమం మీద తప్ప.. ఈ దేశం పిల్లల గురించి ఎలాంటి బాధా లేదన్నారు. 

సర్దార్ పటేల్ ఇంకొంత కాలం బతికుంటే.. 

భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఇంకొంత కాలం బతికి ఉంటే.. దేశ బ్యూరోక్రసీ వ్యవస్థను సమూలంగా మార్చేసేవారని, మన ప్రభుత్వ యంత్రాంగం ఇంతకన్నా మెరుగ్గా ఉండేదని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ అధికారుల రిక్రూట్​మెంట్, ట్రైనింగ్​ అనేవి ప్రజలకు మేలు చేసేలా పాలనను కొనసాగించేలా ఉండాలని, తన ప్రభుత్వం ఇదే పనిని చేసిందని మోదీ పేర్కొన్నారు. ఉద్యోగులకు తమ ఉద్యోగానికి ఉన్న లక్ష్యం ఏమిటో తెలిస్తేనే మెరుగైన సేవలు అందిస్తారన్నారు.

అందుకే తాను రిక్రూట్ మెంట్, ట్రెయినింగ్ లకు అధిక ప్రాధాన్యం ఇచ్చానన్నారు. దీనికితోడు ప్రభుత్వ సంస్థల్లో టెక్నాలజీపై కూడా ఫోకస్ పెట్టామన్నారు. గతంలో నియమాకాల్లో పేదలను దోచుకునేవారని, ఎన్నో అక్రమాలు జరిగేవన్నారు. ఇప్పుడు రిక్రూట్​మెంట్​లో మెరిట్ ప్రాతిపదికన నియామకాలు జరిగేలా కంప్యూటర్ డిసైడ్ చేస్తోందన్నారు. ప్రో పీపుల్ గుడ్ గవర్నెన్స్ (పీ2జీ2) అన్నదే తన ఫిలాసఫీ అని ఆయన చెప్పారు.

జూన్ 4 తర్వాత మార్కెట్లకు జోష్

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4 తర్వాత ఫైనాన్షియల్ మార్కెట్లు కొత్త రికార్డులు నెలకొల్పుతాయని మోదీ అన్నారు. గత పదేండ్లలో తన ప్రభుత్వం సుస్థిర వృద్ధి రేటు సాధించేలా ఆర్థిక సంస్కరణలను తెచ్చిందన్నారు. తన ప్రభుత్వం ఎంట్రప్రెన్యూర్ షిప్ అనుకూల విధానాలనే అనుసరించిందన్నారు. ఇప్పుడు ఇన్వెస్టర్లలో ఎంతో మంది యువత ఉంటున్నారని, ఇది మార్కెట్లకు ప్రయోజనకరమన్నారు. ప్రతిపక్షాలు హెచ్ఏఎల్ వంటి సంస్థ పట్ల కూడా భయాందోళ నలను వ్యాప్తి చేశాయని, ఇప్పుడు ఆ సంస్థ షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయన్నారు.

దేశం కోసం వెయ్యేండ్ల విజన్ 

దేశం కోసం తాను వెయ్యేండ్ల విజన్​ను ఆవిష్కరించానని మోదీ చెప్పారు. విరాసత్ (హెరిటేజ్), వికాస్ (డెవలప్ మెంట్)ను రెండింటినీ కలిపి దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఈ విజన్​లో ముఖ్యమైన అంశమన్నారు. ‘‘పెద్ద విజయం సాధించాలంటే పెద్దగా ఆలోచించాలి. నేటి నుంచి వెయ్యేండ్ల పాటు భారత్ కీర్తి వెలిగిపోయేలా చర్యలకు శ్రీకారం చుట్టాలి. ఇందులో భాగంగా ముందుగా స్వాతంత్ర్యం తర్వాత తొలి 100 ఏండ్లకు భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చుకోవాలి” అని చెప్పారు. దేశం ఇప్పుడు కీలకమైన సమయంలో ఉందని, ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని అన్నారు.