దేశంలో తొలిసారి లక్ష దాటిన కరోనా కేసులు

దేశంలో తొలిసారి లక్ష దాటిన కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ వ్యాప్తితో ఇండియాలో తొలిసారిగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 1, 03, 558 మంది కరోనా బారిన పడ్డారు. దేశంలోకి కరోనా ఎంటరయిన తర్వాత మొదటిసారిగా ఇండియాలో కరోనా కేసులు లక్ష మార్క్‌ను దాటాయి. గతేడాది సెప్టెంబర్‌లో 97,894 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మెల్లగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కాగా.. కరోనా సెకండ్ వేవ్‌లో మాత్రం కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో దేశంలో కరోనా బారినపడిన మొత్తం బాధితుల సంఖ్య 1,25,89,067 కు పెరిగింది. ఆదివారం 52,847 మంది డిశ్చార్జ్ కాగా... కోటి పదహారు లక్షల ఎనభై రెండు వేల మంది కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 478 మంది ప్రాణాలు కోల్పోగా...మొత్తం మరణాలు లక్షా 65 వేలు దాటాయి. ప్రస్తుతం దేశంలో 7 లక్షల 41 వేల యాక్టివ్ కేసులున్నాయి. 

దేశంలోని 8 రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఒక్క మహరాష్ట్రలోనే ఆదివారం 57,074 కొత్త కేసులు నమోదయ్యాయి. అక్కడ మొత్తం  బాధితుల సంఖ్య 30 లక్షలు దాటింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 4 లక్షల 30 వేల యాక్టివ్ కేసులున్నాయి. ఒక్క ముంబైలోనే ఆదివారం 11,163 మంది కరోనా బారిన పడ్డారు. ముంబైలో మొత్తం బాధితుల సంఖ్య 4 లక్షల 52 వేలు దాటింది.