
సలాలా (ఒమన్): డిఫెండింగ్ చాంపియన్ ఇండియా.. నాలుగోసారి ఆసియా కప్ జూనియర్ హాకీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో ఇండియా 2–1 తేడాతో పాకిస్తాన్‌కు చెక్ పెట్టింది. ఇండియా తరఫున సింగ్ అంగద్ బిర్ (12వ ని.), హుందాల్ అరైజిత్ సింగ్ (19వ ని.) గోల్స్ చేయగా, అలీ బషారత్ (37వ ని.) పాక్‌కు ఏకైక గోల్ అందించాడు. 2004, 2008, 2015లో ఇండియా విన్నర్‌గా నిలిచింది.
స్టార్టింగ్ నుంచే అటాకింగ్ గేమ్ ఆడిన ఇండియన్ ప్లేయర్లు ఏడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టారు. తర్వాత స్కోరును సమం చేసేందుకు పాక్ చేసిన ఎదురుదాడులను సమర్థంగా తిప్పికొట్టారు. దీంతో 2–0తో హాఫ్ టైమ్‌ను ముగించిన ఇండియా రెండో హాఫ్‌లోనూ మెరుపు దాడులకు దిగింది. కానీ పాక్ రక్షణశ్రేణి అప్రమత్తంగా వ్యవహరించడంతో మరో గోల్ చేసే చాన్స్ లభించలేదు. థర్డ్ క్వార్టర్‌లో పాక్ గోల్‌తో అంతరాన్ని మాత్రమే తగ్గించింది.