ఆగస్ట్ 15 నాటికి కరోనా వ్యాక్సిన్

ఆగస్ట్ 15 నాటికి కరోనా వ్యాక్సిన్

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా పెరుగుతోన్న క్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కీలక ప్రకటన చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం నాటికి అంటే ఆగస్ట్ 15 లోపు దేశీయ తొలి కరోనా వ్యాక్సిన్‌‌ను లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించింది. దీని కోసం మెడికల్ ఇన్‌‌స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌‌ స్పీడ్ పెంచాలని ఐసీఎంఆర్ సూచించింది. నిమ్స్‌‌తో సహా దేశంలోని 13 హాస్పిటల్స్‌‌లో క్లినికల్ ట్రయల్స్‌‌కు సహకరించాలంటూ ఐసీఎంఆర్ ఒక సర్క్యూలర్ జారీ చేసింది. కరోనా నిర్మూలన కోసం హైదరాబాద్‌‌కు చెందిన బయోటెక్నాలజీ కంపెనీ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్(బీబీఐఎల్) ఐసీఎంఆర్‌‌‌‌ భాగస్వామ్యంలో ‘కోవ్యాక్సిన్’ను రూపొందించింది. ఈ వ్యాక్సిన్ హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్ చేపట్టాలని హాస్పిటల్స్‌‌కు ఐసీఎంఆర్ సూచించింది. ఈ నెల 7 నుంచే హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాలని కూడా ఐసీఎంఆర్ తెలిపింది. అన్ని ట్రయల్స్ పూర్తి చేసుకుని, ఆగస్ట్ 15 కల్లా ‘పబ్లిక్ హెల్త్ యూజ్‌‌’కు వ్యాక్సిన్ అందుబాటులోకి తేవాలని పేర్కొంది. ఇప్పటికే జంతువులపై ప్రయోగించిన వ్యాక్సిన్ ట్రయల్స్ మెరుగైన ఫలితాలను ఇచ్చాయని, వ్యాక్సిన్ ప్రస్తుతం హ్యుమన్ ట్రయల్స్‌‌ దశలో ఉందని ఐసీఎంఆర్ తెలిపింది. దేశీయంగా డెవలప్‌‌ చేస్తున్న తొలి వ్యాక్సిన్‌‌ క్లినికల్‌‌ ట్రయల్స్‌‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) గత నెల 29నే అనుమతి ఇచ్చిందని భారత్ బయోటెక్ ఇప్పటికే ప్రకటించింది. క్లినికల్ ట్రయల్స్ కోసం ఐసీఎంఆర్ ఎంపిక చేసిన హాస్పిటల్స్‌‌లో మన నిమ్స్‌‌తో పాటు కింగ్‌‌జార్జ్‌‌ హాస్పిటల్‌‌ (విశాఖపట్నం) సహా మొత్తం 13 హాస్పిటల్స్‌‌ ఉన్నాయి. క్లినికల్ ట్రయల్స్ వేగం పెంచాలని సూచిస్తూ.. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ ఈ 13 మెడికల్ ఇన్‌‌స్టిట్యూట్స్‌‌కు, భారత్ బయోటెక్‌‌కు ఒక లెటర్‌‌ రాశారు. ప్రభుత్వం ఉన్నతస్థాయిలో మానిటర్ చేస్తోన్న టాప్ ప్రయార్టీ ప్రాజెక్ట్‌‌లలో కరోనా వ్యాక్సిన్ ఒకటని భార్గవ పేర్కొన్నారు. హైదరాబాద్‌‌లోని జెనోమ్ వ్యాలీలో ఉన్న తన ఫెసిలిటీలో భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌‌ను రూపొందించింది.

ప్రీ క్లినికల్ ట్రయల్స్‌‌లో మెరుగైన ఫలితాలు..

ఐసీఎంఆర్‌‌‌‌లో భాగమైన పుణేలోని నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సాయంతో, కోవ్యాక్సిన్‌‌ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. ఈ నెలలోనే దేశవ్యాప్తంగా హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్ చేపడతామని భారత్ బయోటెక్ కూడా చెప్పింది. కంపెనీ నిర్వహించిన ప్రీ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు చాలా మెరుగ్గా వచ్చాయని పేర్కొంది. వ్యాక్సిన్ ట్రయల్స్ ఏమేరకు వచ్చిందనే విషయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భారత్‌‌ బయోటెక్‌‌తో పాటు మన దేశానికి చెందిన మరో రెండు సంస్థలు కూడా కరోనా వ్యాక్సిన్‌‌ను అభివృద్ధి చేశాయి. వాటిలో అహ్మదాబాద్‌‌కు చెందిన జైడస్ కాడిలా హెల్త్‌‌కేర్ కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 18 వ్యాక్సిన్ సంస్థలు కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌‌ దశలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో, వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకురావాలని సైంటిస్ట్‌‌లు కృషి చేస్తున్నారు. కొన్ని సంస్థలు పెద్ద మొత్తంలో ఫేజ్‌‌ 3 ట్రయల్స్‌‌ కు సిద్ధమయ్యాయి. ఫేజ్‌‌ 3 ట్రయల్స్ తొలుత అమెరికాలో ప్రారంభమవుతాయని, ఆగస్ట్ ప్రారంభంలో ఈ ట్రయల్స్ జరుగుతాయని రిపోర్ట్‌‌లు వచ్చాయి. ఫైజర్, బయోఎన్‌‌టెక్ రూపొందించిన వ్యాక్సిన్‌‌ ప్రిలిమినరీ టెస్ట్‌‌ల డేటా పాజిటివ్‌‌గా వచ్చినట్టు రిపోర్ట్‌‌లు పేర్కొన్నాయి. ఈ ఏడాది చివరి కల్లా వ్యాక్సిన్‌‌ను పూర్తిగా అభివృద్ధి చేసి, 10 కోట్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు ఈ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అమెరికా వ్యాక్సిన్ కంపెనీ ఇనోవియో వ్యాక్సిన్ ఫేజ్‌‌ 1 ట్రయల్‌‌లో 94 శాతం మంది తమ ఇమ్యూన్ రెస్పాన్స్‌‌ను ఆరు వారాల్లో పెంచుకున్నారు. దీంతో ఇనోవియో సంస్థ కూడా ఫేజ్‌‌ 2, 3 ట్రయల్స్‌‌కు సిద్దమవుతోంది.

వాలంటరీగా సహకరించాలి…

వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్‌‌లో వ్యక్తులే వాలంటరీగా వచ్చి క్లినికల్ ట్రయల్స్‌‌కు సహకరించాల్సి ఉంటుంది. అయితే వాలంటరీగా ఇప్పుడు ఎవరు ముందుకు వస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్‌‌ను కూడా పలు దశలలో చేస్తారు. కరోనా సోకని వారిపైనే ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ చేస్తారు. ఇప్పటికే కరోనా వచ్చిన వారి శరీరంలో యాంటీ బాడీస్ ఉండటం వల్ల వీరు ట్రయల్స్‌‌కు పనికిరారు.

భారత్ బయోటెక్ ఇప్పటికే పలు వైరస్‌‌లకు వ్యాక్సిన్లను అభివృద్ది చేసింది. జికా వైరస్ వ్యాక్సిన్‌‌ను ప్రపంచంలో తొలిసారి కనుగొన్నది భారత్ బయోటెక్‌‌ కంపెనీనే. ప్రపంచంలో అత్యంత చౌకైన హెపటైటీస్ వ్యాక్సిన్ కూడా భారత్ బయోటెక్ కంపెనీనే తీసుకొచ్చింది. పోలియో, రాబిస్, రోటావైరస్, చికెన్‌‌గున్యా లాంటి వ్యాధులకు కూడా భారత్ యమోటెక్ వ్యాక్సిన్లను రూపొందించింది. ఈ కంపెనీ ఎండీ, ఛైర్మన్‌‌గా క్రిష్ణ ఎల్లా. ఈయన తమిళనాడులోని ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు.

క్లినికల్ ట్రయల్స్​ జరిగే హాస్పిటల్స్​ ఇవే..

  • నిమ్స్​, ​హైదరాబాద్
  • కింగ్ జార్జ్ హాస్పిటల్, వైజాగ్​
  • యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, రోహ్తక్, హర్యానా
  • ఎయిమ్స్, అన్సారీ నగర్, న్యూఢిల్లీ
  • ఆల్‌‌ ఇండియా ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పాట్నా, బీహార్
  • జీవన్‌‌రేఖ హాస్పిటల్, బెల్గాం, కర్నాటక
  • గిలూర్కార్ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్, నాగ్‌‌పూర్, మహారాష్ట్ర
  • రానా హాస్పిటల్, గోరఖ్‌‌పూర్
  • ఎస్‌‌ఆర్‌‌‌‌ఎం మెడికల్ కాలేజీ, కట్టంకులతూర్, తమిళనాడు
  • ప్రఖార్ హాస్పిటల్, కాన్పూర్

జియోలోకి ఇంటెల్