ఇండియా జైత్రయాత్ర.. 302 రన్స్‌‌ భారీ తేడాతో శ్రీలంకపై ఇండియా విక్టరీ

ఇండియా జైత్రయాత్ర.. 302 రన్స్‌‌ భారీ తేడాతో శ్రీలంకపై ఇండియా విక్టరీ
  • షమీ సూపర్​..
  • సెమీస్​లో రోహిత్​ సేన
  • చెలరేగిన సిరాజ్‌‌, గిల్‌‌, కోహ్లీ, శ్రేయస్‌‌

వరల్డ్‌‌ కప్‌‌లో ఇండియా జైత్రయాత్ర కొనసాగిస్తున్నది. వరుసగా ఏడో విజయంతో సెమీస్‌‌ బెర్త్‌‌ను ఖాయం చేసుకుంది. బ్యాటింగ్‌‌లో శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (92), విరాట్‌‌ కోహ్లీ (88), శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (82) దంచికొడితే.. బౌలింగ్‌‌లో మహ్మద్‌‌ షమీ (5/18), మహ్మద్‌‌ సిరాజ్‌‌ (3/16) సూపర్‌‌ షో చూపెట్టడంతో.. గురువారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో టీమిండియా 302 రన్స్‌‌ భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. లంక పేసర్‌‌ మధుశంక 5 వికెట్లు తీసినా.. చేజింగ్‌‌లో బ్యాటర్లు పెవిలియన్‌‌కు క్యూ కట్టారు.

ముంబై: ఓవైపు మహ్మద్‌‌ షమీ (5/18).. మరోవైపు మహ్మద్‌‌ సిరాజ్‌‌ (3/16), స్వింగ్‌‌, బౌన్స్‌‌, ఇన్‌‌ కట్టర్స్‌‌తో చేసిన ముప్పేట దాడిలో శ్రీలంక బెంబేలెత్తింది. బాల్‌‌ ముట్టుకోవడానికి కూడా భయపడ్డ టాప్‌‌ స్టార్లందరూ పెవిలియన్‌‌కు క్యూ కట్టారు. దీంతో వరల్డ్‌‌ కప్‌‌లో తన జైత్రయాత్రను కొనసాగించిన ఇండియా.. గురువారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 302 రన్స్‌‌ భారీ తేడాతో లంకేయులను చిత్తు చేసింది. తద్వారా వరుసగా ఏడో విజయంతో సెమీస్‌‌ బెర్త్‌‌ను ఖాయం చేసుకుంది. బ్యాటింగ్‌‌లో శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (92 బాల్స్‌‌లో 11 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 92), విరాట్‌‌ కోహ్లీ (94 బాల్స్‌‌లో 11 ఫోర్లతో 88), శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (56 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 6 సిక్స్‌‌లతో 82) దంచికొట్టిన వేళ.. టాస్‌‌ ఓడిన ఇండియా 50 ఓవర్లలో 357/8 స్కోరు చేసింది. దిల్షాన్‌‌ మధుశంక (5/80) ఐదు వికెట్లు తీశాడు. తర్వాత లంక 19.4 ఓవర్లలో 55 రన్స్‌‌కే కుప్పకూలింది. కాసున్‌‌ రజిత (14) టాప్‌‌ స్కోరర్‌‌. షమీకి ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.

ఒకర్ని మించి మరొకరు..

ఛేజింగ్‌‌కు దిగిన లంకను ఇండియా బౌలర్లు భయపెట్టారు. ముగ్గురు పేసర్లు ఒకర్ని మించి మరొకరు భయంకరమైన బాల్స్‌‌తో వణికించారు. ఇన్నింగ్స్‌‌ తొలి బాల్‌‌కే నిశాంక (0)ను ఔట్‌‌ చేసి బుమ్రా (1/8) ఇచ్చిన ఆరంభాన్ని షమీ, సిరాజ్‌‌ మరో స్థాయికి తీసుకెళ్లారు. అద్భుతమైన ఇన్‌‌ కట్టర్లతో బాల్‌‌ను స్వింగ్‌‌ చేసిన సిరాజ్‌‌.. రెండో ఓవర్‌‌లో కరుణరత్నె (0), సమరవిక్రమ (0)ను, తన తర్వాతి ఓవర్‌‌ తొలి బాల్‌‌కు కుశాల్‌‌ మెండిస్‌‌ (1)ను పెవిలియన్‌‌కు పంపాడు. దీంతో లంక ఇన్నింగ్స్‌‌ 3/4 స్కోరుతో కుప్పకూలింది. ఈ దశలో అసలంక (1), మాథ్యూస్‌‌ (12) దాదాపు ఐదు ఓవర్ల పాటు డిఫెన్స్‌‌ ఆడారు.  కానీ 10వ ఓవర్‌‌లో వచ్చిన షమీ లంక ఇన్నింగ్స్‌‌ను పేకమేడలా కూల్చాడు. 13 బాల్స్‌‌ తేడాలో అసలంక, దుషాన్‌‌ హేమంత (0), చమీరా (0), మాథ్యూస్‌‌ను ఔట్‌‌ చేశాడు. ఫలితంగా లంక 36/8తో పీకల్లోతు కష్టాల్లో పడింది. తీక్షణ (12 నాటౌట్‌‌), కాసున్‌‌ రజిత  సింగిల్స్‌‌తో ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేసినా షమీ దెబ్బకు నిలవలేకపోయారు. 18వ ఓవర్‌‌లో రజిత ఔట్‌‌కాగా, తర్వాతి ఓవర్‌‌లో జడేజా (1/4) మధుశంక (5) వికెట్‌‌ తీసి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 50 ఓవర్లలో 357/8 (గిల్‌‌ 92, కోహ్లీ 88, శ్రేయస్‌‌ 82, మధుశంక 5/80). శ్రీలంక: 19.4 ఓవర్లలో 55 ఆలౌట్‌‌ (కాసున్‌‌ రజిత 14, తీక్షణ 14*, షమీ 5/18, సిరాజ్‌‌ 3/16).

1 క్యాలెండర్‌‌ ఇయర్‌‌లో అత్యధికసార్లు వెయ్యి రన్స్‌‌ చేసిన తొలి ప్లేయర్ విరాట్‌‌ (8). సచిన్‌‌ (7) రికార్డును బ్రేక్‌‌ చేశాడు.
3 వరల్డ్‌‌ కప్‌‌లో ఐదు వికెట్లు తీయడం షమీకి ఇది మూడోసారి. స్టార్క్‌‌తో సమంగా నిలిచాడు.
4ఇండియా తరఫున వన్డేల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల హాల్‌‌ సాధించిన షమీ. శ్రీనాథ్‌‌ రికార్డును అధిగమించాడు.
45ఇండియా తరఫున వరల్డ్‌‌ కప్‌‌లో అత్యధిక వికెట్లు తీసిన షమీ. జహీర్‌‌ ఖాన్‌‌, శ్రీనాథ్‌‌ (44) రికార్డును బ్రేక్‌‌ చేశాడు.

కోహ్లీ మళ్లీ మిస్‌‌

సచిన్‌‌ వన్డే సెంచరీల రికార్డు (49)ను సమం చేయాలన్న కింగ్‌‌ కోహ్లీ కల ఈ మ్యాచ్‌‌లోనూ నెరవేరలేదు. ఇన్నింగ్స్‌‌ రెండో బాల్‌‌కే రోహిత్‌‌ (4)ను మధుశంక క్లీన్‌‌ బౌల్డ్‌‌ చేయడంతో ఫ్యాన్స్​ షాక్‌‌కు గురయ్యారు. కానీ ఆ షాక్‌‌ ఎంతో సేపు ఉండలేదు. తర్వాత కోహ్లీ, గిల్‌‌, శ్రేయస్‌‌ సూపర్‌‌ ఇన్నింగ్స్‌‌ ఆడారు. అయితే మధుశంక ఈ ముగ్గుర్ని సెంచరీ చేయకుండా అడ్డుకున్నాడు. తొలి ఓవర్‌‌లోనే ఫోర్‌‌తో ఖాతా తెరిచిన కోహ్లీ.. ఆరో ఓవర్‌‌లో ఇచ్చిన రిటర్న్‌‌ క్యాచ్‌‌ను చమీరా (1/71) డ్రాప్‌‌ చేశాడు. ఐదో ఓవర్‌‌లో బ్యాక్‌‌ టు బ్యాక్‌‌ ఫోర్లు కొట్టిన గిల్‌‌ క్యాచ్‌‌ను పాయింట్‌‌లో అసలంక వదిలేశాడు. ఈ రెండు మినహా మిగతా ఇన్నింగ్స్‌‌లో ఎలాంటి ఝలక్‌‌ల్లేవు. పవర్‌‌ప్లేలో 60/1 స్కోరు చేసిన కోహ్లీ 50 బాల్స్‌‌లో, గిల్‌‌ 55 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీలు పూర్తి చేశారు. ఆ తర్వాత లాంగాన్‌‌, లాంగాఫ్‌‌, మిడాన్‌‌లో గిల్‌‌ చూడముచ్చటైన సిక్స్‌‌లు బాదాడు. 80లకు చేరిన తర్వాత కోహ్లీ కాస్త నెమ్మదిస్తే.. గిల్‌‌ జోరందుకున్నాడు. మధుశంక వేసిన స్లో కట్టర్స్‌‌, బౌన్సర్లను ఫోర్లుగా మలిచి 90ల్లోకి వచ్చాడు. కానీ ఇక్కడే మధుశంక డబుల్‌‌ స్ట్రోక్‌‌ ఇచ్చాడు. 30వ ఓవర్‌‌లో అతను వేసిన స్లో ఆఫ్‌‌ కట్టర్‌‌ను కీపర్‌‌ మీదుగా కొట్టే ప్రయత్నంలో గిల్‌‌ ఔటయ్యాడు. దీంతో రెండో వికెట్‌‌కు 189 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. 32వ ఓవర్‌‌లో మరో కట్టర్‌‌కు కోహ్లీ షార్ట్‌‌ కవర్స్‌‌లో క్యాచ్‌‌ ఇచ్చాడు. దీంతో ఇండియా 196/3తో నిలిచింది. ఈ దశలో వచ్చిన శ్రేయస్‌‌ టీ20 ఇన్నింగ్స్‌‌ ఆడాడు. షార్ట్‌‌ పిచ్‌‌, ఫుల్‌‌ లెంగ్త్‌‌, ఎక్స్‌‌ట్రా బౌన్స్‌‌, స్వింగ్‌‌ బాల్స్‌‌ను భారీ సిక్సర్లుగా మలిచాడు. కేవలం 36 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ కొట్టాడు. రాహుల్‌‌ (21), సూర్య (12) ఫెయిలైనా, జడేజా (35)తో ఆరో వికెట్‌‌కు57 రన్స్‌‌ జత చేయడంతో ఇండియా భారీ టార్గెట్‌‌ నిర్దేశించింది.