అమెరికా, యూరోపియన్‌‌‌‌‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌ సంక్షోభం భారత ఆర్థిక రంగంపై ప్రభావం లేదు

అమెరికా, యూరోపియన్‌‌‌‌‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌ సంక్షోభం భారత ఆర్థిక రంగంపై  ప్రభావం లేదు

న్యూఢిల్లీ: అధిక చమురు ధరలు, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు 6.5 శాతం పెరుగుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ వీర్మాణీ అన్నారు. అమెరికా, యూరోపియన్‌‌‌‌‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌ సంక్షోభం భారత ఆర్థిక రంగంపై  ప్రభావం చూపడం లేదని పేర్కొన్నారు.  కిందటి ఆర్థిక సంవత్సరంలో జరిగిన మార్పుల  కారణంగా, తన వృద్ధి అంచనాను 0.5 శాతం తగ్గించుకున్నానని, కాబట్టి ఇది 6.5 శాతం ఉండవచ్చని ఆయన చెప్పారు. తాజాగా  ప్రపంచ బ్యాంక్ , ఆసియా డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ భారత ఆర్థిక వృద్ధి 6.3 శాతం– 6.4 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేశాయి.

అంతర్జాతీయ ద్రవ్య నిధి  కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను అంతకుముందు ఉన్న 6.1 శాతం నుంచి 5.9 శాతానికి తగ్గించింది. అయినప్పటికీ, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్  కూడా ఫెడరల్ రిజర్వ్ లాగా ఉండాలని, జీడీపీని లెక్కలోకి తీసుకొని ఇన్​ఫ్లేషన్​ టార్గెట్​ను నిర్ణయించుకోవాలని వీర్మాణీ సూచించారు. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా రిటైల్ ఇన్​ఫ్లేషన్​ ఇరువైపులా 2 శాతం మార్జిన్‌‌‌‌‌‌‌‌తో 4 శాతం వద్ద ఉండేలా చూడాలని ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ను ఆదేశించింది.

అధిక ధరలను అడ్డుకోవడానికి 2022 మే నుంచి ఆర్​బీఐ రెపో రేట్లను ఆరుసార్లు పెంచింది. ఈ నెల ప్రారంభంలో మాత్రం యథావిధిగా ఉంచింది. 2022 మే నుంచి వడ్డీరేట్లు 250 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చైనా కీలకంగా మారడంపై మాట్లాడుతూ ఆ దేశం అనుసరించిన అన్యాయమైన వాణిజ్య విధానాలను మరే ఇతర దేశమూ అనుసరించలేదని కామెంట్​ చేశారు. ఈ అన్యాయమైన వాణిజ్య విధానాలు లేకుంటే చైనా వృద్ధి ఇంతలా ఉండేది కాదన్నారు. భారతదేశం అక్రమ వాణిజ్య విధానాలను అనుసరించకుండానే 6.5-7 శాతం వృద్ధిని సాధించగలదని విర్మాణీ స్పష్టం చేశారు.