
థింఫు: సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (శాఫ్) అండర్-17 విమెన్స్ చాంపియన్‌షిప్‌లో ఇండియా అమ్మాయిల జట్టు జోరు కొనసాగుతోంది. టోర్నీలో వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా 2-–0తో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. దాంతో ఆరు పాయింట్లతో తమ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ పోరులో ఇండియా అమ్మాయిలు ఆట ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యాన్ని చూపెట్టారు. డిఫెన్స్ బలంగా ఉండటంతో బంగ్లాకు కనీసం ఒక గోల్ చేయడానికి కూడా అవకాశాలు లభించలేదు.
మ్యాచ్ 14వ నిమిషంలో పెర్ల్ ఫెర్నాండెజ్ అద్భుతమైన గోల్ చేసి ఇండియాకు 1-–-0 ఆధిక్యాన్ని ఇచ్చింది. మధ్యలో బంగ్లా గోల్ కోసం ప్రయత్నించినా ఇండియా గోల్ కీపర్ మున్నీ చాకచక్యంగా అడ్డుకుంది. సెకండాఫ్‌లో కూడా ఇండియా ఆధిక్యంలోనే కొనసాగింది. 76వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ బోనిఫిలియా షుల్లై కార్నర్ నుంచి వచ్చిన బాల్‌ను అద్భుత హెడర్‌గా మల్చడంతో ఇండియా లీడ్ డబులైంది. బంగ్లా ఎంత ప్రయత్నించినా ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది.