న్యూఢిల్లీ: ఒమన్ సమీపంలో అంతర్జాతీయ జలాల్లో ఒక నౌకపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో ముగ్గురు భారతీయులు మరణించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అమాయక పౌరుల ప్రాణాలను పణంగా పెట్టే ఇలాంటి ఉద్రిక్త చర్యలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.
నౌకలపై దాడులను వెంటనే ఆపాలని కోరింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటనను విడుదల చేసింది.‘‘ఒమన్ సమీపంలో జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం.
ఈ ఘోరాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకల రక్షణ, పౌరుల భద్రత అత్యంత కీలకం. దీనిపై అమెరికా ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి పూర్తి వివరాలను వెల్లడించాలి” అని తెలిపింది.
భారత ప్రభుత్వం ఈ అంశాన్ని అమెరికా ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మృతుల కుటుంబాలకు భారత ప్రభుత్వం సంతాపం ప్రకటించింది.
వారి మృతదేహాలను వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేందుకు ఒమన్, అమెరికా అధికారులతో ఇండియన్ ఎంబసీ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొంది.
