
జెనీవా: పాకిస్తాన్లో మైనారిటీలు తీవ్రంగా మత వివక్షకు గురవుతున్నారని, ఇందుకు ఆ దేశ ప్రభుత్వం కూడా సాయం చేస్తోందని భారత్ తెలిపింది. ముందుగా మైనారిటీలపై వివక్షను అడ్డుకోవాలని, ఆ తర్వాత మానవ హక్కులపై లెక్చర్లు ఇవ్వాలని హితవు పలికింది. ప్రపంచంలో అత్యధిక మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటని, ఈ విషయంలో ఆ దేశం రికార్డు చాలా అధ్వానంగా ఉందని భారత్ మండిపడింది. జెనీవాలో జరుగుతున్న యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ 60వ సమావేశంలో భారత్ తరపున జెనీవా శాఖ ప్రతినిధి కేఎస్ మొహమ్మద్ హుస్సేన్ మాట్లాడారు.
‘‘ప్రపంచంలోనే మానవ హక్కుల రికార్డు అత్యంత దారుణంగా ఉన్న దేశం.. మానవ హక్కులపై లెక్చర్లు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. ఇలాంటి వేదికను భారత్ కు వ్యతిరేకంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నది. భారత్ పై దుష్ర్పచారం చేసే ప్రయత్నం చేస్తే పాక్ బండారమే బయటపడుతుంది. భారత్ పై విషం చిమ్మడం బదులు సొంత దేశంలో వివక్షకు గురవుతున్న మైనారీల గురించి ఆలోచిస్తే బాగుంటుంది” అని హుస్సేన్ వ్యాఖ్యానించారు. కాగా.. అంతకుముందు కాశ్మీర్ వివాదం గురించి పాకిస్తాన్ మరోసారి ప్రస్తావించింది. దాంతో కాశ్మీర్ ఎప్పటికీ తమదేనని భారత్ స్పష్టం చేసింది.