మన దేశంలో ఆహార నిల్వలు మస్తు ఉన్నయ్

మన దేశంలో ఆహార నిల్వలు మస్తు ఉన్నయ్
  •     దునియా మొత్తానికీ ఆహారం అందించేందుకు సిద్ధమన్న ప్రధాని నరేంద్ర మోడీ
  •     మిగులు ధాన్యాన్ని  విదేశాలకు పంపాలంటున్న నిఫుణులు

న్యూఢిల్లీ: ఉక్రెయిన్- రష్యా యుద్ధం ఎఫెక్ట్ చాలా దేశాల్లో ఆహార సంక్షోభానికి దారితీస్తుందని, జనం ఆకలితో అల్లాడే పరిస్థితి వస్తుందని ఆందోళనలు నెలకొన్నయ్.. అయితే, ఈ ముప్పును తప్పించే శక్తి మన దేశానికి ఉందని నిపుణులు చెప్తున్నారు. ప్రపంచం మొత్తానికి తిండి పెట్టేందుకు సరిపడా మన దగ్గర ఆహార ధాన్యాలు ఉన్నయని అంటున్నరు. ప్రపంచంలోని చాలా దేశాలకు అవసరమైన గోధుమలు, బార్లీ, మొక్కజొన్న, సన్​ఫ్లవర్​ నూనె మొదలైన వాటిలో దాదాపు 30 శాతానికిపైగా  రష్యా, ఉక్రెయిన్​ దేశాలే సరఫరా చేస్తుంటాయి. యుద్ధం కారణంగా ఇక్కడి నుంచి ఆహార ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్న పరిస్థితుల్లో మనదేశంవైపు ప్రపంచం చూస్తోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో ప్రధాని మోడీ భేటీ సందర్భంగా ప్రపంచానికి ఆహార ధాన్యాలు అందించడానికి ఇండియా సిద్ధంగా ఉందని చెప్పారు. వరల్డ్​ ట్రేడ్​ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీవో) అనుమతి ఇస్తే రేపటి నుంచే ప్రపంచానికి ఆహారాన్ని సరఫరా చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. అయితే మనదేశం ప్రపంచదేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేయడం సాధ్యమవుతుందా? అందుకు మనదేశంలోని పరిస్థితులు సహకరిస్తాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఎదురవుతున్నాయి.

ఆకాశాన్నంటున్న ధరలు

సాగు సమస్యల కారణంగా ఉక్రెయిన్​ యుద్ధానికి ముందే ప్రపంచవ్యాప్తంగా కమాడిటీల ధరలు పది సంవత్సరాల గరిష్టానికి చేరుకున్నాయి. యుద్ధం మొదలైన తర్వాత అవి ఆకాశాన్నంటాయి. యూఎన్​ ఫుడ్​ అండ్ అగ్రికల్చర్​ ఆర్గనైజేషన్ (యూఎన్ఎఫ్ఏవో) ఫుడ్​ ప్రైస్​ ఇండెక్స్​ ప్రకారం.. 1990 తర్వాత ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి. ప్రపంచానికి గోధుమలను ఎగుమతి చేసే దేశాల్లో రష్యా, ఉక్రెయినే కీలకం. ఈ రెండు దేశాల నుంచే ఏటా మూడోవంతు గోధుమలు ప్రపంచ దేశాలకు చేరుతున్నాయి. అలాగే 55 శాతం సన్​ఫ్లవర్​ ఆయిల్​ ఎగుమతులు ఈ దేశాల నుంచే సాగుతున్నాయి. మొక్కజొన్న, బార్లీ ఎగుమతులు కూడా 20 శాతానికిపైగా జరుగుతాయి. ఈ ఏడాది 14 మిలియన్​ టన్నుల గోధుమలు, 16 మిలియన్​ టన్నుల మొక్కజొన్నలను రష్యా, ఉక్రెయిన్​ ఎగుమతి చేయాల్సి ఉందని యూఎన్ఎఫ్ఏవో అంచనా వేసింది. ‘‘సరఫరాలో ఎదురవుతున్న సమస్యలు, రష్యా, ఉక్రెయిన్​ మధ్య వార్ కారణంగా ఈ అంచనాలను అందుకోవడం కష్టమే. అందువల్ల ఇండియా ముందుకొచ్చి ఎగుమతులను పెంచాలి. ముఖ్యంగా తమ దగ్గర ఎక్కువగా నిల్వ ఉన్న గోధుమలను ప్రపంచ దేశాలకు అందించాలి”అని యూఎన్ఎఫ్ఏవోకి చెందిన ఎకనమిస్ట్ ఉపాలి గల్కేటి అరచిలగే చెప్పారు.

సవాళ్లూ ఉన్నయ్..

మనదేశం ఆహార ధాన్యాలను ఎగుమతి చేయడానికి సంబంధించి కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. “ప్రస్తుతం మన దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయి. అయితే కొన్ని ఆందోళనలు ఉన్నాయి. ప్రపంచానికి ఆహారం ఇవ్వడానికి మనం తొందరపడకూడదు” అని ఢిల్లీకి చెందిన అగ్రి ఎక్స్​పర్ట్ హరీశ్​ దామోదరన్​ చెప్పారు. ప్రస్తుతం మనదేశంలో గోధుమల సీజన్​ నడుస్తోంది. అధికారులు రికార్డు స్థాయిలో 111 మిలియన్​ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ, దామోదరన్​ లాంటి వాళ్లు దీనితో ఏకీభవించడం లేదు. దిగుబడి తగ్గే అవకాశం ఉందని, ఎరువులు, అధిక వర్షాలు, ముందే మొదలైన వేసవి వేడి మొదలైన వాతావరణ మార్పులు దీనికి కారణమని ఆయన చెబుతున్నారు. వ్యవసాయానికి కీలకమైన ఎరువుల కొరత మరో చిక్కు ప్రశ్నగా మారింది. యుద్ధం తర్వాత మన దగ్గర ఎరువుల నిల్వలు తగ్గిపోయాయి. డీఅమోనియం పాస్పేట్, నైట్రోజన్, పాస్సేట్, సల్ఫర్, పొటాష్ కలిగిన ఎరువులను మనదేశం దిగుమతి చేసుకుంటోంది. రష్యా, బెలారస్ నుంచే ప్రపంచానికి 40 శాతం పాస్పేట్ సరఫరా అవుతోంది. ఎరువుల కొరత వచ్చే పంటల సీజన్​పై ప్రభావం చూపుతుందని, దీని వల్ల దిగుబడులు తగ్గొచ్చని నిఫుణులు చెప్తున్నరు. ఒకవేళ యుద్ధం మరింత కాలం కొనసాగితే ఎగుమతులకు సంబంధించి కూడా సమస్యలు ఎదురవుతాయి.

ఇప్పుడు మన దేశంలో 74 మిలియన్ టన్నుల నిల్వలు

ప్రపంచంలోనే బియ్యం, గోధుమల ఉత్పత్తిలో మనదేశం రెండోస్థానంలో ఉంది. ఏప్రిల్​ ప్రారంభం నాటికి, మన దగ్గర 74 మిలియన్ టన్నుల బియ్యం, గోధుమల నిల్వలున్నా యి. ఇందులో 21 మిలియన్ టన్నులను దీర్ఘకాలిక అవసరాలు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్​ సిస్టం(పీడీఎస్) కోసం నిల్వ ఉంచుతారు. వీటిని తక్కువ ధరకే 70 కోట్ల మంది పేదలకు ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటికే దాదాపు 150 దేశాలకు బియ్యం, మరో 68 దేశాల కు గోధుమలను ఎగుమతి చేస్తోంది. 2020–21లో మనదేశం 7 మిలియన్​ టన్నుల వరకు గోధుమలు ఎగుమతి చేసింది. ఏప్రిల్ నుంచి జులై మధ్య మరో 3 టన్నులు ఎగుమ తి చేసేందుకు ఒప్పందం కుదిరింది.  2021–22లో అగ్రి ఎగుమతులు 50 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో 22 మిలియన్ టన్నుల బియ్యం, 16 మిలియన్​ టన్నుల గోధుమలను ఎగుమతిచేసే సామర్థ్యం ఇండియాకు ఉందని ఐసీఆర్​ఐఈఆర్​ లో అగ్రికల్చర్​​ ప్రొఫెసర్​ అశోక్ గులాటి చెప్పారు.