ఐపీఎల్​ క్యాంప్​ల్లోకి ఇండియా, ఇంగ్లండ్​ క్రికెటర్లు

ఐపీఎల్​ క్యాంప్​ల్లోకి ఇండియా, ఇంగ్లండ్​ క్రికెటర్లు
  • బబుల్​ బ్రేక్​ చేసి ఇంటికి వెళ్లిన కోహ్లీ
  • 1న ఆర్​సీబీ  టీమ్​లోకి

న్యూఢిల్లీ: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌‌–14కు టైమ్‌‌ దగ్గరపడుతున్న వేళ.. ఇండియా, ఇంగ్లిష్‌‌ క్రికెటర్లు ఫ్రాంచైజీ క్యాంప్‌‌ల్లో చేరిపోతున్నారు. నేషనల్‌‌ డ్యూటీని ముగించుకున్న టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ.. ఏప్రిల్‌‌ 1న రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు (ఆర్‌‌సీబీ) క్యాంప్‌‌లో జాయిన్‌‌ కానుండగా, వైస్‌‌ కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ ముంబై శిబిరంలో చేరిపోయాడు. ఈ సీజన్‌‌కు సంబంధించిన ప్రాక్టీస్‌‌ను ఆర్‌‌సీబీ మంగళవారం నుంచి మొదలుపెట్టనుంది. దీంతో విరాట్‌‌ రెండు రోజులు లేట్‌‌గా టీమ్‌‌తో కలవనున్నాడు. ఆదివారం పుణెలో థర్డ్‌‌ వన్డే ముగిసిన తర్వాత బయో బబుల్‌‌ నుంచి బయటకు వచ్చిన కోహ్లీ డైరెక్ట్‌‌గా ఇంటికి (ముంబై) వెళ్లిపోయాడు. దీంతో ఆర్‌‌సీబీ క్యాంప్‌‌తో కలవాలంటే కెప్టెన్‌‌ వారం రోజుల మాండేటరి క్వారంటైన్‌‌లో ఉండాలి. దీనికి విరాట్‌‌ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంట్లోనే ఫిట్‌‌గా ఉండేందుకు అవసరమైన వర్కౌట్స్‌‌ చేస్తున్నాడు. ‘నో రెస్ట్‌‌ డే. ఇక్కడి నుంచి అంతా స్పీడే’ అంటూ ట్రెడ్‌‌మిల్‌‌ మీద రన్నింగ్స్‌‌ చేస్తున్న ఫొటోను విరాట్‌‌ ట్వీటర్‌‌లో ఉంచాడు. హైదరాబాద్‌‌ పేసర్‌‌ మహ్మద్‌‌ సిరాజ్‌‌, స్పిన్నర్‌‌ చహల్‌‌.. సోమవారం మధ్యాహ్నం ముంబైలో ఆర్‌‌సీబీ టీమ్‌‌తో కలిశారు. 
రోహిత్‌‌, పాండ్యా బ్రదర్స్‌‌ కూడా..
రోహిత్‌‌ శర్మతో పాటు ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌, క్రునాల్‌‌ పాండ్యా, సూర్యకుమార్‌‌ యాదవ్‌‌.. ముంబై ఇండియన్స్‌‌ క్యాంప్‌‌లో  జాయిన్‌‌ అయ్యారు. ఇంగ్లండ్‌‌తో జరిగిన లాస్ట్‌‌ వన్డే తర్వాత వీళ్లు.. నేరుగా ఫ్రాంచైజీ బబుల్‌‌లోకి వెళ్లిపోయారు. ముందుగా పాండ్యా బ్రదర్స్‌‌, సూర్యకుమార్‌‌ టీమ్‌‌తో కలవగా, కెప్టెన్‌‌ రోహిత్‌‌ కాస్త ఆలస్యంగా జాయిన్‌‌ అయ్యాడు. ‘ఇండియాకు రిప్రజెంట్‌‌ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. కంట్రీకి ఆడాలన్నది నా డ్రీమ్‌‌. అది నెరవేరినందుకు చాలా గర్వంగా ఉంది. టీమిండియాలో భాగం కావడం గొప్ప ఫీలింగ్‌‌. ఇక ఇప్పుడు నా రోల్‌‌ మారింది. ముంబై ఇండియన్స్‌‌ ఫ్యామిలీతో జాయిన్‌‌ అయ్యా. నమ్మశక్యంగాని ఇన్నింగ్స్‌‌ ఎన్నో ఇక్కడ ఆడాలి. వాటి కోసం ఎదురుచూస్తున్నా’ అని సూర్య పేర్కొన్నాడు. వచ్చే నెల 9న జరిగే ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లో ముంబై.. బెంగళూరుతో తలపడుతుంది. 

డీసీ ప్లేయర్ల మీటింగ్‌‌‌‌
ఇంగ్లండ్‌‌ సిరీస్‌‌లో మెరుపులు మెరిపించిన యంగ్‌‌ వికెట్‌‌ కీపర్‌‌ రిషబ్‌‌ పంత్‌‌, సామ్‌‌ బిల్లింగ్స్‌‌, టామ్‌‌ కరన్‌‌ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌‌ టీమ్‌‌తో చేరిపోయారు. మాండేటరి క్వారంటైన్‌‌ లేకపోవడంతో నేరుగా టీమ్‌‌ బస చేసిన హోటల్‌‌కు వెళ్లిపోయారు. ఇప్పటికే లీగ్‌‌కు సంబంధించిన ప్రిపరేషన్స్‌‌లో ఉన్న డీసీ బృందం సోమవారం హోటల్‌‌ రూమ్‌‌లో సమావేశం అయ్యింది. చీఫ్‌‌ కోచ్‌‌ రికీ పాంటింగ్‌‌, అశ్విన్‌‌, అక్షర్‌‌ పటేల్‌‌, క్రిస్‌‌ వోక్స్‌‌, హెట్‌‌మయర్‌‌ ఈ  మీటింగ్​లో పాల్గొన్నారు. గాయం కారణంగా కెప్టెన్‌‌ శ్రేయస్‌‌ అయ్యర్‌‌.. లీగ్‌‌కు దూరం కావడంతో టోర్నీలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై సమాలోచనలు చేశారు. గతవారం నుంచి క్వారంటైన్‌‌లో ఉన్న ఢిల్లీ.. తమ ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లో చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌తో ఆడనుంది.